క్ష‌మించు రైత‌న్నా..నీ ఉసురుపోసుకుంటున్నాం!

By KTV Telugu On 22 October, 2022
image

– ఆక‌లితీర్చే అన్న‌దాత‌ల ఆయుష్షు కాపాడ‌లేమా?
– కుడిఎడ‌మ‌ల ద‌గాద‌గా.. రైతు బ‌తుకు ఇంతేగా!

ఆ క‌ష్ట‌జీవి బుర‌ద‌లోకి దిగ‌క‌పోతే మ‌న ఐదువేళ్లు నోట్లోకి వెళ్ల‌వు. ఆ శ్రామికుడు అర‌క దున్న‌క‌పోతే ఈ ప్ర‌పంచ‌మే ప‌స్తులుండాల్సి వ‌స్తుంది. క‌ష్ట‌మైనా న‌ష్ట‌మైనా, ప్ర‌కృతి ప‌రిహ‌సించినా క‌ర్ష‌కుడికి పొల‌మే ప్రాణం. పంటే దైవం. కానీ ఆ రైతు గురించి ప‌ట్టించుకుంటున్న‌దెవ‌రు? ఆ మ‌ధ్య వ్య‌వ‌సాయ‌చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా అలుపెర‌గ‌ని పోరాటం చేశారు అన్న‌దాత‌లు. మీమేలుకోస‌మేనంటూ పాల‌కులు స‌న్నాయి నొక్కులు నొక్కినా, కార్పొరేట్ల ఊడిగం చేయ‌డానికి తాము సిద్ధంగా లేమ‌ని ఎలుగెత్తి చాటారు.

ఆత్మాభిమానానికి ప్ర‌తీక అన్నదాత‌. ప‌దిమందికీ పెట్ట‌డ‌మేగానీ ఎవ‌రిద‌గ్గ‌రా చేయిచాచ‌డు. స‌మాజానికి వెన్నెముక‌లాంటి రైత‌న్న‌కు చేయూత ఇవ్వాల్సిందిపోయి వారి వెన్నువిరుస్తున్నాం. వారి బ‌తుకుల్ని ప‌రిహ‌సిస్తున్నాం. కేంద్ర‌ప్ర‌భుత్వం నోటితో మాట్లాడుతూ నొస‌టితో వెక్కిరిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కూడా రైతులు చివ‌రి ప్రాధాన్యం అయిపోతున్నారు. అందుకే త‌మ ఆవేద‌న ఎవ‌రికీ ప‌ట్ట‌క‌, త‌మ గోడు ఎవ‌రి చెవుల‌కూ వినిపించ‌క రైతులు ప్రాణ‌త్యాగాలు చేస్తున్నారు.

ఒక్కోసారి క‌రువు. మ‌రోసారి వ‌ర‌ద‌. తెగుళ్లు, చీడ‌పీడ‌ల‌నుంచి ఎలాగోలా త‌మ శ్ర‌మ‌ఫ‌లాన్ని ద‌క్కించుకుంటే రాబందుల్లాంటి ద‌ళారులు గిట్టుబాటు ద‌క్క‌నివ్వ‌టం లేదు. ఎన్ని చేదు అనుభ‌వాలు ఎదురైనా గుండెల్లోని దిగ‌మింగుకుంటూ పంట‌పొలాన్ని మాత్రం వీడ‌ని రైతులు చివ‌రికి బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డుతున్నారు. కుటుంబానికి పుట్టెడు దుఖాన్ని మిగులుస్తున్నారు. నేష‌న‌ల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవ‌ల బ‌య‌ట‌పెట్టిన నివేదిక అన్న‌దాత‌ల ద‌య‌నీయ‌స్థితిని క‌ళ్ల‌కు క‌డుతోంది.

ఎన్సీఆర్‌బీ నివేదిక ప్ర‌కారం 2021లో దేశంలో రోజుకు 15 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. రోజుకు 15 మంది చొప్పున వ్య‌వ‌సాయ కూలీలు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి గ‌త ఏడాది మొత్తం 10,881 మంది ఆత్మ‌హ‌త్య‌లు న‌మోద‌య్యాయి. వారిలో 5,318 మంది రైతులు, 5,563 మంది వ్య‌వ‌సాయ కూలీలు. దేశంలో చోటుచేసుకున్న మొత్తం ఆత్మ‌హ‌త్య‌ల్లో రైతులే 6.6 శాతం ఉన్నారు.

రైతు ప‌క్ష‌పాతుల‌మ‌ని చంక‌లు గుద్దుకునే పాల‌కుల‌కు చెంప‌పెట్టులా 2017 నుంచి 2021 వ‌ర‌కు నాలుగేళ్ల‌లో మొత్తం 53వేల‌మంది బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డారు. వ్య‌వ‌సాయ రంగంలో ఆత్మ‌హ‌త్య‌ల్లో మ‌హారాష్ట్రదే అగ్ర‌స్థానం. త‌ర్వాత క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు న‌మోద‌య్యాయి. మొస‌లిక‌న్నీరు కార్చే పాల‌కుల‌తో రైతుల క‌ష్టాలు గ‌ట్టెక్క‌వు. ఆక‌ర్ష‌ణీయ‌మైన ప‌థ‌కాల‌తో, కాగితాల‌కే ప‌రిమిత‌మ‌య్యే ర‌క్ష‌ణ‌ల‌తో ఈ దేశంలో అన్న‌దాత‌ల ఆవేద‌న తీర‌దు.