అణుబాంబే రష్యా ఆఖరి ఆయుధమా?

By KTV Telugu On 1 October, 2022
image

* పక్కా ప్లాన్‌తో పుతిన్‌..ఏం చేస్తుంది ఉక్రెయిన్‌?
* రెఫరెండం.. యుద్ధనీతిలో పుతిన్‌ కొత్త విన్యాసం

లొంగిపొమ్మని హెచ్చరిస్తారు. అయినా వినకుండా తిరగబడటంతో కాల్పులు జరపాల్సి వచ్చిందంటారు. ఎన్‌కౌంటర్లలో వినిపించే రొటీన్‌ స్టోరీనే ఇది. నాటోన్లీ ఎన్‌కౌంటర్స్‌ రెండు దేశాల యుద్ధంలోనూ ఇదే జరుగుతోంది. కార్తీకదీపం సీరియల్‌ అన్నా అయిపోయేలా ఉందిగానీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ఎండ్‌ కార్డ్‌ పడటం లేదు. ఉక్రెయిన్‌నుంచి ప్రతిఘటన పెరిగేకొద్దీ రష్యా తోకతొక్కిన తాచులా రెచ్చిపోతోంది. పరువుపోయే పరిస్థితే వస్తే ఎంతకైనా తెగిస్తానంటోంది.
మొన్నటిదాకా చర్చలకు ఆహ్వానించాలని ఉక్రెయిన్‌ కోరుకుంది. ఇప్పుడు రష్యావైపు నుంచి ఆ పిలుపు వచ్చింది. కాకపోతే ఉక్రెయిన్‌ కోరుకుంది వేరు. రష్యా ఆశిస్తోంది వేరు. మా జోలికి రావద్దనేది ఉక్రెయిన్‌ ప్రతిపాదన. బేషరతుగా లొంగిపోవాలనేది రష్యా ఆకాంక్ష. రెఫరెండం నిర్వహించి ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది ఆయా ప్రాంతాలను అధికారికంగా రష్యాలో విలీనం చేసుకున్నట్లు ప్రకటించారు పుతిన్‌. డోనెట్స్క్‌, లుహాన్స్క్‌, ఖైరన్‌, జపోరిజ్జియా అధికారికంగా విలీనం చేసుకుని ప్రజల సాక్షిగా రష్యా సంబరాలు కూడా చేసుకుంది. ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్‌ చేసిన ప్రకటన వెనుక పెద్ద ప్లానే ఉంది. ఇప్పటికే రష్యా భారీగా సైనికుల్ని, ఆయుధాల్ని నష్టపోయింది. అలాగని వెనకడుగువేసి ఓటమిని అంగీకరించేందుకు రష్యా సిద్ధంగా లేదు. ఉక్రెయిన్‌లోని వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలను రష్యాలో కలుపుకోవాలన్నదే పుతిన్‌ లక్ష్యం. అందుకే ఒక్కో ప్రాంతాన్నీ రెఫరెండం పేరుతో విలీనం చేసుకుంటోంది.
నాలుగు ప్రాంతాల్ని సొంతం చేసుకున్న రష్యా వాటిజోలికి రావద్దని ఉక్రెయిన్‌ని హెచ్చరించింది. ఆ ప్రాంతాల్ని తిరిగి స్వాధీనం చేసుకునే దుస్సాహసం చేస్తే ఊరుకునేది లేదంది. ఆ పరిస్థితి వస్తే తమ దగ్గరున్న అన్ని సాధనాలూ ఉపయోగిస్తామంటున్నారు పుతిన్‌. అన్ని అంటే అణ్వాయుధాలు కూడా అందులో ఉన్నాయనే. విలీన ప్రకటన చెల్లదని నాటో, ఐరోపా అంటున్నా ఈ యుద్ధంలో అవి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేవు. రష్యామీద మరిన్ని ఆంక్షలు విధిస్తూ, ఉక్రెయిన్‌కి ఆయుధ సహకారం అందించటం తప్ప ఈ యుద్ధానికి ముగింపు పలికే పరిస్థితి అయితే లేదు. రష్యా నెక్ట్స్‌ టార్గెట్‌ పారిశ్రామికంగా సంపన్నమైన డాన్‌బాస్‌. ఉక్రెయిన్‌నుంచి నాలుగు ప్రాంతాలను రష్యా తన భూభాగంలో కలిపేసుకున్న సమయంలోనే నాటో సత్వర సభ్యత్వ దరఖాస్తుపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంతకం చేశారు. చేజారిన తమ నగరాల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్‌ బలగాలు గట్టిగానే పోరాడుతున్నాయి. నేను చెప్పాను. అయినా ఉక్రెయిన్‌ వినలేదంటూ రష్యా అమ్ములపొదిలోంచి అణ్వాయుధాన్ని బయటికి తీసేరోజు ఎంతోదూరంలో లేదు. తెరవెనుక నుంచి ఉస్కో ఉస్కో అంటూ ఉక్రెయిన్‌ని ఉసిగొల్పుతున్న పశ్చిమదేశాలు ఆ పరిస్థితే వస్తే చేతులెత్తేస్తాయా? మరో ప్రపంచయుద్ధానికి మేముసైతం అంటూ రంగంలోకి దిగుతాయా?