వర్షాకాలం… తర్వాత ఎన్నికల కాలం!

By KTV Telugu On 24 October, 2022
image

– ఏడాదిలో 11 రాష్ట్రాలు.. ఎన్నికలే ఎన్నికలు!

వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వర్షాకాలం తర్వాత వచ్చే రుతువు సాంకేతికంగా చలికాలమేగానీ రాజకీయంగా ఎన్నికలకాలం. నవంబరులో హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో ఈ సీజన్‌ మొదలైనట్లే. ఇక అక్కడినుంచి 2023 డిసెంబరు దాకా దేశంలో ఎన్నికలకాలమే. హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌లతో మొదలై వచ్చే ఏడాది డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా వణుకైనా, చెమటలైనా, నిలువెల్లా తడిసినా ఎన్నికల కాలంలోనే.

ఏడాదికాలంలోనే దేశంలో 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అవి అయిపోయాక నాలుగైదు నెలల గ్యాప్‌తో 2024లో సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తాయి. అంటే ఏడాదిన్నరపాటు రాజకీయ సీజనే ఉండబోతోంది. హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారైంది. గుజరాత్‌ ఎన్నికల ప్రకటన రాబోతోంది. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. అగ్రనేతల పర్యటనలతో రాజకీయతుఫాన్‌ తీరాన్ని తాకుతోంది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే 11 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతీ రాష్ట్రం పార్టీలకు ముఖ్యమే. వీటిలో ఐదు రాష్ట్రాలు రాజకీయంగా అత్యంత కీలకమని చెప్పొచ్చు. గుజరాత్‌, కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలపై అన్ని రాజకీయపక్షాలు గురిపెట్టాయి. రాజస్థాన్‌, తెలంగాణ మినహా మిగిలిన మూడు రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. దేశంలో కాంగ్రెస్‌ చేతుల్లో ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లే.

కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌కోసం బీజేపీ అన్ని ఎత్తుగడలూ వేస్తుంటే, గత ప్రాభవంకోసం కాంగ్రెస్‌ కుస్తీపడుతోంది. భారత్‌జోడో యాత్ర మళ్లీ అధికారంలోకి తెస్తుందని ఆశపడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో రాజకీయశక్తులు ఏకమయ్యే ప్రయత్నాల్లో ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జాతీయపార్టీతో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఢిల్లీ, పంజాబ్‌ల తర్వాత గుజరాత్‌పై కన్నేసిన కేజ్రీవాల్‌ జాతీయరాజకీయాల్లో క్రియాశీలకం కావాలనుకుంటున్నారు. ఈ ఎన్నికలకాలంలో ఉక్కబోత ఎవరికో? వణుకుపుట్టేదెవరికో? మునిగేదెవరో? తేలేదెవరో?