*గుజరాత్, కర్నాటకతో పాటు ఏపీలోని ఎంటరవుతాం
*మా జోలికొస్తే రావొద్దని ఉండదని ఏపీ మంత్రులకు వార్నింగ్
త్వరలో ఏపీలో కూడా పాగా వేస్తామని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన తరువాత గుజరాత్, కర్నాటకతో పాటు ఏపీలోనూ పక్కాగా అడుగుపెట్టడం ఖాయం అన్నారు. ఇటీవల తెలంగాణ మంత్రి హరిశ్‌రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలతో అగ్గి రాజుకుంది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హరిశ్‌రావు వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కూడా ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌తో హరీశ్ రావుకు విభేదాలుంటే వాళ్లు వాళ్లు పరిష్కరించుకోవాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు.
సజ్జల వ్యాఖ్యలపై గంగులు కమలాకర్ మండిపడ్డారు.
సజ్జల వైఎస్ కుటుంబంలో ఉడుములా చొరబడి తల్లీ కొడుకు, అన్నాచెల్లెలు మధ్య చిచ్చు పెట్టి విడగొట్టారని ఆరోపించారు. అదే తరహాలో కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఓ కుటుంబమన్న కమలాకర్… తమనెవరూ విడదీయలేరని స్పష్టం చేశారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందని, వైసీపీ ప్రజా ప్రతినిధులు ఏపీ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటుంటే… ఏపీలో జగన్ నాయకత్వాన్ని అక్కడి ప్రజలు వద్దనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణపై జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందని గంగుల కమలాకర్ ఆరోపించారు. ఉన్నట్లుండి తెలంగాణ మంత్రులు జగన్ సర్కారును ఎందుకు టార్గెట్ చేసుకోవడం వెనకాల మునుగోడు ఉప ఎన్నికలే కారణం అనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోసారి సెంటిమెంటును రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనేది కేసీఆర్ ఎత్తుగడ అని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పుడు గంగులు వ్యాఖ్యలతో ఈ వివాదం ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు.