– నిను వీడని నీడను నేనే.. వదలని మహమ్మారి!
– రెండేళ్లయినా వదలబొమ్మాళీ వదలా!
కరోనా పీడ వదిలిందని సంబరపడిపోకండి. అసలు కథ ఆ తర్వాతే మొదలవుతోంది. ఆ వైరస్ ప్రభావం మనిషిని పీల్చి పిప్పిచేస్తోంది. కరోనా మహమ్మారి చాలావరకు తగ్గుముఖం పట్టినా… దాని లక్షణాలు మాత్రం నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నవారిలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఒక్కటైతే జాగ్రత్తపడొచ్చు. పోస్ట్ కోవిడ్ ప్రభావం శరీరంలో ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావడం కూడా కష్టమైపోతోంది. కరోనా బారినపడకముందు కిలోమీటర్ల కొద్దీ అనాయాసంగా నడిచినవారు ఇప్పుడు అరకిలోమీటరు నడకకే రొప్పుతున్నారు. మంచంమీద నడుంవాల్చగానే గుర్రుపెట్టినవాళ్లు కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. ఇక శ్వాస సరిగా ఆడకపోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు కామనైపోయాయి. కొందరికి జుట్టు ఊడుతోంది.
ఢిల్లీ ఎయిమ్స్ కోవిడ్ తర్వాతి పరిస్థితులపై జరిపిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో కొందరు 8 గంటలు పనిచేయడం కూడా కష్టమైపోతోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1800 మందిని సర్వే చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. 79.3 శాతంమంది అలసట, 33.4 శాతం మంది కీళ్ల నొప్పులు, 28శాతం జుట్టు రాలడం, 27.2 శాతం తలనొప్పి, 25.3 శాతం మంది శ్వాస ఆడకపోవడం, 25.30శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. తరాల వైరం ఉన్నట్లు వైరస్ బాధితులపై పగబడుతోంది.