నాలుగు దేశాలు. ఓ శాస్త్రవేత్త. భవిష్యత్ ను మార్చే పరిశోధనలు. కుట్రను ఛేదించిన తెలుగు వాడు. ఈ స్టోరీ మీకు తెలుసా ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణ్ స్టోరీ సినిమాగా వచ్చింది. రాకెట్రీ. ఆ సినిమా గురించి, అందులో మాధవన్ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు కథను మలుపు తిప్పింది… నంబికి రిలీఫ్ ఇచ్చింది తెలుగువాడేనన్న విషయాన్ని మాత్రం చాలా మంది మర్చిపోయారు.అందుకే ఆ అదిరిపోయే డీటైల్డ్ మీ కోసం. జేమ్స్ బాండ్ సినిమాను మించిన సాహసాలు, దేశ రాజకీయాల్ని ఆశ్చర్యపరిచిన సస్పెన్స్, ఇప్పటికీ బయటపడని వాస్తవాలు… ఇలా చాలా ఉన్నాయ్ ఈ స్టోరీలో. పైగా ఇందులో ఇద్దరు తెలుగు ప్రముఖులు కీలకంగా ఉన్నారన్న పాయింట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం!
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ ను ఓ కుట్ర కేసులో ఇరికించి, చేయని తప్పుకి చిత్ర హింసలు పెట్టారని… ఆ తర్వాత ఆయన ఏ తప్పూ చేయలేదని విడిచి పెట్టి క్షమాపణ చెప్పారన్నది రాకెట్రీ సినిమాలో మాథవన్ చూపించిన స్టోరీ. ఏమోషన్, కళ్లనీళ్లు పెట్టించే సన్నివేశాలు, సగటు భారతీయుడు గర్వంతో ఉప్పొంగిపోయే వాస్తవాలు అందులో ఉన్నాయ్. సరే, అసలు విషయం ఏంటి… ఇప్పటికీ మనకి తెలియని విషయాలు ఇందులో ఏమున్నాయో చూద్దాం ఇప్పుడు.
నంబి నారాయణ్ తమిళనాడు – కేరళ సరిహద్దుల్లో పుట్టిన ఓ మధ్యతరగతి మనిషి. సైన్స్ మీద ఆసక్తి, దేశ భవిష్యత్ ను శాశించే పరిశోధనలు చేయాలన్న కసి ఉన్నవాడు. ఆయన ప్రయత్నాలు ఫలించి 20 ఏళ్ల వయసులోనే నాసా ఆయనకి ప్రతిష్టాత్మకమైన ఫెలో షిప్ ఇచ్చింది. అమెరికాలోని ప్రిన్స్ స్టన్ యూనివర్సిటీలో చదువుకునే ఛాన్స్ ఇచ్చింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక నంబి… ఇస్రోలో తన డ్రీమ్ జాబ్ చేయడం మొదలు పెట్టారు. టెక్నికల్ అసిస్టెంట్ గా అవకాశం అందుకున్నారు.
ఇప్పుడు మనం ఇస్రో పరిశోధనల్లో తరుచుగా వినే క్రయోజనిక్ ఇంజిన్ – అనే మాట అప్పటికి లేదు. ఆ ఇంజిన్ ను ఆవిష్కరించేందుకు, ఒకే మెషినరీతో మెకానిజంతో అనేక సార్లు ప్రయోగాలు చేసేందుకు, ఖర్చు తగ్గించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయ్ అప్పట్లో, ఆ క్రయోజనిక్ విభాగానికి నంబి బాస్ గా ఉన్నారు. ఇండియా దగ్గర పూర్తిస్థాయి టెక్నాలజీ లేని రోజులు. రష్యా, ఫ్రాన్స్ దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకోవాల్సిన రోజులు అవి. సరిగ్గా ఇక్కడే నంబి మీద కుట్ర జరిగింది అంటారు.
ఆయన ఫ్రాన్స్ తోపాటు రష్యా శాస్త్రవేత్తలతో చర్చించి… ఇండియా కోసం ప్రతిష్టాత్మక టెక్నాలజీని తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక్కడే అమెరికాకు నచ్చలేదు. పైగా కోల్డ్ వార్ ముగిసి అప్పటి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన రోజులు. అంటే 1994 సమయంలో అనమాట. సరిగ్గా ఇక్కడే అమెరికా నిఘా సంస్థ సీఐఏ రంగంలోకి దిగింది అంటారు. ఓ కొలీగ్ చేతే నంబి నారాయణ్ పై కుట్ర ఆరోపణలు చేయించడం దేశాన్ని కుదిపేసింది. నంబి అరెస్ట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ పేరుతో చిత్ర హింసలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఇక్రో వ్యవహారాలు, సాంకేతిక పరిజ్ఞానం అంటే దేశ భవిష్యత్ కి సంబంధించిన సంగతి.
ఇది 1995 నాటి సంగతి. అప్పట్లో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. కరుణాకరన్ ముఖ్యమంత్రి. కేంద్రంలో పీవీ ప్రభుత్వం ఉండేది. అప్పటి సీబీఐ డైరెక్టర్ కూడా మన తెలుగువాడే. విజయరామారావు. ఆతర్వాత రాజకీయాల్లో చేరి చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేసిన విజయ రామారావు చాలా మందికి తెలుసు. నంబి వ్యవహారం దేశం మొత్తం సంచలనం అయ్యింది. విచారణ కూడా సక్రమంగా సాగడం లేదని,వాస్తవాలు తెలియడం లేదు అని విజయరామారావు నేరుగా రంగంలోకి దిగారు.జైల్లో ఉన్న నంబిని కలిసి అసలు ఏం జరిగిందో ఆరా తీశారు.
విజయరామారావు ఇచ్చిన ధైర్యంతో నంబి తన ఆవేదన అంతా బయటపెట్టగలిగారు. ఆతర్వాత కొద్ది రోజులకే సీబీఐ ఈ కుట్ర కేసును క్లోజ్ చేసింది. అంటే ఇందులో నంబి తప్పులేదన్న క్లారిటీకి వచ్చింది. ఈ ప్రోసెస్ లో విజయరామారావు కీలకంగా నిలిచారు. ప్రధాని పీవీకి వాస్తవాలు చెప్పి 1996 ఎన్నికల ముందే ఈ కేసును క్లోజ్ చేశారు. కానీ నంబి మాత్రం తన పరువు ప్రతిష్టతలకు కలిగిన డామేజ్ ని తీర్చేది ఎవరు అంటూ న్యాయపోరాటం మొదలు పెట్టారు. సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడి పోరాడారు. ఓ దశలో సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టింది. నంబికి పరిహారంగా 50 లక్షలు ఇవ్వాలని చెప్పింది. ఆతర్వాత కేరళ ప్రభుత్వం ఆయన కుటుంబానికి మరో కోటి రూపాయలకు పైగా ఆర్థిక సాయం అందించింది. అది వేరే సంగతి.
అక్కడితో అయిపోలేదు. మోడీ బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థి అయ్యాక నంబి వ్యవహారాన్ని మళ్లీ తవ్వి తీశారు. 2013లో నంబిని కలిసి … సాయం చేస్తామని మాట ఇచ్చారు. కాంగ్రెస్ అన్యాయం చేసింది మీ బిడ్డకు అంటూ కేరళలో ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు నంబి నారాయణక్ పద్మ విభూషన్ అవార్డు కూడా ఇచ్చారు. అయితే ఇప్పటికీ అసలు ఆ కుట్ర ఆరోపణలు ఎందుకు వచ్చాయ్… సీఐఏ మొత్తం ప్లాన్ చేసిందా… ఆమెరికా – రష్యాల మధ్య ఉన్న రాజకీయ విభేదాలకు నంబి నలిగిపోయారా అనేది మాత్రం క్లియర్ గా తెలియదు.
అప్పటి వ్యవహారాన్ని స్వయంగా దర్యాప్తు చేసి, కేసును క్లోజ్ చేసిన మన తెలుగు వాడు విజయరామారావు ఈ విషయం మీద మాట్లాడే పరిస్థితి ఇప్పుడు లేదు. నాటి ప్రధాని పీవీ మన మధ్య లేరు. అందుకే కొన్ని రహస్యాలు ఎప్పటికీ అలాగే ఉండిపోతాయేమో అనిపిస్తోంది. మొత్తానికి శాస్త్రవేత్తల్ని నిర్ఘాంత పరచి, ఇస్రో కార్యక్రమాల్ని ఓ కుదుపు కుదిపి, రష్యా అమెరికా లాంటి దేశాలను కూడా ఆలోచనలో పడేసి ఓ కీలక ఘట్టంలో మన తెలుగువాళ్ల క్రియాశీలకంగా వ్యవహరించారన్న సంగతి మనలో చాలా మందికి ఇప్పుడు అర్థం అవుతోంది. ఇదంతా 30 ఏళ్లనాటి సంగతి.