ఆర్‌ఎస్‌ఎస్‌ అనుమానాల్లో నిజమెంత?

By KTV Telugu On 6 October, 2022
image

– ఓ వర్గం జనాభా నిజంగానే పెరుగుతోందా?

“దేశంలో ఓ మతానికి చెందినవారి జనాభా పెరుగుతోంది. భవిష్యత్తులో హిందూమతం ప్రమాదంలో పడుతుంది. ఆ జనాభాని నియంత్రించాలి. ఈ జనాభాని పెంచుకోవాలి.” ఈమధ్య కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు, బీజేపీ సమర్థకులనుంచి తరచూ వస్తున్న వ్యాఖ్యలివి. దేశంలో జనాభా లెక్కలు చూసి పదకొండేళ్లయింది. ఓ వర్గం జనాభా అసాధారణంగా పెరుగుతోందన్న వాదనకు ఎలాంటి సాధికారిక ఆధారాలూ లేవు. అయినా జనాభా సమతుల్యతమీద నిరంతర చర్చ జరుగుతూనే ఉంది.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తాజాగా మరోసారి ఓ వర్గం జనాభా గురించి ప్రస్తావించారు. దేశంలో వివిధ వర్గాల్లో జనాభా అసమానతలపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని వర్గాలకీ వర్తించేలా ఓ సమగ్ర జనాభా విధానం ఉండాలనేది మోహన్‌ భగవత్‌ సూచన. ఒకే సంతానం విధానాన్ని అవలంబించిన చైనా ఇప్పుడు వృద్ధ దేశంగా మారుతోంది. 57 కోట్ల యువత ఉన్న భారత్‌ మరో మూడు దశాబ్దాలపాటు యువదేశంగా ఉంటుందన్నారు భగవత్‌.
కౌంటర్‌కి రెడీగా ఉండే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ నుంచి ఊహించినట్లే వెంటనే రియాక్షన్‌ వచ్చింది. హిందువులు, ముస్లింల డీఎన్‌ఏ ఒక్కటేనని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ గతంలో వ్యాఖ్యానించారు. దాన్నే గుర్తుచేస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు. హిందువులు, ముస్లింల డీఎన్‌ఏ ఒకటే అయినప్పుడు అసమతుల్యత అనే మాటలు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు. దేశంలో ముస్లింల సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతోందన్నారు.
భారత్‌ జనాభా ప్రస్తుతం 134 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల జనాభాలో హిందువులు 80 శాతం. ముస్లింలు కేవలం 14.2 శాతం. క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు కలిసి ఆరు శాతం. ఏ రకంగా లెక్కలు తీసినా అసాధారణమార్పులేమీ ఉండవనేది విశ్లేషకుల వాదన. మరెందుకు ఈ చర్చ జరుగుతున్నట్లు? కొందరికి ఎప్పుడూ ఏదో ఒక మేత కావాలి. అసమానతల గురించి భావోద్వేగ ప్రసంగాలు కాకుండా గణాంకాలు చెప్పే నిజాయితీ ఎందరికుంది?