వెళ్తూ వెళ్తూ మోదీ చెప్పిన వ్యూహం అదేనా.. కాంగ్రెస్ తెచ్చిన చట్టమే కీలకంగా మారబోతోందా?

By KTV Telugu On 13 July, 2022
image

మోదీ మౌనం వెనుక అసలు వ్యూహం అదేనా ? ఇక చూస్తోండి అని బండి సంజయ్ బృందానికి పూర్తి స్వేచ్ఛ నిచ్చారా… ఆర్టీఐ చట్టం కింద అడిగిన ప్రశ్నలతో టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నారా ? ఎదురుదాడి చేయకపోతే కారు పార్టీ మరిన్ని ఇబ్బందుల్లో ఇరుక్కుంటుందా ? కారు వర్సెస్ కమలం పోటీలో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారిందా ?

బీజేపీ వ్యూహాత్మకంగా తెలంగాణలో కార్యవర్గ సమావేశం నిర్వహించిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో ఎక్కడ లేని జోష్ కనిపిస్తోంది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా తామే అధికారానికి వస్తామన్న ధీమా వారిలో కనిపిస్తోంది. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి పడేశామన్న ఊపుతో వాళ్లు ముందుకు సాగుతున్నారు. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో మోదీ నోట కేసీఆర్ మాట రాకపోవడంతో కమలం పార్టీ వెనక్కి తగ్గిందన్న చర్చ మొదలైంది. దాన్ని తిప్పికొడుతూ బీజేపీ రాష్ట్ర శాఖాధ్యక్షుడు బండి సంజయ్ కొత్త ఎత్తుగడతో ముందుకెళ్తున్నారు. నేరుగా సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు…

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్ ముదురుతోంది. తాజాగా టీఆర్ఎస్‌ను  టార్గెట్ చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేసిన మాస్టర్ ప్లాన్ చర్చనీయాంశంగా మారుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా బండి సంజయ్ ప్రయోగించారు. సమాచారం కోరుతూ ఆర్టీఐని ఆశ్రయించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆర్టీఐకి 88 దరఖాస్తులు చేశారు. అందులో వంద ప్రశ్నలు సంధించారు. ప్రగతి భవన్ నిర్మాణం మొదలు ప్రభుత్వ ప్రకటనల వరకు అన్ని శాఖల నుంచి సమాచారం కోరుతూ దరఖాస్తు చేశారు. వైద్య, విద్యాశాఖలకు సంబంధించి సమాచారం కూడా కోరారు.

కేసీఆర్ ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చారు? ఇప్పటివరకు ఎన్ని హామీలు నెరవేర్చారు? ప్రగతిభవన్‌ నిర్మాణానికి ఖర్చు ఎంత? ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు? ఎన్ని భర్తీ చేశారు? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రశ్నలని బండి ఆర్టీఐకి సంధించారు. అలాగే ఇంకా పలు అంశాల గురించి తెలుసుకునేందుకు ఆర్టీఐ కింద వివరాలు ఇవ్వాలని కోరుతూ ముఖ్య నేతలు సైతం దరఖాస్తులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమాచారాలని ఎలాగైనా తెలుసుకుని కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రగతి భవన్ కంటే ఫార్మ్ హౌస్ లోనే ఎక్కువ సమయం గడుపుతారని, ప్రజలను పట్టించుకోరని చెప్పడమే బీజేపీ ధ్యేయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ వారంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటారని నిరూపించే ప్రయత్నంలో కమలనాథులు ఉన్నారు…

ఆర్టీఐ నుంచి వచ్చే సమాధానం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.  బీజేపీని ఇబ్బంది పెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు పదే పదే లెక్కలను ప్రస్తావిస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధుల విషయాన్ని ప్రస్తావించే క్రమంలో టీఆర్ఎస్ నేతలు పదే పదే లెక్కలను ప్రస్తావిస్తూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. వీటిని ప్రజల్లోకి కూడా పెద్ద ఎత్తున తీసుకెళుతోంది గులాబీ పార్టీ. దానికి కౌంటర్ గానే ప్రభుత్వంపై ఆర్టీఐ అస్త్రాన్ని కమలనాథులు ప్రయోగించారు.. ఏదైనా సమాచారం లభిస్తే టీఆర్ఎస్ అవినీతిని కూడా బయట పెట్టే వీలుంటుందని వారి ఆలోచనగా తెలుస్తోంది.

నిజానికి ఆంధ్రప్రదేశ్లోనూ విపక్షాలు ఆర్టీఐ వ్యూహాన్ని అమలు చేశాయి. సీఎం జగన్ దావోస్ పర్యటన సందర్భంగా ఆయన ఏ ఏ ఒప్పందాలు చేసుకున్నారు.. ఆయన పర్యటనకు అయిన ఖర్చు ఎంత? ఆయన లండన్ ఎందుకు వెళ్లారు లాంటి ప్రశ్నలకు సంధించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. కేవలం నాలుగు ఒప్పందాలను కుర్చుకున్న సంగతిని వివరిస్తూ.. పర్యటనకు చేసిన ఖర్చుల వివరాలు ఇంకా సమర్పించలేదని, లండన్ టూర్ వ్యవహారం తమ దృష్టికి రాలేదని వివరించి చేతులు దులుపుకుంది. తెలంగాణ  ప్రభుత్వం కూడా ఇలాంటి పొంతనలేని సమాధానాలిస్తుందని బీజేపీ ఎదురు చూస్తోంది. అదే జరిగినా కూడా కేసీఆర్ భయపడి తోక ముడిచారని ప్రచారం చేసేందుకు కమలం పార్టీకి అవకాశం లభిస్తుంది. సమాచారం అందిన పక్షంలో దాని ప్రకారం వ్యూహాలు రూపొందించుకునే వెసులుబాటు కలుగుతుంది..

అధికారంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ కొంత ఒత్తిడిలో ఉంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీఏ మార్గాన్ని ఎంచుకున్నట్లు భావించాలి. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అని ఆలోచనలో పడిన కొందరు టీఆర్ఎస్ నేతలు దృఢనిశ్చయంతో బయటకు నడిచేందుకు కూడా ఆర్టీఏ సమాచారం పనికి వస్తుందని బీజేపీ ఆశపడుతోంది. ఈటల రాజేందర్ చేరిక తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేయాలని నిర్ణయించుకున్న బీజేపీ.. తాజా వ్యూహం కలిసొస్తుందని నమ్ముతోంది…

టీఆర్ఎస్ ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం. అలాగని భయపడుతుందనుకుంటే మాత్రం పొరపాటే. మోదీకి మించిన వ్యూహాలు రచించగల నేత కేసీఆర్. అందుకే ఇప్పుడు కారు పార్టీ కూడా బీజేపీ వ్యూహాన్నే అమలు చేయబోతోందని సమాచారం. మోదీ ఫారిన్ టూర్స్ పై ఆర్టీఐ దరఖాస్తు చేయాలని అనుకుంటోంది. కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి…