– దగ్గుకు మందేస్తే దూరమైపోయారు
– పిల్లల ప్రాణాలు తీసిన ఇండియన్ సిరప్స్
చంటిపిల్లలు దగ్గుతుంటే సిరప్ ఏమన్నా ఇవ్వండని డాక్టర్లని అడిగి మరీ రాయించుకుంటుంటారు. కానీ ఉపశమనం కలిగించాల్సిన సిరప్ విషంగా మారుతుందని ఊహించగలమా? ఆఫ్రికా దేశంలో ఇలాంటి దగ్గుమందే పదులసంఖ్యలో పిల్లల ఉసురుపోసుకుంది. సిరప్‌ల వాడకంతో 66మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సిరప్ తయారుచేసింది భారతీయ కంపెనీ కావటంతో మనం బోనులో నిలుచోవాల్సి వచ్చింది.
ఆఫ్రికాలోని గాంబియాలో ఈ దారుణం జరిగింది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనానికి వాడే సిరప్‌లే ఆ పిల్లల పాలిట ప్రాణాంతకమయ్యాయి. ఒక భారత కంపెనీ తయారుచేసిన సిరప్‌లతోనే 66మంది చనిపోయినట్లు స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. అంతేకాదు.. ఈ సిరప్‌ల వాడకంతో కొందరి కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ మందులపై ప్రపంచదేశాలకు డబ్ల్యుహెచ్‌వో అలర్ట్ మెసేజ్ జారీచేసింది.
భారత్‌కు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఈ సిరప్‌లను ఉత్పత్తిచేసింది. హర్యానాలో తయారయ్యే నాలుగు మందులు (Promethazine Oral Solution, Kofexmalin Baby Cough Syrup, Makoff Baby Cough Syrup, Magrip N Cold Syrup) పిల్లల ఊపిరితీశాయి. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేసిన ప్రపంచ ఆరోగ్యసంస్థ విచారణ ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ డ్రగ్స్‌ని గాంబియాలోనే గుర్తించినా ఇతర దేశాలకు కూడా వీటిని సరఫరా చేసి ఉండొచ్చని డబ్ల్యుహెచ్‌వో భావిస్తోంది.
జలుబు, దగ్గు సిరప్‌లతో చిన్నారులంతా సెప్టెంబరులో మృత్యువాత పడ్డారు. ఈ నాలుగుమందులను పరీక్షలకు పంపినప్పుడు వాటిలో మోతాదుకు మించి డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ కలిసినట్లు గుర్తించారు. గాంబియాలో పిల్లల మరణాలకు భారత్ కంపెనీ కారణమైందన్న డబ్ల్యుహెచ్‌వో ప్రకటనతో కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.