పుతిన్ అన్నంత పనీ చేస్తే కింకర్తవ్యం?
నాలుగురోజుల్లో తోకముడుస్తుందనుకున్న ఉక్రెయిన్ నెలలు గడుస్తున్నా బెబ్బులిలా గాండ్రిస్తోంది. బలవంతమైన సర్పం చలిచీమల చేతిచిక్కినట్లే ఉంది రష్యా పరిస్థితి. బలవంతంగా రిఫరెండం నిర్వహించిన నాలుగప్రాంతాలను విలీనం చేసుకున్నా వాటిని కాపాడుకోలేక ఉక్రోషంతో ఊగిపోతోంది. రష్యాని ప్రపంచదేశాల ముందు విలన్‌గా నిలబెట్టటంలో ఉక్రెయిన్ విజయం సాధించింది. యుద్ధనేరాలకు పాల్పడిన ఆధారాలతో రష్యాని ప్రపంచముందు ఒంటరిని చేస్తోంది.
ఓటమిని అంగీకరించలేక, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉక్రెయిన్‌మీద పట్టుసాధించలేక రష్యా కసిగా బుసలు కొడుతోంది. పరువు పూర్తిగా పోయే పరిస్థితే వస్తే అణ్వాయుధానికి ప్రయోగించడానికి కూడా సిద్ధపడుతోంది. రష్యా ఏ క్షణమైనా ఈ దుస్సాహసానికి దిగొచ్చని అగ్రరాజ్యం కూడా ఆందోళనపడుతోంది. ఉక్రెయిన్‌కి ఆయుధాలు అందిస్తున్నాయని పశ్చిమ దేశాలపై పుతిన్ పగతో రగిలిపోతున్నారు. లేస్తే మనిషిని కానని కొంతమంది మాటలతో కవ్విస్తుంటారు. కానీ పుతిన్వి ఉత్తుత్తి బెదిరింపులు కావని అమెరికా గట్టిగా నమ్ముతోంది. పుతిన్ అణుబాంబు ప్రయోగానికి దిగే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
1962లో క్యూబా సంక్షోభం తర్వాత 50ఏళ్లకు మళ్లీ అంతటి ముప్పు పొంచి ఉందంటోంది అమెరికా. అణుదాడికి రష్యా తెగబడితే ఆ యుద్ధం ఉక్రెయిన్‌కే పరిమితం కాదు. పశ్చిమదేశాలన్నీ ప్రత్యక్షంగానో పరోక్షంగానే జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అణు దాడిపై బైడెన్ వ్యాఖ్యలు గుబులు రేపుతున్నాయి. పుతిన్ అంతదూరం వెళ్లకుండా ఒత్తిడిపెంచే ప్రయత్నాల్లో ఉంది అమెరికా. పిచ్చోడ చేతిలో రాయి ఎవరి తలపగలగొడుతుందో తెలీదు. పుతిన్ చేతుల్లోని న్యూక్లియర్ వెపన్ ఎలాంటి విధ్వసం సృష్టిస్తుందో ఎవరికీ అంతుపట్టటంలేదు.