పొన్నియన్‌ సెల్వన్‌-కూర తక్కువ..మసాలా ఎక్కువ!

By KTV Telugu On 6 October, 2022
image

– కోలీవుడ్‌ సిన్మా.. చరిత్ర అడక్కు..తీసింది చూడు!
– చారిత్రక సిన్మా అంటే తేనెతుట్టెని కదపడమేనా!?

కొందరేమో బాహుబలిని మిక్సీలో వేసి మరోసారి తిప్పినట్లు ఉందన్నారు. ఇంతమంది హేమాహేమీల్ని పెట్టి ఇదెక్కడి తాడూబొంగరం లేని సిన్మారా అంటూ దెప్పిపొడిచారు. మణిరత్నం మ్యాజిక్‌, ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ రెండూ పారలేదని పెదవి విరిచారు. అయితే బాక్సాఫీస్‌ దగ్గర బొక్కబోర్లా పడలేదు. అలాగని కలెక్షన్లు దుమ్ము దులపలేదు. నాట్‌బ్యాడ్‌ అన్నట్లుంది సిన్మా రన్నింగ్‌. ఎలా తీశారన్న దానికంటే అందులోని పాత్రలు, వాటి ఔచిత్యాల మీద కొత్త వివాదం రాజుకుంది.
మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పొన్నియన్‌ సెల్వన్‌ పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ తారాగణంతో తెరకెక్కింది. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజైనా తమిళనాట తప్ప మరెక్కడా ఆ సిన్మా అంచనాలను అందుకోలేకపోయింది. కానీ వివాదాలతో
అందరి నోళ్లలో నానుతోంది. రాజరాజ చోళులను హిందువులగా చూపించారంటూ కొందరు అభ్యంతరాలు లేవనెత్తారు. మణిరత్నంని టార్గెట్‌ చేసుకున్నారు. కోలీవుడ్‌లో కూడా దీనిపై భిన్నవాదనలు మొదలయ్యాయి.
సిన్మా అంచనాలను అందుకోలేకపోవటంతో నిరాశచెందిన మణిరత్నానికి గోరుచుట్టుపై రోకటిపోటులాంటి విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో కమల్‌హాసన్‌లాంటివాళ్లు ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. రాజరాజ చోళుడి కాలంలో హిందూమతమే లేదంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు దశావతారం. కళలకు భాష, కులం, మతం ఉండదని, వాటి ప్రాతిపదికన రాజకీయం చేయడం మంచిదికాదన్నారు. రాజరాజ చోళులను హిందువులుగా చూపారంటూ కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ చేసిన కామెంట్స్‌ని నటి కుష్బూ తప్పుబట్టారు. అలాంటి వాళ్ల మైండ్‌సెట్‌ మారాలని చురకలు అంటించారు. చరిత్రను మార్చడం ఎవరి తరమే కాదన్న కుష్బూ.. మణిరత్నంలాంటి దర్శకులు అలాంటి పనులు చేయరంటూ వెనకేసుకొచ్చారు. మొత్తానికి అసలుకంటే కొసరెక్కువన్నట్లుంది మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పరిస్థితి.