పీకే సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఖరారు చేస్తాం. సిట్టింగ్‌లు అందరికీ టిక్కెట్లు దక్కుతాయని అనుకోవద్దని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా చెబుతున్నారు. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన సర్వే టీములు నియోజకవర్గాల్లో హడావుడి చేస్తున్నాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు తంటాలు పడుతున్నారు. పార్టీ అధ్యక్షుడి కన్నా ముందు పీకే టీంను సంతృప్తి పరిస్తే.. మెరుగైన రిపోర్టు వస్తుందని వారు ఆశపడుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోంది. పీకే టీం వీలైనంత వరకూ స్వతంత్రంగా సర్వేలు చేస్తోంది. కానీ అలా చేయాలంటే అధికార యంత్రాంగం మద్దతు అవసరం., దీంతో సహజంగానే పీకే టీంం గురించి తెలిసిపోతోంది. ఈ క్రమంలో ఇప్పుడు పార్టీ నేతలంతా పీకే ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనితీరు, ఆయనపట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, వారి కుటుంబ సభ్యుల రాజకీయ ప్రమేయం తదితర వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో అందజేస్తోంది. అందరికీ టిక్కెట్లిస్తామని .. గెలిపించుకుంటామని కేసీఆర్ పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టిన ప్రతీ సారి చెబుతూ ఉంటారు. దానికి తగ్గట్లే గత ఎన్నికల్లో చాన్సివ్వడంతో ఈ సారి కూడా తమకే అవకాశం దక్కుతుందని సిట్టింగ్‌లు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న ప్రచారం మధ్య పీకే టీం సర్వే కీలకంగా మారింది. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొనడంతో ఇప్పటివరకు ధీమాతో ఉన్న సిట్టింగుల్లో ఆందోళన మొదలైంది. ఎంతమందికి అవకాశం దక్కుతుందనే చర్చ నేతల్లో ప్రారంభమైంది. టికెట్ దక్కదేమోనని కొంతమంది సిట్టింగ్‌లు ఫైరవీలు చేసేందుకు వెనుకాడటం లేదు.
టికెట్ ఆశించే సిట్టింగులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, గత ఎన్నికల్లో ఆశించి భంగపడిన నేతలు, ఓడిపోయిన నేతలు నిధులను సమకూర్చుకోవడంతో పాటు ఎవరితో నైతే టికెట్ పక్కాగా వస్తుందో వారితో పైరవీలు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అందుకోసం ఖర్చుకు వెనుకాడబోమని, విజయం సాధించి తీరుతామనే సంకేతాన్ని సైతం పార్టీ అధిష్టానానికి స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది ముందు పీకే టీంను సంప్రదిస్తున్నారు. తమ బలాలు .. ఆర్థిక స్థోమతను ప్రదర్శిస్తున్నారు. పరిస్థితి చూస్తూంటే ఇప్పటికి టీఆర్ఎస్ హైకమాండ్ కేసీఆర్ కాదని.. పీకేనే అన్నట్లుగా ఉందన్న చర్చ నడుస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల సంగతి మరీ దారుణంగా ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్, టీడీపీ ఎల్పీలను సైతం టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ నియోజకవర్గాల్లో సైతం ఐప్యాక్ సర్వేలో అంత సానుకూల ఫలితాలు రావడం లేదు. ఇద్దరు ముగ్గురికి తప్ప మిగిలిన వారికి సానుకూలత లేదని చెబుతున్నారు. దీంతో వారిలోనూ టెన్షన్ ప్రారంభమయింది. ఒక వేళ వారికి చాన్సివ్వకపోతే.. అసంతృప్తులు పెరిగిపోతారు. ఉమ్మడి పది జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో ఇద్దరి నుంచి నలుగురు వరకు టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఎవరికి వారు ప్రజాసేవ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలను సైతం తమ కార్యకర్తలతో వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. తమకే టికెట్ వస్తుందని ప్రచారం సైతం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సిట్టింగ్ అవకాశం ఇవ్వబోమని సర్వే ప్రకారం అభ్యర్థులకు టికెట్ ఇస్తామని చెబుతుండటంతో రెబల్స్ పెరిగే అవకాశం ఉంది. సిట్టింగులు సైతం పార్టీకి రెబల్స్‌గా మారే అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్న కేసీఆర్, ప్రశాంత్ కిషోర్‌పై అతిగా ఆధారపడుతున్నారన్న అభిప్రాయం టీఆర్ఎస్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల సొంత పార్టీపై ఆయన పట్టు కోల్పోతారని ఆందోళన చెందుతున్నారు. కేటీఆర్ కూడా టిక్కెట్లు రాకపోవడానికి పీకే సర్వే అనే కారణం చెప్పవచ్చన్న ఉద్దేశంతో అలా అంటున్నారు కావొచ్చని … లేకపోతే మొత్తం పీకే చేతుల్లో ఎందుకు పెడతారని భావిస్తున్నారు. ఇప్పటికైతే.. టీఆర్ఎస్లో పీకే ప్రభావం ఎక్కువగా ఉంది. దీనిపై పార్టీలో ఓ రకమైన అసంతృప్తి కనిపిస్తోంనేది టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నమాట !