నథింగ్ టూ వర్రీ.. విఘ్నేష్ కూల్ కూల్..
ఇంత ఘోరమా? ఇంత దారుణానికి తెగబడతారా? మన సంస్కృతీ సంప్రదాయాలేంటి? అన్నిటికీ మించి చట్టం సంగతేంటి? అస్సలు వదలడానికి వీల్లేదు. వాళ్లను కోర్టుకి ఈడ్చాల్సిందే యువరానర్. శిక్ష వెయ్యాల్సిందే. ఆ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఐదేళ్ల జైలుశిక్షటగా. కవలపిల్లలు పుట్టారనే ఆనందంతో ఉన్న వాళ్లిద్దరినీ కఠినంగా శిక్షించాల్సిందే. వాళ్ల అండం..వాళ్ల డీఎన్ఏతో పుట్టిన సంతానం. మనకెందుకని ఎవరన్నా అనుకుంటున్నారా..అబ్బే మరో పనిలేనట్లు ఇప్పుడు అందరి నోళ్లలో నయనతార-విఘ్నేశ్ కవలపిల్లల ముచ్చటే!
పెళ్లయి నాలుగునెలలే అయింది. సడెన్‌గా కవలపిల్లలు పుట్టారోచ్ అని ప్రకటించగానే చాలామందికి మింగుడుపడలేదు. పెళ్లికి ఆరేళ్ల ముందునుంచే సహజీవనంలో ఉన్నారు కాబట్టి అదేం అసాధ్యమైతే కాదు. పైగా మేజర్లయినవాళ్లు ఇష్టపూర్వకంగా కలిసుండొచ్చని చట్టమే చెబుతోంది కాబట్టి ఏ ఇబ్బందీ లేదు. అయితే సరోగసీ విధానంలో పిల్లల్ని కనటంతోనే వచ్చింది తంటా. సరోగసితో పిల్లల్ని కనడం నేరమని 2019లో సుప్రీం తీర్పు వెలువరించింది. అందుకే నయన్-విఘ్నేష్ చేసింది ఇది చట్ట విరుద్ధమన్న వాదన బలంగా ఉంది.
ఇంత రాద్ధాంతం జరుగుతున్నా విఘ్నేష్ కూల్‌గా స్పందించాడు. సరైన సమయం వచ్చేదాకా సహనంతో ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో అంటూ విఘ్నేష్ స్పందించాడు. ఏ హడావుడి అయినా నాలుగురోజులే. అందుకే అంత కూల్ కూల్. పైగా తమిళనాడు ప్రభుత్వం తప్పదన్నట్లు స్పందించిందిగానీ వాళ్లేదో నేరం చేశారని అనుకోవడం లేదు. వాళ్లిద్దరి ప్రేమా పెళ్లీ అన్నీ ఓపెన్ సీక్రెట్టే. పిల్లల వ్యవహారం ఒక్కటే చివరదాకా సీక్రెట్‌గా పెట్టారంతే.
నయన వయసు 36ఏళ్లు. పిల్లలు కనేందుకు తన శరీరం సహకరించదనో, తామందరి అంగీకారంతోనో ఈ పద్ధతిలో తల్లిదండ్రులం అయ్యామని చెప్పొచ్చు. పైగా సీఎం స్టాలిన్ కొడుకే హీరో. సెలబ్రిటీ కపుల్స్‌ని వెంటాడి వేధించి కేసుల్లో ఇరికించాలని అస్సలు అనుకోడు. మరీ తేడా వస్తే మన దగ్గర కరాటే కళ్యాణి దత్తత విషయంలో అడ్డం తిరుక్కున్నట్లే జరగొచ్చు. మన మీడియావాళ్ల అత్యుత్సాహం తప్ప నయనతార-విఘ్నేష్‌లకు ఊహించేంత కష్టాలేమీ రాకపోవచ్చు. అందుకే ఇద్దరూ కూల్‌కూల్‌గా పిల్లలతో టైంపాస్ చేస్తున్నారు.