అనుభవమైతేనే కానీ తత్వం బోధపడదని ఓ సామెత. అధికారం కళ్లు నెత్తికెక్కి ఏమి చేస్తున్నామో అర్థం కాని స్థితిలో అధికార పార్టీ నేతలు ఓడిపోయే వరకూ రాజకీయ పరిస్థితుల్ని అంచనా వేసుకోరు. చివరికి ఓడిపోయిన తర్వాతే తత్వం బోధపడుతుంది. నాటి కాంగ్రెస్ నుంచి నిన్నటి టీడీపీ వరకూ జరిగింది అదే. కానీ పరిస్థితుల్ని బేరీజు వేసుకుని ఎప్పటికప్పుడు తనను మార్చుకునే రాజకీయ నాయకుడే సక్సెస్ అవుతారు. అనుభవించకుండానే తత్వం బోధపడేలా చేసుకుని మళ్లీ విజయం అందుకుంటారు. ఈ విషయంలో ఇప్పటి నేతలు కూడా వెనుకే ఉన్నారు. ఒక్క నేత మాత్రం ముందున్నారు.. ఆయనే మోదీ.
రైతులకు క్షమాపణలు కూడా చెప్పిన మోదీ.. ఇలా ఎవరైనా ఆలోచించగలరా ?
యూపీలో బీజేపీ అంత విజయం ఎలా సాధించింది ?. సింపుల్గా చెప్పాలంటే తప్పులన్నీ ఎన్నికలకు ముందు కరెక్ట్ చేసుకున్నారు. తాము మారిపోయామని ప్రజల్ని నమ్మించగలిగారు. బీజేపీ పరిస్థితి క్లిష్టంగా ఉందని అంతర్గత సర్వేల్లో తేలినప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏ మాత్రం భేషజాలకు పోలేదు. హఠాత్తుగా వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అంతటితో వదిలి పెట్టలేదు. రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు. వ్యవసాయ చట్టాల విషయంలో మోదీ వ్యవహరించిన తీరు యూపీ ఓటర్లను ఆకట్టుకుంది. అది ఫలితాల్లో కనిపించింది. ఇక్కడే మోదీ ” రాజకీయ తత్వం” అర్థమైపోతుంది.
ఏపీలో బెట్టుకుపోతున్న సీఎం జగన్ !
ఇక ఏపీలోనూ ఆ తరహాలోనే రైతు ఉద్యమం జరుగుతోంది. అమరావతి రైతులు ఏళ్ల తరబడి ఉద్యమిస్తున్నారు. వారి వైపు న్యాయం ఉంది.. ధర్మం ఉంది. చట్టం కూడా వారి వైపే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రమే వారి వైపు లేదు. వారి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎవరికీ సదభిప్రాయం లేదు. మొదట్లో డిల్లీ రైతులపై బీజేపీ నేతలు ఎన్నెన్ని నిందలేశారో… అమరావతి రైతులపై వైసీపీ నేతలు అన్ని నిందలేశారు. అదే స్థాయి నిర్బంధాన్ని కూడా చూశారు. అయితే బీజేపీ రియలైజ్ అయి.. క్షమాపణలు చెప్పి.. విజయాన్ని మళ్లీ దరి చేర్చుకుంది. ఢిల్లీ రైతుల పోరాటం తరహాలోనే ఉన్న అమరావతి రైతుల పోరాటానికి న్యాయపరంగా విజయం లభించింది. కానీ ఇప్పటికి ఏపీ ప్రభుత్వం వాస్తవాన్ని గ్రహించలేకపోయింది. ప్రధాని మోడీ పార్టీ కోసం ఎన్నో మెట్లు దిగి.. రైతులకు క్షమాపణలు కూడా చెప్పి రైతు చట్టాల్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం న్యాయపరంగా సాధ్యం కాదని తెలిసినా… ఇంకా మూడు రాజధానుల పాటే పాడుతోంది. రైతుల్ని కించ పరుస్తూనే ఉంది.
మోదీ ఫార్ములాను ప్రయోగిస్తే జగన్కు లాభమే కానీ నష్టమేముంది ?
ఏపీ ప్రభుత్వానికి న్యాయపరంగా.. చట్ట పరంగానే కాదు.. ఆర్థిక పరంగా కూడా అమరావతిని వ్యతిరేకించడం వల్ల వైసీపీకి వ్రతం చెడుతుంది.. ఫలితం దక్కదు. ఆ విషయం వైసీపీలో క్లారిటీ ఉంది. కానీ ఎందుకో ముందడుగు వేయలేకపోతున్నారు. బహుశా అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి.. రైతులకు క్షమాపణలు చెబితే.. తమ ఈగో ఎక్కడ హర్ట్ అవుతుందుని ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ రాజకీయాల్లో ఈగోకు చోటే ఉండదు. అలాంటి ఈగో పెట్టుకుంటే తాత్కాలిక విజయాలు లభించవచ్చేమో కానీ..అంతిమంగా చావు దెబ్బతింటారు. ఈ విషయాలన్నీ రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న మోదీకి తెలుసు కాబట్టే.. అడుగులు వ్యూహాత్మకంగా ముందుకు వేశారు.
తప్పు ఒప్పుకుంటే మైనస్ అవుతుందని భయపడుతున్నారా ?
అమరావతి విషయంలో తాము తప్పు చేశామని అంగీకరిస్తే మొదటికే మోసం వస్తుందని వైసీపీ పెద్దలు భయపడుతూ ఉండవచ్చు. కానీ రాజకీయాలు గతంలోలా లేవు. ఆ విషయం మోడీ రైతులకు క్షమాపణలు చెప్పి మరీ సక్సెస్ కొట్టినప్పుడే తెలిసిపోతుంది. యూపీ విజయం చూసిన తర్వాత వైసీపీ.. గెలుపు కోసం.. మోడీ బాటలో వెళ్తుదో లేదో చూడాలి. లేకపోతే.. మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యం లేదు. మోదీ అనుభవించకముందే తత్వం గురించి తెలుసుకున్నారు.. మళ్లీ అధికారం అందుకున్నారు.. కానీ అమరావతి రైతుల విషయంలో సీఎం జగన్ అనుభవించే తత్వం బోధపడేలా చేసుకోవాలనుకుంటున్నారు. అదే జరుగుతుంది.