పరువు తీసే సూచికలు..దేనికి సంకేతాలు?
పాయె..పరువుపాయె. ఓ పక్క ఆత్మనిర్భర్ పేరుతో రొమ్ము విరుచుకుంటున్నాం. ప్రపంచదేశాల సరసన నిలుస్తున్నామని చంకలు గుద్దుకుంటున్నాం. పైకి సూటూబూటు వేస్తున్నాం. కానీ విప్పదీస్తే లోపల చిరుగుల బనీను. మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవ్వరని హూంకరించే అవకాశం లేదు. అదంతా తప్పులతడకని, అబద్దపు ప్రచారమని తేలిగ్గా తీసిపడేయడానికి లేదు. అన్ని లెక్కలూవేసి, ప్రపంచవ్యాప్తంగా విశ్లేషించి తేల్చిన నివేదికలు చేదుగా ఉన్నా స్వీకరించాల్సిందే.
ప్రపంచవ్యాప్తంగా జీవనప్రమాణాలు, ఇతర పోలికల్లో భారత్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. అంతా బాగుంటే ఇలా ఎందుకు జరుగుతోందన్న ఆత్మ పరిశీలన కరువవుతోంది. తాజాగా ప్రపంచ ఆకలి సూచీ(జీహెచ్ఐ)లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 121 దేశాలను ఈ నివేదికకోసం పరిగణనలోకి తీసుకుంటే మన దేశానిది 107వ స్థానం. చివరికి తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంక(64), ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్న పాకిస్థాన్(99) కూడా మనకంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. పోయినేడాది116 దేశాల్లో భారత్ 101 స్థానంలో నిలిచింది.
ఒకటి రెండు కాదు ఈమధ్య వస్తున్న నివేదికల గణాంకాల్లో భారత్ పరిస్థితి ప్రపంచదేశాలు జాలిపడేలా ఉంటున్నాయి. లింగ సమానత్వంలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. లింగ అంతరాలున్న ఐదు దేశాల్లో మనం కూడా ఉన్నాం. మొత్తం 146 దేశాల్లో భారత్ స్థానం 135. ఇక పర్యావరణ కృషి సూచిక-2022లో కూడా భారత్‌ది అడుగునుంచి ఫస్ట్ ప్లేస్. 180 దేశాలతో రూపొందించిన జాబితాలో 18.9 పాయింట్ల స్కోరుతో 180వ స్థానంలో నిలిచింది. చివరికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, వియత్నాం, మయన్మార్ కూడా భారత్ కంటే పైన ఉన్నాయి.
పత్రికా స్వేచ్ఛ సూచికలో పోయినేడాది 142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారి 150వ స్థానానికి పడిపోయింది. విధి నిర్వహణలో భారత్‌లో ఏటా ముగ్గురు నలుగురు పాత్రికేయులు ప్రాణాలు కోల్పోతున్నారని నివేదిక వెల్లడించింది. ఈ సూచీలో 2016 నుంచి భారత్ స్థానం పడిపోతూనే ఉంది. కరోనా సంక్షోభంతో ఎక్కువమంది పేదరికంలోకి జారిపోయిన దేశాల్లోనూ మనమే టాప్. 191 దేశాలున్న జాబితాలో భారత్ 132వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది కొత్తగా పేదరికంలో చిక్కుకుంటే అందులో 5.60 కోట్ల మంది భారతీయులే.
ఊహాజనిత అంశాల ఆధారంగా, అశాస్త్రీయ పద్దతుల్లో నివేదికలు రూపొందిస్తున్నారని భారత్ ఖండిస్తోంది. మన ప్రగతిని చూసి ఓర్వలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మనం వివరణలు ఇచ్చుకోవచ్చుగాక. కానీ పదులసంఖ్యలో ఉన్న దేశాల్లో వేటికీ లేని అభ్యంతరం మనవైపునుంచి వస్తే ఆ వాదన నిలబడదు. అభివృద్ధి అంటే పైకి కనిపించే ఆడంబరం కాదు. మాటలమాయాజాలం కాదు. క్షేత్రస్థాయిలో కనిపించాలి. కాకిలెక్కలని కొట్టిపారేయకుండా గుండెలమీద చేయి వేసుకుని ఆలోచించాలి.