కమలనాథులు కాస్త సీరియస్‌గానే దక్షిణాదిపై దండయాత్ర మొదలు పెట్టినట్లున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలన్న తలంపే దీనికి సంకేతంగా చెప్పొచ్చు. జూలై 2, 3 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ప్రధాని మోదీ కూడా ఆ రెండు రోజులు హైదరాబాద్‌లోనే బస చేస్తారు. హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కార్యవర్గ సభ్యులు.. మొత్తం కలిపి 400 మంది రెండు రోజులు భాగ్యనగరంలోనే ఉంటారు. హైదారాబాద్ కాషాయమయం కానుంది. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపైనా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. దానితో తెలంగాణ కార్యకర్తల్లో జోష్ నింపేందుకే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా మరింత లోతైన ఆలోచన, విశ్లేషణ కూడా జరుగుతోంది.
ఉప ఎన్నికల జోష్
ఇటీవలి కాలంలో తెలంగాణలో జరిగిన మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రెండు చోట్ల కమలం పార్టీ విజయభేరీ మోగించింది. దుబ్బాకలో టీఆర్ఎస్కు షాకిస్తే… హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిపించారు. అదే జోష్‌తో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ దూసుకుపోతున్నారు. రోజుకు మూడు సార్లు కేసీఆర్‌పై ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముక్కోణ పోటీలో తమకు కాస్త అడ్వాంటేజ్ ఉందని బీజేపీ భావిస్తున్న తరుణంలోనే పరిస్థితిని మరింత అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. అంతకు మించి మరో వ్యూహం కూడా ఉంది. హైదరాబాద్‌ను దక్షిణాది రాజధానిగా భావిస్తారు. హైదరాబాద్‌లో ఏం జరిగినా.. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలపైనా దాని ప్రభావం ఉంటుంది. దక్షిణాదిలో పాతుకుపోయేందుకు వ్యూహాలు రచిస్తున్నామని చెప్పే ప్రయత్నమే.. హైదారాబాద్ సదస్సుగా చెప్పుకోవాలి, పైగా తమిళనాడు, కేరళలోనూ కమలం పార్టీ స్పీడ్ పెంచింది…
ఉదయించే సూర్యుడిని అడ్డుకునే ప్రయత్నం
తమిళనాడు సీఎం స్టాలిన్ శక్తిమంతమైన నాయకుడిగా ఉన్నారు. అక్కడ అన్నాడీఎంకే పూర్తిగా బలహీనమైపోయింది. అన్నాడీఎంకే స్థానాన్ని భర్తీ చేసి రాష్ట్రంలో తొలుత నెంబర్ టూగా ఎదగితే.. తర్వాత అధికారానికి ఒక అడుగు దూరంలోనే ఉంటామని బీజేపీ భావిస్తోంది. పైగా స్టాలిన్ నేరుగా కేంద్రంతో తలపడుతున్న తరుణంలో ఆయనకు కౌంటర్లిస్తూ.. రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించే అన్ని చర్యలు చేపడుతున్నారు. బీజేపీ తమిళనాడు శాఖాధ్యక్షుడు అన్నామలై కూడా.. బండి సంజయ్, సోము వీర్రాజు తరహాలో దూకుడు ఎక్కువున్న నాయకుడే. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని కోరుతూ ఇటీవల ర్యాలీ నిర్వహించారు. అన్నాడీఎంకే లాంటి పార్టీలు ఆ పనిచేయలేకపోతున్నాయి. స్టాలిన్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయని, మహిళలకు భద్రత కరువైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక రెండు సంవత్సరాల పాటు నిరసనలతో రాష్ట్రాన్ని అట్టుడికిస్తామని ప్రకటించిన అన్నామలై… 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి 25 మంది ఎంపీలను గెలిపించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అక్కడ మొత్తం 39 లోక్ సభా స్థానాలున్నాయి….
మళయాళ దేశంలో ఆరెస్సెస్ వ్యూహం
కేరళలో బీజేపీకి అసలు పట్టులేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ఒక్క సీటు కూడా రాలేదు. ఎన్నికల కోసం రూ. 400 కోట్లు ఖర్చుపెట్టారని కూడా ఆరోపణలున్నాయి. తమకు 25 లక్షల మంది సభ్యులున్నారని బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ చెప్పుకుంటుంది. అయినా ఓట్లు రాలలేదు. దానితో నీరసంగా పడిపోయిన బీజేపీ కేడర్‌ను ఉత్తేజ పరిచేందుకు కొత్త వ్యూహాల అమలు ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉన్న 56 శాతం మంది హిందువుల్లో మెజార్టీ వర్గాన్ని తమవైపుకు తిప్పుకునేందుకు వీలుగా కేరళ మిషన్ అమలు చేస్తున్నారు. కొద్ది నెలల వ్యవధిలోనే అక్షయ శ్రీ పేరుతో 7,300 బృందాలను ఏర్పాటు చేశారు. అవి డ్వాక్రా గ్రూపుల లాంటివే. ఆయా బృందాలు పోలింగ్ కేంద్రం స్థాయిలో పనిచేస్తూ హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఆర్బీఐ రిజిస్ట్రేషన్ అవసరం లేదని హిందూ బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నారు. హిందువుల కోసం ప్రత్యేకంగా సూపర్ మార్కెట్లను తెరుస్తారు. 30 శాతం ఓట్లు సాధించగలిగితే రాష్ట్రం తమదేనని బీజేపీ చెప్పుకుంటోంది. మరోపక్క కర్ణాటక తమ ఆధీనంలో ఉందని బీజేపీ సంతోష పడుతోంది. ఏదేమైనా దక్షిణాదిపై దండయాత్రకు గ్రౌండ్ వర్క్ పూర్తయ్యిందనే చెప్పాలి..