బీజేపీలో మరో రెబెల్ స్టార్ రెడీ అవుతున్నారా.. . కమలానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా.. ఆరోపణాస్త్రాలు సంధించి.. పార్టీ పరువు తీసిన తర్వాతే నిష్క్రమించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారా… ఇంతకీ వరుణ్ గాంధీ దారెటు… తాతల నాటి పార్టీ కాంగ్రెస్లో చేరతారా.. తృణమూల్ తీర్థం పుచ్చుకుంటారా….
వరుణ్ గాంధీ… బీజేపీ తరఫున మూడు సార్లు యూపీలోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి గెలిచారు. పార్టీ ఆయనకు టికెటిచ్చినా… విమర్శలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో కూడా ఆయన మూడు ప్రధాన ఆరోపణలు చేశారు. కేంద్రంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయలేదంటూ పరోక్షంగా మోదీ తీరును తూర్పార పట్టారు. వారం క్రితం బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే వ్యవహారాన్ని ఒక ట్వీట్ ద్వారా ప్రస్తావించారు. మోదీ ఇటీవలే అట్టహాసంగా ప్రారంభించిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేపై గతవారం వర్షం కారణంగా చాలా చోట్ల గోతులు పడ్డాయి. 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎక్స్ ప్రెస్ వే మీద ఇలాంటి గోతులు పడటమేంటని ప్రశ్నిస్తూ సంబంధింత కాంట్రాక్టర్లు, ఇంజినీర్లపై చర్యలు తీసుకోవాలని వరుణ్ డిమాండ్ చేశారు. గంగా నది శుద్ధీకరణ కోసం ప్రారంభించిన నమామి గంగే ప్రాజెక్టు ఎటు పోతుందని ఆయన ప్రశ్నించారు. ఖర్చు పెట్టిన 11 వేల 500 కోట్లు ఏమయ్యాయని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. గంగ ఇంకా కాలుష్య కాసారంగానే కొనసాగుతోందని ఆరోపించారు……
గాంధీ పేరుతో బీజేపీలో ఉండే వారు చాలా తక్కువే. సోనియా కుటుంబంపై అలిగి దూరం జరిగినందుకే మేనకా గాంధీని ఆమె కుమారుడు వరుణ్ గాంధీని బీజేపీ ప్రత్యేకంగా ప్రోత్సహించింది. తల్లీ, కొడుకులకు ఎంపీ టికెట్లిచ్చింది. మేనకాగాంధీ అయితే ఏకంగా కేంద్రమంత్రి అయ్యారు. జంతు ప్రేమికురాలిగా మేనకాగాంధీకి మంచి పేరే ఉంది. అయితే ఆమె వల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి ప్రయోజనం లేదని గ్రహించిన మోదీ, షా ద్వయం మేనకను మంత్రి పదవి నుంచి తొలగించారు. ముందే రెబెల్ లక్షణాలున్న వరుణ్… తన మాతృమూర్తిని మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర ఆగ్రహం చెందారు. విమర్శల వేగాన్ని పెంచారు. 2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పుడు వరుణ్ కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. మోదీ పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఆయన విమర్శలు మొదలు పెట్టారని చెబుతారు…
ప్రతీ పార్టీలో కొందరు రెబెల్ స్టార్స్ ఉంటారు. వారిని కొంత కాలం పార్టీలు భరిస్తూ ఉంటాయి. బీజేపీకి కూడా అదే పరిస్థితి ఎదురవుతోంది. శత్రుఘ్నసిన్హా, యశ్వంత్ సిన్హా లాంటి నేతలు మాట్లాడి మాట్లాడి.. యాష్టకు వచ్చిన తర్వాత రూట్ మార్చుకుని వేరే పార్టీలో చేరారు. వాజ్ పేయి హయాంలో శత్రుఘ్న సిన్హా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. మోదీపై విమర్శలు సందిస్తూ చివరకు కాంగ్రెస్ లో చేరి ఓడిపోయారు. ఇప్పుడు అదృష్టం కలిసొచ్చి.. దీదీ ఆహ్వానం మేరకు లోక్ సభ ఉప ఎన్నికల్లో తృణమూల్ ఎంపీగా గెలిచారు. యశ్వంత్ సిన్హా చాలా పార్టీలు మారారు. బీజేపీలో నిలదొక్కుకుంటారనుకుంటే అక్కడ మాటల తూటాలు పేల్చుతూ చివరకు వైదొలిగారు. ఆయన తనయుడు జయంత్ సిన్హా ఇప్పటికీ బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు.యశ్వంత్ కారణంగా జయంత్ కేంద్ర మంత్రి పదవిని పోగొట్టుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…. ఇప్పుడు వరుణ్ గాంధీ అదే తీరులో ప్రయాణిస్తూ పక్కచూపులు చూస్తున్నారు…
సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా కోసం…మేనకను ఇందిరాగాంధీ ఇంటి నుంచి వెళ్లగొట్టారని చెబుతారు. అది చరిత్ర .. వర్తమానంలోకి వస్తే మేనకా, వరుణ్ ఇప్పుడు రాజకీయ చౌరస్తాలో నిల్చుని ఉన్నారు. ఎటు పోవాలో తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని చెబుతున్నారు. వాళ్లు కాంగ్రెస్ లో చేరతారన్న చర్చ చాలా రోజులుగా జరుగుతున్నదే. ఏదైనా రాహుల్ నిర్ణయిస్తారని సోనియా చాలా తెలివిగా… కొడుకు కోర్టులో వేసిన తర్వాత అలాంటి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. కాంగ్రెస్ లో ప్రియాంకాగాంధీ క్రియాశీలంగా మారిన తర్వాత ఇక వేరు నాయకులు అవసరం లేదని రాహుల్ భావించినందునే వరుణ్ చేరిక ఆలస్యమైనట్లు తెలుస్తోంది. అలాగని అసలు చేరరని కూడా చెప్పలేం. మేనక, వరుణ్ మరో ఆప్షన్ కూడా చూస్తున్నారు. మమత దీదీ నేతృత్వంలోని తృణముూల్ కాంగ్రెస్ కూడా వారికి మంచి రాజకీయ అవకాశమే అవుతుందని భావిస్తున్నారు. గత నెల ఇద్దరూ కలిసి దీదీతో రహస్య భేటీ నిర్వహించినట్లు సమాచారం. ఏదేమైనా పక్షం రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది….
వరుణ్ గాంధీ ప్రస్తావించిన నమామి గంగే ప్రాజెక్టు నత్తనడక నడుస్తోందని చెప్పక తప్పదు. 2020కే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. గంగ అతి పెద్ద నది కావడం, అందులోనూ కాలుష్య కారకాలు ఎక్కువగా ఉండటంలో ఎప్పటికప్పుడు మొదటికి వస్తోంది. నమామి గంగే కింద 341 ప్రాజెక్టులు ప్రారంభిస్తే ఇప్పుడు 50 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. 147 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. పారిశ్రామిక కాలుష్యంతో పాటు, జనంలో మార్పు రాకపోవడమే ఇందుకు కారణం..