దసపల్లా భూములపై మళ్లీ దుమారం
రూ.2వేల కోట్ల భూములు కబ్జా?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆరోపణలు
సీబీఐ విచారణకు విపక్షాల డిమాండ్
అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమంటూ… వైసీపీ ప్రభుత్వం మూడు రాజధాలను తీసుకొచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించింది. అయితే, రాజధాని అభివృద్ధి పేరుతో విశాఖలో వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ విపక్ష నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ లో రూ.2వేల కోట్ల విలువైన దసపల్లా భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దలే దోచుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన కుమార్తె, అల్లుడి పేరుమీద దసపల్లా భూములను కొట్టేస్తున్నారని…. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ర్యాలీలు, నిరసనలతో నగరాన్ని హోరెత్తిస్తున్నారు.
విశాఖ నడిబొడ్డున ఉన్న దసపల్లా భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ భూములపై గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకి లోబడి ముందుకెళ్లాలని కలెక్టర్ ను ఆదేశించింది ప్రభుత్వం. ఈ మేరకు భూపరిపాలన ముఖ్య కమిషనర్ సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో సర్వే నెంబర్లు 1027, 1028,1196,1197లో ఉన్న దసపల్లా భూములు రాణి కమలాదేవికి చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, 2014లో అప్పటి పాలకుల ఆదేశాలతో కలెక్టర్ యువరాజ్ వాటిని ప్రభుత్వ భూముల జాబితా 22ఏలో చేర్చారు. ఆ తర్వాత తీర్పుపై అప్పీల్ చేశారు. అప్పటి నుంచి రూ.2వేల కోట్ల విలువైన సుమారు 76వేల చదరపు గజాలకు సంబంధించిన భూమిపై వివాదం కొనసాగుతోంది.
దసపల్లా భూముల వివాదం కొనసాగుతుండగానే.. ఆ భూములను ఓ బిల్డర్, వ్యాపారి కలిసి డెవలప్ మెంట్ కు కొనుగోలుదారులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అందులో భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి డిజైన్ సిద్ధం చేశారు. ఆ భూములు 22ఏ లో ఉండటంతో వాటిపై డెవలప్ మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రర్ చేయడం కుదరదని అధికారులు చెప్పేశారు. అయినా వినకుండా ఒత్తిళ్లు తెచ్చి పెండింగ్ రిజస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలం తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖ వాటిని తిరస్కరించింది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే వాటిని ప్రైవేట్ కు అప్పగించేందుకు పాత తీర్పులను ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్లాలని కలెక్టర్ కు సూచించింది. దాంతో ఆ భూములు చేతులు మారిపోయే పరిస్థితి ఏర్పడిందని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.
దసపల్లా భూములను 22-ఏ జాబితా నుంచి తప్పించడానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేయించారని విపక్ష నాయకులు ఆరోపించారు. విజయసాయిరెడ్డి బినామీ కంపెనీల పేరుతో 15 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించారని, వాటి ఛార్జీలకయ్యే డబ్బును తన కుమార్తె, అల్లుడి కంపెనీ నుంచి బినామీలకు పంపించారని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. అయితే, విపక్షాల ఆరోపణలను అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.