కేంద్ర మంత్రి నిర్మలమ్మకు రాష్ట్ర మంత్రి సబితమ్మ కౌంటర్‌

By KTV Telugu On 10 October, 2022
image

ఒకవైపు మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణకు చెందిన బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే…మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి మంత్రి నిర్మలా సీతారామన్‌కు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మధ్య ట్విట్టర్‌ వార్‌ షురువైంది. మహిళలను రాష్ట్ర క్యాబినెట్ లో చేర్చుకుంటే చెడు జరుగుతుందని తాంత్రికులు చెప్పడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ మహిళలకు మంత్రి పదవులు ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తాంత్రికుడు చెప్పినందుకే మంత్రి పదవులు ఇవ్వలేదా…ఇతర కారణాలేమైనా ఉన్నాయా తెలియదు కానీ మహిళలకు మాత్రం కేసీఆర్‌ న్యాయం చేయలేదని నిర్మలా సీతారామన్‌ ఆరోపించారు. దీనిపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. అమ్మా, నిర్మలా సీతారామన్ గారూ… తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులం ఉన్నాం అని కౌంటర్ ఇచ్చారు. తనతో పాటు తన కొలీగ్ సత్యవతి రాథోడ్ గత మూడేళ్లుగా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నాం. ఇద్దరు మహిళా మంత్రులు తెలంగాణ క్యాబినెట్ లో ఉన్నారన్న కనీస సమాచారం మీకు తెలియకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. తన ట్వీట్‌కు నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జతచేశారు. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. సబితమ్మ సమాధానంపై తెలంగాణ బీజేపీ శాఖ స్పందించింది. మీ విషయం వేరు..మీరు కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో జాయినయ్యి మంత్రి అయ్యారు. తాంత్రికుడు చెప్పినందువల్ల కేసీఆర్‌ మొదటి క్యాబినెట్లో మహిళా మంత్రులను చేర్చుకోలేదని నిర్మలా సీతారమన్‌ చెప్పారని కేంద్ర మంత్రి మాటలను సమర్థించింది రాష్ట్ర బీజేపీ శాఖ. అంతేకాదు బ్లాక్‌ మ్యాజిక్ టాయ్‌ అని సబితమ్మను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనపై తెలంగాణ బీజేపీ శాఖ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సబితమ్మ మరో ట్వీట్‌ చేశారు. తాను మిమ్మల్ని నిర్మలమ్మా అని సంబోధిస్తే…మీ వాళ్లు నన్ను చేతబడి బొమ్మా అంటున్నారు. మీ సంస్కారానికి జోహార్లు…ఇదేనా మీరు మీ కార్యకర్తలకు నేర్పిస్తున్న సంస్కారం అని ప్రశ్నించారు. తనపై బీజేపీ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ట్యాగ్‌ చేశారు.