రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్న టీడీపీ
ఉత్తరాంధ్రలోబాబును ఇరుకున పెడుతోన్న వైసీపీ
3 రాజధానులకు టీడీపీ వ్యతిరేకమంటూ ప్రచారం
విశాఖ కేంద్రంగా వేడెక్కిన రాజకీయం
వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా సవాళ్లతో..
డిఫెన్స్ లో పడిన ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు
ఏపీలో రాజధాని అంశంపై మూడు ముక్కలాట నడుస్తోంది. విశాఖ కేంద్రంగా రాజకీయం వేడెక్కుతోంది. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకుంటున్న సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైతుల పాదయాత్ర వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపిస్తున్న అధికార పార్టీ…ఉత్తరాంధ్రలో టీడీపీని ఇరుకున పెట్టే వ్యూహరచన చేస్తోంది. రైతుల పాదయాత్రకు పోటీగా వైసీపీ శ్రేణులు ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. అంతేకాదు, వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ నేతలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం కాక రేపుతోంది. చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి జేఏసీ కన్వీనర్ కు ఇచ్చారు. అధికార వికేంద్రీకరణ కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ధర్మశ్రీ….ఏపీ టీడీపీ అధ్యక్షుడికి ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలంటూ అచ్చెన్నాయుడికి ఛాలెంజ్ చేశారు. ఆయనపై పోటీకి సిద్ధమని ప్రకటించారు.
అమరావతిలో వైసీపీని ప్రతిపక్ష టీడీపీ ఉక్కిరిబిక్కిరి చేస్తుండడంతో… ఉత్తరాంధ్ర – రాయలసీమలో చంద్రబాబును దెబ్బకొట్టే రాజకీయ చతురత వైసీపీ ప్రదర్శిస్తోంది. అమరావతి ప్రాంతంలో అధికార పార్టీ ప్రజాప్రతినిథులు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారో…ఇప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీ దూకుడు రాజకీయాలతో టీడీపీ నేతలు అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. మూడు రాజధానులకు టీడీపీ వ్యతిరేకంగా ఉందనే అభిప్రాయాన్ని సీమ, ఉత్తరాంధ్ర ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. ఆంధ్రుల ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు వేయిరోజులకు పైగా ఉద్యమిస్తున్నారు. వైసీీపీ మినహా అన్ని పార్టీలు ఆ ప్రాంత రైతుల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అయితే, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ విధానమంటూ….అధికార వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని చెబుతోంది.
ఇప్పటికే విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ కూడా ఏర్పాటైంది. కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచి వెలివేయాలని వైసీపీ నేతలు పిలుపునిస్తున్నారు. విశాఖ పరిపాలనా రాజధాని కోసం తెలుగుతమ్ముళ్లకు రాజీనామా సవాళ్లు విసురుతున్నారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చేందుకు రెడీ అంటూ మంత్రిధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా తాను రాజీనామాకు సిద్దమంటూ జేఏసీ నేతలకు వెల్లడించారు. విశాఖ – ఉత్తరాంధ్ర భవిష్యత్ కోసం ఏ నిర్ణయానికైనా సిద్దమని ప్రకటించారు. విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే ముమ్మాటికీ అమరావతికి తాము వ్యతిరేకమేనని ఉత్తరాంధ్ర వైసీీపీ నేతలు తేల్చిచెబుతున్నారు. పాదయాత్ర అడ్డుకుంటామని మరికొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. దీంతో, ఉత్తరాంధ్ర, సీమ ప్రజల్లో వైసీపీ నేతల పైన సానుకూలత ఏర్పడుతుందా అనే చర్చ మొదలైంది. అదే జరిగితే రాజకీయంగా టీడీపీకి నష్టం తప్పదనే వాదన ఉంది.