బ్రాండ్ ఇమేజ్ ఔట్

By KTV Telugu On 23 June, 2022
image

పథకాలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయా .. రాష్ట్రాలు ఆర్థికంగా తట్టుకోలేకపోతున్నాయా. నిధులు పక్కదారి పట్టడంతో వేరే పనులకు ఆటంకం కలుగుతోందా. ఓవరాల్ గా ఒక రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందా. ఒకసారి చూద్దాం.

కొత్తొక వింత పాతొక రోత అంటారు. అధికానికి వచ్చిన కొత్తల్లో సర్కారు వారికి పథకాలే పెద్ద కిక్కులా ఉంటాయి. అంత బాగా చేశాడు.. ఇంత బాగా చేశాడని పొడుగుతుంటూ తెగ సంబరపడిపోతారు. కాలం గడిచే కొద్దీ వాస్తవ పరిస్థితి తెలిసిన తర్వాత కిక్కు ఫుల్లుగా దిగిపోయి. అసలు సమస్యలు అర్థమవుతాయి. తొలుత ముప్పై నుంచి యాభై శాతం మంది పొడుగుతుంటే.. ఇప్పుడు వంద శాతం మంది విమర్శించడం ప్రారంభిస్తారు. అభివృద్ధి పనులు లేకపోవడంతో ప్రభుత్వానికి విశాల జనహితం అవసరం లేదనిపిస్తుంది. ఇక పూల వానలు ఆగిపోయి రాళ్ల దెబ్బలు మొదలవుతాయి.

సంక్షేమ పథకాలు, ఉచితాలు పెరిగిపోయి అప్పుల పాలయ్యే రాష్ట్రాల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. నిధులన్నీ పథకాల ఖాతాలో చేరిపోవడంతో  విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించలేక మాట దాటవేసే పరిస్థితి ఏర్పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లు సహా దేశంలోని అనేక స్టేట్స్ పరిస్తితి ఇది. దీనితో ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే సంస్థలకు విద్యుత్, నీటి సరఫరా రాయితీలు ఇవ్వలేకపోవచ్చు. అలాంటి రాష్ట్రాలల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు సంస్థలు వెనుకాడతాయి. బాగా రాయితీలిచ్చే రాష్ట్రాలకు వెళ్లిపోతాయి. అప్పుడు సంక్షేమ రాజ్యం అని చెప్పుకునే రాష్ట్రాల్లో తయారీ రంగం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తి అంటే జీఎస్డీపీలో అప్పుల శాతం పెరగడంతో  ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై భయాందోళనలు ప్రారంభమవుతాయి. ఏపీ లాంటి రాష్ట్రాల్లో అప్పులు త్వరలో 60 శాతానికి చేరుకునే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. దానితో పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనుమానాలు రావచ్చు. వస్తుత్పత్తి, వస్తు విక్రయాలకు ఆటంకాలు కలుగుతాయని భయం ఏర్పడొచ్చు. ప్రైవేటు పెట్టుబడులు రాకపోతే ఉపాధి అవకాశాలకు గండి పడుతుంది. పుట్టిన ప్రతీ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పలేం కదా… దీనితో అన్ని వైపుల నుంచి విమర్శలు పెరుగుతాయి. ఏదో దశలో సంక్షేమ పథకాలు అమలు జాప్యమవుతుంది. నిధుల కొరతతో తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నదదే. దానితో లబ్ధిదారులు తిట్టిపోస్తుంటారు. మౌలిక వసతులకు నిధులు కేటాయించడం లేదంటూ ఇతర వర్గాల వాళ్లు దుమ్మెత్తిపోస్తంటారు. ఇలాంటి వార్తలను మీడియాలో చూస్తున్నప్పడు పెట్టుబడిదారులకు కొత్త అనుమానాలు పుట్టుకొస్తాయి..

తెలుగు రాష్ట్రాల్లో తయారీరంగం దెబ్బతిన్నప్పటికీ… రెండు దశాబ్దాలుగా సాప్ట్ వేర్ పరిశ్రమ కాపాడుతూ వస్తోంది. తయారీ రంగానికి హైదరాబాద్ కేంద్రబిందువుగా మారింది. విద్యార్థులంతా ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో స్థిరపడటంతో కాస్త ఊరటగా ఉంది. లేని పక్షంలో ఇప్పటికే తయారీ రంగం దెబ్బతినడంతో ఉద్యోగావకాశాలు సున్నాస్థాయికి పడిపోయేవి. ఇక ఇప్పుడు సంక్షేమ పథకాలతో ఇతర పనులకు బడ్జెట్ లేక ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో రాష్ట్రాలు బాగా వెనుకబడిపోతాయి. పైగా ఏదో పథకం రూపంలో డబ్బులు రావడంతో  జనంలో కూర్చుని తినేతత్వం పెరిగి… పనిచేయడం మానేస్తారు. ప్రజలు  సోమరిపోతులుగా మారతారు…

ఏదేమైనా ఒక సారి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే.. తట్టుకోవడానికి చాలా కాలం పడుతుంది. ఇన్వెస్టర్లలో మళ్లీ నమ్మకం కలగడం అంత సులభం కాదు. పారిశ్రామిక రాయితీలు కొనసాగుతాయని నమ్మించగలగడం కూడా అంత సులభంగా జరిగే పనికాదు. మరో పక్క జనం సోమరిపోతులుగా మారితే వారిని మళ్లీ శ్రమజీవులుగా మార్చే ప్రకియ ఒక్క రోజులో జరిగే పనికాదు. ప్రభుత్వాలు, ప్రజలు ఆ సంగతి గుర్తిస్తే చాలు….