కొత్త పార్టీ పేరు మర్చిపోయిన మంత్రి ఎర్రబెల్లి

By KTV Telugu On 6 October, 2022
image

సీఎం కేసీఆర్‌ అట్టహాసంగా ప్రకటించిన పార్టీ పేరునే మర్చిపోయారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీఆర్‌ఎస్‌ పేరును ఆయన బీఎస్పీ అని వ్యాఖ్యానించారు. దసరా రోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వివిధ కార్యక్రమాల్లో ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కేసీఆర్ పెట్టిన పార్టీ గురించి తెలుసా అని కార్యకర్తలను వేదిక పైనుంచి ప్రశ్నించారు. దీంతో అక్కడే ఉన్న ఓ కార్యకర్త.. బీఎస్పీ అని చెప్పడంతో.. మంత్రి కూడా రెండు మూడు సార్లు బీఎస్పీ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దయాకర్‌రావు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేసీఆర్ ప్రకటించిన పార్టీ పేరు కూడా తెలియదా అంటూ నెటిజన్లు ఎర్రబెల్లి మీద సెటైర్లు వేస్తున్నారు. బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎర్రబెల్లి కామెంట్స్‌పై రియాక్ట్ అయ్యారు. తెలంగాణ జనం గుండె చప్పుడును ప్రపంచానికి తెలియజేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. పాదయాత్ర చేస్తున్న తమకు కొడకండ్లలో ఆశ్రయమివ్వద్దని ఒక పేద కుటుంబాన్ని బెదిరించగలిగారేమో కానీ.. వాళ్ల గుండెల నుంచి మా పార్టీని తీసివేయలేకపోయారు అని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి మాట్లాడిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దసరా రోజున తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును.. భారత రాష్ట్ర సమితి గా కేసీఆర్ మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. సాయంత్రానికల్లా ఎర్రబెల్లికి తన సొంత పార్టీ పేరు మర్చిపోవడం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏదో ఫ్లోలో అలా అన్నారు తప్ప…కావాలని అనలేదని అంటున్నారు ఎర్రబెల్లి అనుచరులు.