బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు

By KTV Telugu On 9 November, 2022
image

 

పీడీ యాక్టు కింద ఆరెస్టయి జైల్లో ఉన్న బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. విద్వేష వ్యాఖ్యల కేసులో ఈ ఏడాది ఆగష్టు 25న రాజాసింగ్ పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు.
అప్పటి నుంచి దాదాపు నలభై రోజులుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. బుధవారం ఆయనకు బెయిల్‌ లభించింది. జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో మాట్లాడవద్దని, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. ఎలాంటి ర్యాలీలు చేయవద్దని, వెంట కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండకూడదని న్యాయస్థానం ఆంక్షలు విధించింది. అంతకుముందు

రాజాసింగ్ పై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన పీడీ యాక్టును తొలగించాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ భార్య చేసిన అభ్యర్థనను పీడీ యాక్ట్‌ అడ్వైజరీ బోర్డు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరైన ఎమ్మెల్యే తనపై కక్షపూరితంగా పీడీ యాక్టు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. రాజాసింగ్‌ విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం కొన్ని వర్గాల మధ్య చిచ్చురేపే విధంగా వ్యహరించడం వల్లే పీడీ యాక్టు ప్రయోగించామని పోలీసులు వివరించారు. గతంలో అతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను బోర్డు ముందుంచారు. ఇరువర్గాల వాదనలు విన్న అడ్వైజరీ బోర్డు రాజాసింగ్‌పై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేయడాన్ని సమర్థించింది. దీనిపై రాజాసింగ్‌ తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించడంతో బెయిల్‌ మంజూరు చేసింది.