“భారతీయ రాష్ట్ర సమితి” ఆషామాషీ కాదు!

By KTV Telugu On 29 April, 2022
image

తెలంగాణ రాష్ట్ర సమతి అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎంత కసరత్తు చేశారో ప్లీనరీలో వెల్లడించారు. తన జాతీయ రాజకీయ ఆలోచనలు ఆషామాషీ కాదని ఆయన మాటలతోనే తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితిలాగా… భారతీయ రాష్ట్ర సమితిని పెట్టాలని ఆయన అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులు తాము చేయాలనుకున్న పనిని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి.. ఆ ప్రకారం కొన్ని కార్యక్రమాలు నిర్వహింపచేసి ప్రకటిస్తారు. కేసీఆర్ కూడా అదే తరహాలో ముందుకెళ్తున్నారు.

” భారతీయ రాష్ట్ర సమితి”కి కసరత్తు దాదాపుగా పూర్తి !

తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్ఎస్‌ను కేసీఆర్ ఏర్పాటు చేశారు. పేరుతోనే తెలంగాణ ఉన్న కారణంగా జాతీయ స్థాయిలో విస్తరించే అవకాశం లేకుండా పోయింది. కేసీఆర్‌కు జాతీయ రాజకీయాలపై సంపూర్ణమైన అవగాహన ఉంది. అన్ని సమీకరణాలు చూసిన తర్వాతనే తృతీయ ఫ్రంట్ లేదా.. మరో కూటమిలో చేరడం వర్కవుట్ కాదనే అంచనాకు వచ్చారు. నిజానికి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ఏర్పాట్లు చేసుకున్నారన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. జాతీయ పార్టీ పెట్టాలంటే తెలంగాణ నేతగా అయితే సాధ్యం కాదు. జాతీయ నేతగానే గుర్తింపు పొందాలి. కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై కసరత్తు చేస్తున్నారు. అవి ఓ కొలిక్కి వస్తున్నందునే కేసీఆర్ జాతీయ పార్టీ గురించి ప్రకటించారని భావిస్తున్నారు. తుది కసరత్తు పూర్తయిన తర్వాత దేశం మొత్తం ఆకర్షించేలా భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి .. జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆర్థిక వనరులూ సమకూర్చున్నానని నేరుగానే చెప్పిన కేసీఆర్ !

జాతీయ రాజకీయాలు చేయాలంటే రూ. ఆరు వందల కోట్లు కావాలని.. టీఆర్ఎస్‌కు అంతకు మించిన శక్తి ఉందని ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఆయన ప్లీనరీలో టీఆర్ఎస్ ఆర్థిక శక్తి గురించి పదే పదే చెప్పారు. ఇప్పటి రాజకీయాలకు డబ్బుతోటే పని. దానికి తగ్గట్లుగా కేసీఆర్ ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ తనకు తానుగా ఓ ఇమేజ్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఖర్చు అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణానికి కూడా ఆయన భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజల విరాళాలతోనే జాతీయ పార్టీని నిర్మిస్తాననికి కేసీఆర్ చెప్పకనే చెప్పారు.

ఫ్రంట్‌ల ఆలోచన లేదని తేల్చేసిన కేసీఆర్!

ఇప్పటి వరకూ కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్‌ల కోసం ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా వర్కవుట్ కాలేదు. ఆ కారణంగానే కేసీఆర్ సొంత రాజకీయ పార్టీ దిశగా వెళ్తున్నారు. కేసీఆర్ ఆలోచనలకు.. ఇతర పార్టీల నేతల ఆలోచనలకు చాలా తేడా ఉంది. వారు కేంద్రంలో పరిస్థితిని బట్టి తమకు వచ్చే అవకాశాలను బట్టి నిర్ణయం తీసుకుంటారు. కానీ కేసీఆర్ అలా కాదు స్వయంగా బరిలోకి దిగి.. తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అందుకు సొంత పార్టీనే ముఖ్యమని డిసైడయ్యారు.
తటస్థులను జాతీయ పార్టీలో కీలకం చేసే అవకాశం !

జాతీయస్థాయిలో ప్రముఖులైన వారు.. తటస్థులు… వివిధ రంగాల్లో కీలకంగా ప్రముఖంగా ఉన్న వారిని కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. రాకేష్ టికాయత్ లాంటి రైతు నేతల దగ్గర్నుంచి అనేక మంది మాజీ సివిల్ సర్వీస్ అధికారులు… సంఘ సేవకులు.. ప్రముఖులతో కేసీఆర్ ఇప్పటికే ఓ దఫా చర్చలు జరిపారని అంటున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి ఆషామాషీ ప్రకటన కాదని.. చాలా పక్కా ప్రణాళికతోనే ముందుకెళ్తున్నారని స్పష్టమవుతుంది. అది సక్సెస్ అవుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే కేసీఆర్ ప్రయత్నాలు మాత్రం సీరియస్‌గా సాగుతున్నాయని అనుకోవచ్చు.