త్రిముఖపోటీలో బీజేపీకి ఎన్ని సవాళ్లో!
ఇప్పటిదాకా ఓ లెక్క..ఇప్పుడో లెక్క. ఎస్..ఇన్నేళ్లుగా ఆడుతూపాడుతూ గెలుస్తూ వచ్చింది బీజేపీ. ఇప్పుడక్కడ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది. ప్రధాని అంతటివాడే బీజేపీ గెలవడం చారిత్రక అవసరం అని అంటున్నారు. కమలం నాయకులంతా ఓటర్లను పదేపదే అభ్యర్థిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారతీరు చూస్తుంటే ఆ పార్టీ గెలుపుపై గన్‌షాట్‌గా లేదు. హార్థిక్పటేల్ని పార్టీలోకి లాగినా భూపేంద్రపటేల్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి తెచ్చినా సమీకరణాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన వెంటాడుతోంది.
ఆమ్ఆద్మీ కొత్త సవాలు విసురుతోంది. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో ఎన్ని చేసినా, ఎంత చెప్పినా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. కొన్ని పథకాలపై గిరిజనుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆ వ్యతిరేకతను ఆప్ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉంది. సూరత్ ప్రాంతంలో 2017 ఎన్నికల్లో 16కు 15 సీట్లు గెలుచుకుంది బీజేపీ. అయితే ఆ తర్వాత జరిగిన సూరత్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ఆద్మీపార్టీ 27 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆప్ వ్యూహాత్మకంగా పటీదార్ నేతలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ లెక్క తారుమారయ్యేలా ఉంది.
ఆప్‌తో పాటు కాంగ్రెస్ కూడా ఆదివాసీ ఓటుబ్యాంక్‌పై కన్నేసింది. అధికారం దక్కకపోయినా ఆదివాసీల సీట్లలో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. 2017 ఎన్నికల్లో 27 రిజర్వుడ్ సీట్లలో కాంగ్రెస్ 15 గెలుచుకుంటే బీజేపీ ఎనిమిది సీట్లలోనే నెగ్గింది. మరోవైపు సొంతపార్టీలో లుకలుకలు బీజేపీని బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈసారి కమలం పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువైంది. బరినుంచి తప్పుకోవాలని హెచ్చరించినా కొందరు రెబల్స్ ససేమిరా అంటున్నారు. దీంతో తిరుగుబాటు చేసిన 12మంది అభ్యర్థులపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎప్పుడూ లేనంత చెమటోడుస్తోంది.