దేశం వెలిగిపోతోందా.. పేద‌రికంలో నలిగిపోతోందా!

By KTV Telugu On 13 October, 2022
image

– ఆత్మ‌నిర్భ‌ర్ ఎక్క‌డ బాబూ.. పైపైనేనా మ‌న డాబు!
– అదానీని కాదు ఏ దారీలేని పేద‌ల‌ను చూడండి!

క‌రోనా. మూడ‌క్ష‌రాల ఈ మ‌హ‌మ్మారి పేరెత్తితేనే అంతా వ‌ణికిపోతారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెను విధ్వంసాన్ని సృష్టించింది ఈ వైర‌స్‌. అణుబాంబు అయినా కొంత ప్రాంతాన్నే నాశ‌నం చేస్తుంది. కానీ వైర‌స్ ప‌గ‌బ‌ట్టిన‌ట్లు ప్ర‌పంచాన్నే క‌బ‌ళించింది. ఆర్థిక‌మూల‌లు, జీవ‌న‌ప్ర‌మాణాల‌ను దారుణంగా దెబ్బ‌తీసింది. క‌రోనా వైర‌స్‌తో దాదాపుగా ప్ర‌పంచ‌దేశాలు సంక్షోభాన్ని చ‌విచూశాయి. ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలు మూత‌బ‌డ్డాయి. కుటుంబాల‌కు కుటుంబాలు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయాయి.

క‌రోనా మ‌హ‌మ్మారిపై తాజాగా ప్రపంచ బ్యాంకు ఓ నివేదిక విడుద‌ల‌చేసింది. ఆ నివేదిక‌తో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి. కరోనా ప్ర‌భావంతో 2020లో ప్రపంచవ్యాప్తంగా 7.1 కోట్ల మంది నిరుపేదలుగా మారిపోయారు. అందులో 79 శాతం మంది మ‌న‌వాళ్లే. దేశంలోని 5.6 కోట్ల మంది ప్ర‌జ‌లు క‌రోనా క‌బంధ‌హ‌స్తాల్లో న‌లిగిపోయారు. నిరుపేద‌లుగా మిగిలిపోయారు. వైరస్‌ ప్రభావంతో ప్రపంచ పేదరికం రేటు సంవ‌త్స‌ర‌కాలంలోనే 8.4నుంచి 9.3కి పెరిగిన‌ట్లు నివేదిక వెల్ల‌డించింది. దీంతో ప్ర‌పంచవ్యాప్తంగా నిరుపేద‌ల సంఖ్య 70 కోట్లకు చేరింది.

అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశాలే ప్రపంచ పేదరికం పెరుగుదలకు ప్రధాన కార‌ణ‌మంటోంది ప్ర‌పంచ‌బ్యాంకు నివేదిక‌. నిరుపేద‌ల సంఖ్య పెర‌గ‌టంతో పాటు ఆర్థికంగా కూడా భారత్‌ తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించింది. అదే స‌మ‌యంలో ప్రపంచంలోనే జనాభాలో అగ్ర‌స్థానంలో ఉన్న చైనామీద మాత్రం దీని ప్ర‌భావం నామ‌మాత్రంగానే ఉంది. పావర్టీ అండ్‌ షేర్డ్‌ ప్రాస్పరిటీ-2022 పేరుతో ప్రపంచ బ్యాంకు ఈ నివేదికని రూపొందించింది. 2011 నుంచి ప్రభుత్వాలు దేశంలో పేదరికానికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెల్లడించక‌పోయినా ఈనివేదిక మ‌న ఆత్మ‌నిర్భ‌ర భార‌తంలోని డొల్ల‌త‌నాన్ని బ‌య‌ట‌పెట్టింది.