తెలంగాణ అసెంబ్లీకి సీఎ కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న చర్చ కొద్ది రోజులుగా రాజకీయవర్గాల్లో విస్తృతంగా జరగుతోంది. ఇప్పుడు ఆ అంశంపై చాలా మందికి క్లారిటీ వచ్చింది.కానీ ఆగస్టులోనా.. జనవరిలోనా అన్న సందేహం ప్రారంభమయింది. కానీ పరిస్థితులన్నీ చూస్తూంటే ఆగస్టులోనే ముందస్తుకు వెళ్తారన్న అంచనాలు బలపడుతున్నాయి.
శంకుస్థాపనలు.. జిల్లాల టూర్లలో కేసీఆర్, కేటీఆర్ !
ప్రాజెక్టుల శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, జిల్లాల పర్యటనలతో కేసీఆర్, కేటీఆర్ చాలా బిజీగా ఉంటున్నారు. స్వల్ప అస్వస్థ కారణంగా కేసీఆర్ విరామం ఇచ్చారు కానీ మళ్లీ పర్యటనలకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. రాజకీయంగా కూడా తనకు.. కేటీఆర్కు ఎదురు లేకుండా చేసుకునే కార్యాచరణ కేసీఆర్ అమలు చేస్తున్నారు. గత ముందస్తు ఎన్నికలకు ముందు కూడాకేసీఆర్ ఇదే వ్యూహం అవలంభించారు. రైతు బంధు పథకం అమలుతో పాటు ఎన్నో ఎళ్లుగా పెండింగ్లో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇప్పుడు కూడా అదే వాతావరణం కనిపిస్తోంది.
అన్ని వర్గాలకు వరాలు ప్రకటిస్తున్న కేసీఆర్ !
ఇప్పటికే తొంభై వేల ఉద్యోగాల భర్తీని ప్రకటించి.. నిరుద్యోగుల్ని చదువుల వైపు మళ్లించిన కేసీఆర్.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అన్ని సెక్షన్ల వారికి వరాలు ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినవి కొన్ని పరిష్కారం కాగా, కొన్ని నిధులు లేక నిలిచిపోయాయి. మరికొన్ని అసలే ప్రారంభం కాలేదు. అయితే, అసెంబ్లీ చివరి రోజున పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అందరికీ వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మెప్మా, సెర్ప్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని ప్రకటన చేశారు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ తీసుకోవడం, మధ్యాహ్న భోజన కార్మికులకు వెయ్యి నుంచి 3 వేల వేతనం పెంపు, పీఆర్ఏలను ఇరిగేషన్లో లష్కర్లుగా ప్రమోషన్స్, 111జీవో రద్దు, దేవాలయ భూముల అన్యాక్రాంతం కాకుండా చర్యలు, సాదాబైనామాలు, నోటరైజ్డ్ డాక్యమెంట్ల క్రమబద్దీకరణ, కళాశాలు, డిగ్రీ కళాశాలల నిర్మాణం, ధరణి సమస్యల పరిష్కారం, 700లకు పైగా ఉక్రెయిన్ విద్యార్థులకు మెడికల్ విద్య, ఉస్మానియా ఆసుపత్రి పునర్ నిర్మాణం, అకాల వర్షాలకు పంటనష్టపోయిన పత్తి, రైతులకు పరిహారం, ఈ మార్చి 31 వరకు 40వేల కుటుంబాలకు దళిత బంధు, పోడు భూముల సమస్యకు పరిష్కారం, మెడికల్ కళాశాలల్లో నర్సింగ్ కళాశాలలకు అనుమతి, హెల్త్ యూనివర్సిటీల్లో పారామెడికల్ కోర్సులు, మైనార్టీ విద్యార్థులకు పెండింగ్ రీయింబర్స్ మెంట్ విడుదల తదితర హామీలను ఇచ్చారు. బడ్జెట్లో సైతం డబుల్ బెడ్రులతో పాటు ఇళ్ల స్థలాలు ఉన్నవారికి 3లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. ఒక్కసారిగా అన్ని వర్గాలను ఆకట్టుకునే వ్యూహంను అసెంబ్లీలో కేసీఆర్ అమలు చేశారు. తనపై వ్యతిరేకత ఉన్నాయని అనుకున్న ప్రతి వర్గాన్ని కూల్ చేస్తున్నారు.
అభ్యర్థులపై ఇప్పటికే ఓ అంచనా !
ముందస్తున్న ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకు వెళ్లారు. ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటన, విధుల విడుదల, చేసిన అభివృద్ధిని వివరించే పనిలో పడ్డారు. గతంలో జరిగిన అభివృద్ధి, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న కేసీఆర్.. అభ్యర్థులపైనా ఓ అంచనాకు వచ్చారు. చాలా మందికి సూచనలు కూడా వెళ్లాయి. అందుకే టీఆర్ఎస్లో కొంత మంది నేతలు తమకు టిక్కెట్లు దక్కవేమో అని.. కిందా మీదా పడుతున్నారు. అనుచరులతో సమావేశాలు నిర్వహించి ఒత్తిడి తెస్తున్నారు. ఇవన్నీ ముందస్తు సూచనలేనని అనుకోవచ్చు.
ముందస్తు ఆగస్టులోనే ఎందుకంటే ?
గతంలో జరిగిన ముందస్తు ఎన్నికల కారణంగా తెలంగాణలో ఎన్నికలు 2023 ద్వితీయార్థంలోనే జరగాల్సి ఉంది. ఈ సారి మరో ఏడాది ముందుగానే కేసీఆర్ఎన్నికలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న అసంతృప్తి బహిరంగంగానే కనిపిస్తోంది. సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న పార్టీగా ఆ అసంతృప్తి పెరుగుతుందే కానీ తగ్గదు. ఎంత చేసినా అది సహజం. తెలంగాణ సెంటిమెంట్ ఇప్పుడు వర్కవుట్ అయ్యే పరిస్థితి లేదు. అందుకే.. వ్యతిరేకత వీలైనంత తక్కువ ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ప్లాన్. ఎలా చూసినా తెలంగాణలో 60 మంది ఎమ్మెల్యేల బలం ఉంటే చాలు ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఇందులో ఏడు సీట్లు ఖాయంగా ఎంఐఎంకు వస్తాయి. అంటే టీఆర్ఎస్కు కావాల్సింది యాభై మూడే. ఆ ఆలోచనతోనే కేసీఆర్ ముందస్తుకు ఆగస్టులోనే ప్లాన్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు.