1970లు, 1980ల్లో టెన్త్ పరీక్షా ఫలితాల తీరు విచిత్రంగా ఉండేది. గ్రామాలు, చిన్న పట్టణాల్లో విద్యార్థులు మొదటి సారి తెలుగు మినహా మిగతా ఐదు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యేవారు. మార్చి, సెప్టెంబరు అంటూ రాస్తూ పాసయ్యే వారు. కట్ చేసి చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగనన్న ఇంగ్లీష్ మీడియంపై ఫోకస్ పెట్టారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉండాలన్న రూల్ త్వరలో పూర్తి స్థాయిలో అమలు కాబోతోంది. అంతవరకు బాగానే ఉందనిపించొచ్చు. ఈ సారి టెన్త్ ఫలితాలు మాత్రం కొత్త టెన్షన్ పుట్టించాయి. ఆంగ్లంలో పాసైన కొంత మంది పిల్లలు తెలుగులో తప్పారు. ఆంగ్లంలో 97.95 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. తెలుగులో 91. 73 శాతం మాత్రమే పాసయ్యారు. అంటే ఇంగ్లీష్ లో పాసైన వాళ్లు కూడా తెలుగులో తప్పారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో మైనార్టీ, సుగాలీ వర్గాల వారు ఎంత మంది తెలుగులో ఫెయిలయ్యారో తెలిస్తేనే పూర్తి విశ్లేషణకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తెలుగు నేలపై తెలుగు భాషలో ఫెయిల్ కావడం కాస్త ఇబ్బందికర పరిణామమే…
ఫెయిల్యూర్లు ఎక్కువే..
రెండు సంవత్సరాల తర్వాత పరీక్షలు జరిగాయి.గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. దానితో వంద శాతం ఉత్తీర్ణత సాధ్యపడింది. ఇప్పుడు పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో కేవలం 67.26శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11,671పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షలు రాయగా…. వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 797. ఇక జీరో శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 71. మరోవైపు అత్యధిక శాతం విద్యార్థులు పాస్ అయిన జిల్లా ప్రకాశం కాగా….అత్యల్ప పాస్ అనంతపురం జిల్లాలో నమోదైంది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అత్యధికంగా 91.10శాతం ఉత్తీర్ణులు కాగా…ప్రభుత్వ పాఠశాలల్లో అత్యల్పంగా 50.10శాతం ఉత్తీర్ణులయ్యారు. ఆంగ్లమీడియంలో పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 77.55శాతం ఉత్తీర్ణత సాధించగా… తెలుగు మాధ్యమంలో రాసినవారిలో 43.97శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లీష్ మీడియ మాత్రమే కరెక్టని వాదంచే సీఎం జగన్, ఆయన అనుచరగణానికి ఇదీ టానిక్ లా పనిచేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి…
టీచర్స్ ను టెన్షన్ పెడుతున్న రిజల్ట్స్
ఈ సారి ఏపీలో పదోతరగతి పరీక్షా ఫలితాలు ఉపాధ్యాయులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. గత దశాబ్దం కాలంలో లేనంతగా ఉత్తీర్ణతా శాతం తగ్గడంతో వారిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పైగా వేతన పెంపు, పాత పెన్షన్ విధానం కోసం ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులతో కలిసి ఉద్యమించారు. ప్రభుత్వానికి, యూనియన్లకు మధ్య పెద్ద వార్ జరిగిందనే చెప్పాలి. ఈసారి ఉత్తీర్ణతా శాతం తగ్గడంతో వైసీపీ వాళ్లు, టీచర్లపై ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విరుచుకుపడే అవకాశం ఉంది. జీతాలపై ఉన్న దృష్టి, పిల్లలకు చదవులు చెప్పడంపై లేదని వాళ్లు ఆరోపణలు చేస్తారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో అటాక్ మొదలైంది. మీకు ఇంకా జీతాలు పెంచాలా అంటూ మీమ్స్ ప్రత్యక్షమవుతున్నాయి. నిజానికి ఉపాధ్యాయులకు, విద్యా శాఖకు మధ్య సంఘర్షణ ప్రారంభమై చాలా రోజులైంది. అవకాశం వచ్చినప్పుడల్లా సస్పెన్షన్లు జరుగుతూనే ఉన్నాయి. ఉపాధ్యాయుల మధ్య సహజంగా ఉండే విభేదాలను కూడా వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకుని… అప్పుడు చేసిన ఉద్యమానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. పైగా విద్యాశాఖలో ఉన్న క్యాస్ట్ వార్ కూడా తారా స్థాయికి చేరుకోవచ్చు…