” సైలెన్స్ కూడా ఎంత వయోలెంట్” గా ఉంటుందో చూడరా ! అని ఓ సినిమాలో తనికెళ్లభరణి డైలాగ్ చెబుతాడు. చెవులు భరించలేనంత శబ్దకాలుష్యం తర్వాత ఇలా ఒక్క సారిగా సైలెంట్ అయిపోతే.. అది రిలీఫ్‌గా కన్నా కాస్త భయం కల్పించేదిలా ఉంటుంది. రాజకీయాల్లో ఇలాంటి ఎఫెక్ట్ తీసుకోవడం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ది ప్రత్యేక శైలి. ఆయన రాజకీయ వ్యూహాల్లో మౌనం అత్యంత కీలకం. ఆ మౌనమే చాలా సార్లు రాజకీయాలను మార్చింది. ఇప్పుడు మరోసారి మౌనవ్యూహం పాటిస్తున్నారు. అందుకే తర్వాత కేసీఆర్ ఎలాంటి వయోలెంట్ రాజకీయం చేయబోతున్నారన్న చర్చ ప్రారంభమయింది.
రెండు వారాలుగా ఫామ్‌హౌస్‌కే కేసీఆర్ పరిమితం !
తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది రోజులుగా ఫామ్‌హౌస్‌లోనే మేథోమథనం జరుపుతున్నారు. పీకే వచ్చి కలిసి వెళ్లక ముందు నుంచి ఆయన ఫాంహౌస్‌లోనే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మధ్యలో ఓ సారి ఢిల్లీ టూర్ ఖరారు చేసుకున్నారు. ఈ సారి రెండు వారాల పాటు ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. కానీ ఢిల్లీ టూర్‌కు కూడా వెళ్లలేదు. జాతీయ పార్టీ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారని భావిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆయన ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ఉన్న ఓట్లు కీలకమే. బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిస్తే కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు తెలిపినట్లే అవుతుంది. బీజేపీ ప్రకటించే అభ్యర్థికి మద్దతు తెలిపితే ఇంత కాలం చేసిన పోరాటం వృధా అవుతుంది. ఇప్పుడు ఏ వ్యూహం అవలంభించాలన్నదానిపై కేసీఆర్ కసరత్తు నడుస్తోందంటున్నారు.
కాంగ్రెస్ , బీజేపీ దూకుడుపై కొత్త ప్లాన్‌తో వస్తారా ?
బీజేపీ పూర్తి స్థాయిలో టార్గెట్ చేయడంతో .. కేసీఆర్ సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అప్పులు ఇవ్వకపోవడం వల్ల జీతాలు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. సంక్షేమ పథకాలు, పింఛన్లు, రైతుబంధు, దళితబంధు ఇలాంటి పథకాలకు నిధులు లేకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించి ప్రజల్లోకి వెళ్తోంది. రాహుల్ గాందీ పర్యటన తర్వాత ఆ పార్టీ మరింత దూకుడుగా వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ .. ఏ కార్యచరణతో ముందుకు వెళ్తారన్నది’ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. ఏ వ్యూహంతో ముందుకెళ్తారన్నది పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కేసీఆర్ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అంత తేలికగా కేసీఆర్ ప్లాన్ మార్చుకోరని .. రెండు పార్టీలను ఢీ కొట్టే విషయంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు.
మళ్లీ ఢిల్లీ టూర్ ఎప్పుడు !?
మౌన వ్యూహం వదిలి మళ్లీ రాజకీయం ప్రారంభించినతర్వాత కేసీఆర్ మొదటగా ఢిల్లీకే వెళ్తారని చెబుతున్నారు. పూర్తిగా రాజకీయ కోణంలోనే పర్యటన జరపనున్నారు. రైతు నాయకులతో సమన్వయం చేసుకోవడం.. రైతు ఉద్యమంలో చనిపోయినవారికి ఆర్థిక సాయం చేయడం వంటి పనులు చేయనున్నారు. బీజేపీ నాయకుడు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు రైతులపైకి కారు ఎక్కించిన ఘటన జరిగిన లఖీంపూర్ ఖీరీకి కేసీఆర్ వెళ్లి బాధిత కుటుంబాల్ని పరామర్శించి.. ఆర్థిక సాయం అందిస్తారు. తర్వాత కేసీఆర్ పలు రాష్ట్రాలకు పర్యటనలు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నుంచి మొత్తంగా కేసీఆర్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. అది ఎంత దూకుడుగా ఉంటుందన్నది ఆయన వ్యూహాన్ని బట్టి వెల్లడయ్యే అవకాశం ఉంది.