టీఆర్ఎస్ VS వైసీపీ.. మధ్యలో టీడీపీ

By KTV Telugu On 2 October, 2022
image

*తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ వార్
*అభివృద్ధి, ఉద్యోగుల విషయంలో..
*ఏపీ, తెలంగాణ మంత్రుల విమర్శలు
*హరీష్ రావుపై వైసీపీ నేతల ఆగ్రహం
*వైసీపీ బీజేపీకి బీ టీమ్ అన్న గంగుల
*కేసీఆర్ ను కీర్తిస్తూ టీడీపీ నేతల కామెంట్లు
*టీఆర్ఎస్ బ్యానర్ లో ఎన్టీఆర్ ఫోటో వైరల్

తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలతో…తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. అభివృద్ధి, టీచర్లకు సంబంధించిన విషయంలో ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం…వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. జగన్ సర్కార్ ఉద్యోగులు, ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తూ…కేసులు పెట్టి జైల్లో వేస్తోందని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోటార్లకు మీటర్ల విషయంలోనూ హరీష్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై ఏపీ మంత్రులు, నేతలు విరుచుకుపడుతున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఓ గ్యాంగ్ తయారైందని, ఈ గ్యాంగ్ ఎజెండాను పోలినట్లుగానే హరీష్ రావు వ్యాఖ్యలున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ పై విమర్శల ద్వారా తాము కేసీఆర్ కు కౌంటర్ ఇస్తే…హరీష్ రావు హ్యాపీగా ఫీలవుతారేమో అంటూ సజ్జల సెటైర్లు వేశారు. మామ, అల్లుళ్ల మధ్య పంచాయితీ ఉంటే అక్కడే తేల్చుకోవాలని ఏపీ జోలికి రావొద్దని మంత్రులు అంబటి, అమర్నాథ్ లు బదులిచ్చారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తమకు లేదన్నారు అమర్నాథ్.

 

అంతే ఘాటుగా తెలంగాణ మంత్రులు ఎదురుదాడికి దిగారు. వైసీపీ మంత్రులు, నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ లు ఇస్తున్నారు. తమతో పెట్టుకుంటే ఏమైతదో తెలవదా…? ఎక్కువగా మాట్లాడితే మళ్లీ దాడులు చేసే రోజు వస్తుందంటూ మంత్రి గంగుల కమలాకర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ మంత్రులను హెచ్చరించారు. తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. బీజేపీకి వైసీపీ బీ టీమ్ గా వ్యవహరిస్తోందంటూ గంగుల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సంగతి తెలియదా? గతంలో చూశారు.. మళ్లీ చూస్తారా? అంటూ శివాలెత్తారు గంగుల. సజ్జల రామకృష్ణారెడ్డిది కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే బుద్ధి అని, వైఎస్‌ కుటుంబంలోకి వచ్చి తల్లి, కుమారుడు, చెల్లిని విడదీశారన్నారు. అక్కడ విడగొట్టినట్లుగా కేసీఆర్‌ కుటుంబాన్ని సజ్జల విడదీయలేరని కౌంటర్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకే తెలంగాణకు వలసలు పెరిగాయని గంగుల వ్యాఖ్యానించారు.

 

టీఆర్ఎస్, వైసీపీ గొడవ మధ్యలో టీడీపీ ఎంటరైంది. కేసీఆర్ ను పొగుడుతూ టీడీపీ నేతలు జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. రైతుల మోటార్లకు మీటర్ల విషయంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. కేసీఆర్ ను ప్రశంసించారు. కేసీఆర్ రైతుల కోసం మోటార్ల విషయంలో కేంద్రంతో పోరాడుతుంటే.. జగన్ సరెండర్ అయ్యారని విమర్శించారు. కేసీఆర్ ను చూసి నేర్చుకో జగన్ అంటూ సలహా ఇచ్చారు. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే…ఖమ్మం జిల్లాలో మరో ఆసక్తికర ఘటన జరిగింది. టీఆర్ఎస్ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫోటో ప్రత్యక్షమైంది. ఖానాపూర్ లో స్థానిక టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎన్టీఆర్ నిలువెత్తు ఫోటో దర్శనమిచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన యోధులు అంటూ ఓ వైపు ఎన్టీఆర్.. మరో వైపు కేసీఆర్ ఫోటోలు పెట్టారు. జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్న కేసీఆర్ కు విషెష్ చెబుతూ ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అన్న నందమూరి తారకరామారావు ఢిల్లీలో తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడారు. ఇప్పుడు కేసీఆర్ పోరాడుతున్నారని అందులో రాశారు. టీడీపీ అభిమానులు కేసీఆర్ ను కీర్తిస్తూ ఫోటోను వైరల్ చేస్తున్నారు.