ఆస్ట్రేలియాలో మర్డర్‌..ఇండియాలో అరెస్ట్‌.. క్రైమ్‌ కథాచిత్రమ్‌!

By KTV Telugu On 26 November, 2022
image

ఆమెవరో కూడా తెలీదు.. ఆయినా మర్డర్‌!
కుక్క మొరిగిందని మర్డర్‌.. నాలుగేళ్ల తర్వాత అరెస్ట్‌!

క్షణికావేశంలోనూ హత్యలు జరుగుతుంటాయి. మనిషిలో మృగం మేల్కొన్నప్పుడు మంచీచెడ్డా ఆలోచించే విచక్షణ ఉండదు. అకారణంగా ఒక నిండు ప్రాణం పోయాక పశ్చాత్తాపపడ్డా ప్రయోజనం ఉండదు. ఆస్ట్రేలియాలో నాలుగేళ్ల క్రితం ఓ హత్య జరిగింది. కాపుకాసి కక్షగట్టి చంపారని అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని భావించారు. కానీ అక్కడ మర్డర్‌చేసి భారత్‌కి తిరిగొచ్చేసిన నిందితుడు చట్టంనుంచి తప్పించుకోలేకపోయాడు. హంతకుడి ఆచూకీ చెబితే ఒక మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్స్‌ అంటే మన కరెన్సీలో అక్షరాలా ఐదున్నరకోట్లు. అంత భారీ ఆఫర్‌ ఇచ్చారంటేనే ఆ కేసుని ఆస్ట్రేలియా పోలీసులు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అర్ధమవుతుంది. నాలుగేళ్లక్రితం అదృశ్యమైన ఆస్ట్రేలియాకు చెందిన 24ఏళ్ల యువతి మృతదేహం బీచ్‌లో దొరికింది. పోలీసులు ఎంత ప్రయత్నించినా మొదట కేసు చిక్కుముడి వీడలేదు. చివరికి నిందితుడెవరో పసిగట్టేసరికి అతను విమానమెక్కేశాడు. భారత్‌కి వచ్చేశాడు. ఎన్ని వేషాలు వేసినా, రూపాలు మార్చినా చివరికి నాలుగేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు.

ఆస్ట్రేలియాలో 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ 2018 అక్టోబర్‌ 21 నుంచి కనిపించకుండా పోయింది. మర్నాడు బీచ్‌ ఇసుకలో పాతిపెట్టిన తోయా మృతదేహం బయటపడింది. ఆమె పెంపుడు కుక్క అక్కడికి దగ్గర్లోనే ఓ చెట్టుకు కట్టేసి ఉంది. లోతుగా దర్యాప్తు చేశాక రాజ్విందర్‌ సింగ్‌ అనే మేల్‌ నర్సుపై పోలీసులు అనుమానపడ్డారు. అయితే పట్టుకునేలోపే అతను దేశం విడిచి పారిపోయాడు. ఈ మోస్ట్‌ వాంటెడ్‌ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన క్వీన్స్‌లాండ్‌ పోలీసులు పోయినేడాది భారత విదేశాంగశాఖ సాయం కోరారు. రాజ్విందర్‌ చివరికి ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. నాలుగేళ్లుగా రూపం మారుస్తూ అడ్రస్‌లు మారుస్తూ తిరుగుతున్న నిందితుడు దొరికాక హత్యాకారణం తెలిసి పోలీసులు నివ్వెరపోయారు.

భారత సంతతికి చెందిన రాజ్విందర్‌ సింగ్‌ ఆస్ట్రేలియాలో మేల్‌ నర్సుగా పని చేసేవాడు. 2018 అక్టోబర్‌ 21న భార్యతో గొడవ పడ్డాడు. ఆ కోపంలోనే కత్తి, కొన్ని పండ్లు తీసుకుని మానసిక ప్రశాంతత కోసం దగ్గర్లోని బీచ్‌కు వెళ్లాడు. అదే సమయంలో తోయా కార్డింగ్లీ అనే యువతి తన పెంపుడుకుక్కతో అక్కడికొచ్చింది. ఆ కుక్క పదేపదే మొరగటంతో భార్యపై కోపం ఆ యువతిపై ప్రదర్శించాడు. మాటామాటపెరిగి కత్తితో పొడిచి చంపాడు. దగ్గర్లోని ఇసుకలో పాతేశాడు. ఇంటికి తిరిగిగొచ్చి రాత్రంతా టెన్షన్‌గా గడిపి మర్నాడు తట్టాబుట్టా సర్దేశాడు. ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు కూడా జారీ అయిన రాజ్విందర్‌సింగ్‌ని ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తయ్యాక ఆస్ట్రేలియా పోలీసులకు అప్పగిస్తారు.