తన పనేదో తాను చూసుకునే వాడిని కూడా ఏదో ఒక వంకతో గెలికి రచ్చ చేస్తారు. వాడి మీద ఓ రాయి విసిరి తమాషా చూస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్నది అదే.
మునుగోడు ఎన్నికకు పోలింగ్ ముగిసిన వెంటనే అయన ప్రెస్ మీట్ పెట్టారు. భారతీయ జనతా పార్టీ మీద విరుచుకుపడ్డారు. టీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ఢిల్లీ దూతలు ఎలా బేరలాడింది, తమ ఎమ్మెల్యేలు ఎలా వారిని ట్రాప్ చేసిందో ఆడియో, వీడియో టేపులు చూపిస్తూ వివరించారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. తెలంగాణతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బిజెపి కొత్త కుట్రలు చేస్తున్నదంటూ కెసిఆర్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన ప్రధానంగా నాలుగు రాష్ట్రాల పేర్లను ప్రస్తావించారు. వాటిలో తెలంగాణ తరువాత ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తెలంగాణ లో ఏం జరుగుతుందో అందరికి తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు బిజెపి శతవిధాలా ఎరవేస్తున్నదని చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. రాజస్థాన్లో కూడా గ్రూపు కుమ్ములాటలను ఎగదోశారనే ప్రచారం ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉన్న పార్టీలు బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు. ఒకవేళ వారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి బిజెపి ప్రయత్నం చేసిందని ఆరోపించినా నమ్మడం కుదురుతుంది. కానీ ఈ రాష్ట్రాల జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ పేరును కేసీఆర్ ఎందుకు లాగారో అర్థం కావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 151 స్థానాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఈ ప్రభుత్వాన్ని కూలతోయాలంటే ఆషామాషీ వ్యవహారం ఎంత మాత్రమూ కాదు. ఏకంగా 55 -60 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పైగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి అంత సీన్ కూడా లేదు. లేదు. ఆ పార్టీని నమ్ముకుని ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా అంగుళం కూడా పక్కకు జరగరు అనేది సత్యం. పైగా జగన్ సర్కారుతో కేంద్రానికి సత్సంబంధాలే ఉన్నాయి. వారికి బలం అవసరమైన ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. మరి ఏపీలో కూడా సర్కారును కూల్చడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదని కెసిఆర్ ఎందుకు చెప్పినట్లు ? ఇలా చేయడం వెనుక ఒక వ్యూహం ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు.
కొత్తగా బి ఆర్ ఎస్ పేరుతో జాతీయ పార్టీని స్థాపించిన కేసీఆర్ కు పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలనే కోరిక ఉంది. త్వరలో విజయవాడలో బిఆరెస్ ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో తన సత్తా చూపించకుండా ఇతర ప్రాంతాలకు వెళితే జనం నవ్వుతారు. ఇంట గెలిచి రచ్చ గెలిచే ప్రయత్నం చేయమని వెక్కిరిస్తారు. అయితే కెసిఆర్ పట్ల ఏపీ ప్రజల్లో ఎలాంటి సానుకూలత లేదు. రాష్ట్ర విభజన నాటి ఆయన దుందుడుకు మాటలను ఏపీ ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. కనుకనే ఏపీ ప్రజలలో కూడా బిజెపి పట్ల ఒక భయం బీజం విత్తడం ద్వారా తన పట్ల వారిలో జాలి పెంపొందించుకోవాలని కేసీఆర్ ప్రయత్నం లాగా కనిపిస్తుంది. ఏపీని ముంచడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదనే మాటలు చెబితే.. అక్కడి ప్రజలు తనను విశ్వాసంలోకి తీసుకుంటారని ఆయన తలపోస్తున్నట్టుగా ఉంది.