రాజకీయ ప్రత్యర్థులను బిగించేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందా. తెలంగాణ పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు అన్ని దారులు వెదుకుతోందా ? సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ లాంటి తమ జేబు సంస్థలను వినియోగిస్తోందా ? ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితపై ఆరోపణలు కూడా అందుకేనా ?
హైదరాబాద్‌లోని ఫీనిక్స్ గ్రూపు కంపెనీపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఫీనిక్స్ కంపెనీ సహా, సంస్థ డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ముంబై నుంచి 25 వాహనాల్లో వచ్చిన సుమారు 200 మంది అధికారులు ఏకకాలంలో సోదాలు చేసినట్టు సమాచారం. నానక్‌రాంగూడ, గోల్ఫ్‌ఎడ్జ్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగాయి. ఇటీవల ఫీనిక్స్ సంస్థ ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ జన్మదిన వేడుకలు నగరంలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగాయి. బర్త్ డే వేడుకలకు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, కలెక్టర్లు, బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. ఫీనిక్స్ సంస్థలో పెట్టుబడులు పెట్టిన రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరైనట్లు భావిస్తున్నారు.
ఐటీ శాఖ వారం క్రితం వాసవి కంపెనీతో పాటు సుమధుర గ్రూపుపై దాడులు నిర్వహించింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన 27 ఎకరాల భూమిని వాసవి–సుమధుర జాయింట్ వెంచర్ కింద కొనుగోలు చేసిన వ్యవహారంలో ఐటీ శాఖకు అనుమానాలున్నట్లు భావిస్తున్నారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, చెల్లింపులకు సంబంధించి అంతర్గత ఒప్పంద పత్రాలు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక గల్ఫ్ ఆయిల్ సంస్థకు చెందిన భూముల కొనుగోలు వ్యవహారంలో ఫీనిక్స్ పాత్రపై ఐటీ శాఖకు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వాసవి, సుమధుర, ఫీనిక్స్ మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగాయని, అందులో పన్ను చెల్లించని సొమ్ము భారీ స్థాయిలో చేతులు మారినట్లు ఐటీ శాఖ గుర్తించి దాడులు జరిపిందని చెబుతున్నారు. అయితే దీని వెనుక అసలు మతలబు వేరుగా ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితపై కొందరు బీజేపీ నేతలు ఆరోపణాస్త్రాలు సంధించారు. ఒబెరాయ్ హోటల్ లో బస చేసి మరీ.. స్కాంకు తెరతీశారని ఆరోపించారు. దీనిపై సీరియస్ అయిన కవిత.. తనపై ఆరోపణలను నిరూపించాలని సవాలు చేశారు. బట్టకాల్చి మొహం మీద పడెయ్యడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆమె ప్రత్యారోపణ చేశారు. బీజేపీ నుంచి సమాధానం రాకపోవడంతో కవిత.. కోర్టును ఆశ్రయించారు. పరువునష్టం దావా వేశారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జ్ ముందు ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు భేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేయాలని కవిత కోర్టును కోరారు. అయితే బీజేపీ నేతలు ఇప్పుడు కొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారు. వారం వారం ఒక ప్రముఖ సంస్థపై దాడుల వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఢిల్లీలో
జరిగిన లిక్కర్ స్కాంలో హైదరాబాద్ సంస్థలకు లింకు పెట్టడం వెనుక కూడా అదే కథ ఉందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కేసీఆర్, కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం ఆ పార్టీ నేతలు సహించలేకపోతున్నారు. అందరూ దాసోహమంటే టీఆర్ఎస్ మాత్రం ఎందుకు ఎదురు చెబుతోందని వాళ్లు ఆగ్రహం చెందుతున్నారు. మొదటి నుంచి కూడా ఎదిరించే వాళ్లంటే మోదీ, అమిత్ షా కు అసలు గిట్టదు. అందుకే ఏదో కేసులో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లింక్ పెట్టి రోజు వారీ ప్రచారం చేసి బద్నాం చేయడం బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. వారిలో సంబంధాలున్నట్లు చెబుతూ.. ఒకరిద్దరు వ్యాపారులను, ఛోటా నేతలను అరెస్టు చేస్తే వ్యతిరేక ప్రచారం వస్తుందని కూడా ఎదురు చూస్తోంది. అయినా టీఆర్ఎస్ పార్టీ నేతలు భయపడే వాళ్లు కాదు కదా.. గతం కంటే బలంగా ఎదురుదాడి చేస్తున్నారు. కవిత కూడా గట్టిగా నిలబడటంతో ఇప్పుడు బీజేపీ డిఫెన్స్ లో పడిపోయింది.