తెలంగాణ గవర్నర్ తమిళిసై తీరు ఏమిటి ? తెలంగాణతో పాటు తన స్వరాష్ట్రం తమిళనాడులో నేతలను కూడా ఆమె ఎందుకు విమర్శిస్తున్నారు. ఇటీవలి కాలంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా పేరు పొందిన ఎంకే స్టాలిన్ తోనే ఆమె నేరుగా తలపడుతున్నారా. బీజేపీ అధిష్టానం అండ చూసుకుని ఆమె రెచ్చిపోతున్నారా ?
ప్రజా ప్రభుత్వాలతో కొట్లాడటమే గవర్నర్ల పనా
ఏడాదిన్నరగా తెలంగాణ ప్రభుత్వంతో తమిళిసై తగవు
తాజాగా విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై వివాదం
చర్చించేందుకు మంత్రి సబితకు రాజ్ భవన్ నుంచి పిలుపు
గవర్నర్ల వ్యవస్థపై వ్యతిరేకత వ్యక్తం కావడానికి ఆ పదవిలో ఉన్న పెద్దల తీరే కారణమని చెప్పుకోవాలి. ప్రజా ప్రభుత్వాలను నిత్యం విమర్శిస్తూ వారిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ ఉండే గవర్నర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గవర్నర్లుగా ఉన్న వ్యక్తులు సంవత్సరాల తరబడి వివాదాలు సృష్టిస్తూనే ఉన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏడాదిన్నరగా రాష్ట్రప్రభుత్వంతో గొడవ పడుతూనే ఉన్నారు. నియామకాలను, బిల్లులను నిలిపేస్తున్నారు. ఏమి జరిగినా ఢిల్లీ వెళ్లి అమిత్ షా చెవులో ఊదేస్తున్నారు. తాజాగా విశ్వవిద్యాలయాల నియామకాల్లో ప్రభుత్వ వైఖరిపై యూజీసీకి ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయాల ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. రాజ్‌భవన్‌కు వచ్చి బిల్లుపై చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ బిల్లుపై అభిప్రాయం కోరుతూ యూజీసీకి లేఖ రాశారు. తెలంగాణ శాసనసభ మండలి ఇటీవల ఆమోదించిన 7 బిల్లులను ఆమె పెండింగ్ లో పెట్టారు.
పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు
స్వరాష్ట్రం తమిళనాడులోనూ తమిళసై వివాదాలు
స్టాలిన్ ప్రభుత్వంపై విసుర్లు
తెలుగు మాట్లాడే తమిళులంటూ డీఎంకే నేతలపై ఆరోపణలు
కేంద్రప్రభుత్వం తమిళసైకు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. దానితో ఆమె హైదరాబాద్ కు పుదుచ్చేరికి రాకపోకలు సాగిస్తున్నారు. నిజానికి తమిళసై తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా వాసి. చెన్నైలో గైనకాలజిస్టుగా స్థిరపడి తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అందుకే హైదరాబాద్ టు పుదుచ్చేరి ప్రయాణంలో చెన్నైలో ఆగుతూ అక్కడి రాజకీయాల్లోనూ జోక్యం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి, అక్కడి స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాల్లో తలదూర్చబోయారు. రవిని వెనుకేసుకొచ్చే ప్రయత్నంలో ఆమె అవసరానికి మించి ప్రవర్తించారన్న వార్తలు వస్తున్నాయి. దానితో డీఎంకే పత్రిక మురసోలిలో ఒక సంపాదకీయం ద్వారా తమిళిసైకు గట్టి కౌంటరిచ్చింది. . గవర్నర్లూ! అగ్ని పర్వతాలతో చెలగాటం వద్దు అంటూ డీఎంకే సమాధానమిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తమిళసైను పట్టించుకోకపోవడంతో ఆమె చెన్నైలో మకాం వేశారని డీఎంకే ఎగతాళి చేసింది. దానితో తమిళసై కూడా తనవైపు నుంచి కౌంటరిచ్చేందుకు ప్రయత్నించారు. తెలంగాణలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలన్నారు. తెలుగు మూలాలుండి ఇంట్లో ఆ భాష మాట్లాడుతూ తమిళ వేషాలు వేసే వారు తనను విమర్శిస్తున్నారని తమిళిసై అన్నారు. దీనితో ద్రవిడ పార్టీలు మొత్తాన్ని ఆమె విమర్శించినట్లయ్యింది.
ఎవరు.. ఎవరికి భయపడుతున్నారో తెలుసుకోవాలన్న తమిళసై
బీజేపీ అండతో గవర్నర్ రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు
గతంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళసై
అన్ని ఎన్నికల్లోనూ ఓటమి
తమిళసై మంచి మాటకారి. తాను మాట్లాడినది నిజమేనని నమ్మించగలిగే లక్షణం ఆమెకు ఉంది. డీఎంకేకు కూడా ఆమె తన మాటల గారిడీతో సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. గవర్నర్‌గా తెలంగాణ శాసనసభలో తమిళంలో తిరుక్కురళ్ సూక్తిని పఠించిన తమిళ వనితను నేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె తమిళ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేశారు. గత మూడేళ్లుగా తెలంగాణ స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలిస్తే ఎవరు భయపడుతున్నారో ఎవరు ధైర్యంగా ఉన్నారో మీకు తెలుస్తుందని ఆమె అంటున్నారు. తనకు సమాధానం చెప్పడానికి పాలకులు, కుటుంబ వారసులు, మంత్రులు కంకణం కట్టుకుని బారులు తీరారని ఆమె చెప్పుకుంటున్నారు. తమిళసై ఈ స్తాయిలో మాటల తూటాలు పేల్చడానికి కేంద్రంలోని బీజేపీ కారణమని భావిస్తున్నారు. ఏం జరిగినా మేము చూసుకుంటామని అమిత్ షా ఆమెకు హామీ ఇచ్చారట. నిజానికి తమిళసై చాలా కాలం బీజేపీలో ఉన్నారు. బీజేపీ తమిళనాడు శాఖాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. రెండు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. మరో రెండు సార్లు లోక్ సభకు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల్లో తూత్తుకుడి లోక్ సభా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి కరుణానిధి కూతురు కణిమొళి చేతిలో ఓడిపోయారు. తర్వాతే 2019 సెప్టెంబర్ 1న తెలంగాణ గవర్నర్ గా నియమితులయ్యారు. రాజకీయాల నుంచి వచ్చారు కదా. అందుకే ఆమెకు రాజకీయాలు చేసే అలవాటు ఉంటుందని విమర్శకలు అంటారు. అదన్నమాట అసలు సంగతి.