రఘురామకృష్ణరాజుపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. గతంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు.. స్పీకర్ ఓంబిర్లాకు వినతి పత్రం సమర్పించారు. ఆ వినతి పత్రంలో వారు.. పలు కోర్టు తీర్పులను ప్రస్తావించారు. తాజాగా ఆ అంశంపై జరుగుతున్న విచారణకు ఎంపీ మార్గాని భరత్ హాజరై మరో సారి వాదన వినిపించారు. ఎవరైనా బీజేపీ ఎంపీ.. మోదీని తిడుతూంటే ఊరుకుంటారా.. అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ కారణంగానైనా అనర్హత వేటు వేయాలని అడుగుతున్నారు.
రఘురామపై వైసీపీ అనేక ఫిర్యాదులు !
రఘురామకృష్ణంరాజు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని .. పార్టీ నేతలను అసభ్యపదజాలంతో దూషించి .. స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. విపక్షపార్టీల నేతలతో రఘురామ కృష్ణరాజు లాలూచీ పడ్డారని … ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధ్యక్షుడికి తెలియజేయకుండా.. బహిరంగంగా మాట్లాడటం పార్టీ నిబంధనలను ఉల్లంఘించడమేనంటున్నారు. కేసులు, రాజకీయలబ్ధి కోసం చంద్రబాబుతో కుమ్మక్కయ్యారనంటున్నారు. అందుకే అనర్హతా వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అనర్హతా చట్టం ఏం చెబుతోంది ?
అనర్హతా చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఓ పార్టీ గుర్తుపై ఎన్నికైన వారు మరో పార్టీలో చేరితే అనర్హత వేటు వేస్తారు. సొంత పార్టీని ధిక్కరించడం.. పార్టీ అధినేతను విమర్శించడం… ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనర్హత వేటు కిందకు రాదు. రఘురామకృష్ణరాజు వైసీపీలోనే ఉన్నారు. ఆయన ఏ ఇతర పార్టీలో చేరలేదు. అయినా అనర్హత వేటు వేయించాలని ప్రయత్నిస్తున్నారు. తాను పార్టీపై ఎలాంటి విమర్శలు చేయలేదని… పార్టీ వేరు.. ప్రభుత్వం వేరని.. ప్రభుత్వానికి మాత్రం సూచనలు చేస్తున్నానని రఘురామ చెబుతున్నారు. సాధారణంగా.. ఏదైనా సందర్భంలో ఓటింగ్ జరిగినప్పుడు.. విప్ ఉల్లంఘించినప్పుడు మాత్రమే పార్టీలు… అనర్హతా పిటిషన్లు వేస్తూంటాయి. స్పీకర్లు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. సాంకేతికంగానే కాదు.. రాజకీయంగా చూసినా రఘురామకృష్ణరాజు అనర్హతపై వైసీపీ ప్రయత్నాలతో ఫలితం ఉండదన్న వాదన వినిపిస్తోంది.
బీజేపీ నేతలతో సన్నిహితంగా రఘురామ !
నిజానికి అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలంటే బీజేపీకి పెద్ద ప్రాబ్లం కాదు. వేటు వేయడానికి స్పీకర్‌కు చాన్స్ ఉంది. నిబంధనలు ఎలాగైనా తీసుకోవచ్చు. కానీ తీసుకోవడం లేదు.. దీనికి కారణం రఘురామకృష్ణంరాజు బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజకీయం కొద్ది రోజులుగా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగుడుతూ ఉత్తరాలు రాస్తున్నారు. పేపర్లలో ఆర్టికల్స్ రాస్తున్నారు. హిందూత్వ వాదన వినిపిస్తున్నారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది.
ఏపీలో వైసీపీ చేసిందేమిటి?
రఘురామ ఇతర పార్టీలో చేరలేదు. కానీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీలో అనధికారికంగా చేరారు. వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నట్లుగా గడప గడపకు మన ప్రభుత్వం అంటూ వైసీపీ జెండాలు వేసుకుని జనంలోకి వెళ్తున్నారు. టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్.. వైసీపీకి మద్దతు పలికారు. వీరెవరూ లాంఛనంగా కండువా మాత్రం కప్పించుకోలేదు. కానీ ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఇక జనసేన పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో అనధికారికంగా చేరారు. ఆయనా అధికారికంగా కండువా కప్పుకోలేదు. కానీ వీరంతా వైసీపీ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. తాము ఏ పార్టీ తరపున గెలిచామో ఆ పార్టీని.. ఆ పార్టీ నేతల్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వల్లభనేని వంశీ లాంటి వాళ్లయితే .. చంద్రబాబు కుటుంబాన్ని కూడా విమర్శిస్తున్నారు. అయినప్పటికీ.. వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అందుకే రఘురామపై వేటుకో నీతి.. తమ పార్టీలో చేరిన నేతలపై మరో నీతి పాటించాలని కోరుతున్నారన్న విమర్శలు వైసీపీపై వస్తున్నాయి.