ఆపరేషన్ ఫాంహౌస్…అదిరిపడ్డ లోటస్..
కేంద్రం ఎవరినైనా టార్గెట్ చేస్తే ఈడీ రంగంలోకి దిగుతుంది. ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతాయి. ఎంత తోపు అయినా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. కానీ కేసీఆర్ చాణక్య వ్యూహంతో బీజేపీ తొలిసారి డిఫెన్స్‌లో పడాల్సి వస్తోంది. కోడిగుడ్డుపై మీరు ఈకలే పీకుతారేమో నేను మొలకలు మొలిపిస్తానన్నట్లు టీఆర్ఎస్ పాచికలు విసురుతోంది. ఫాంహౌస్ కేసులో కొండను తవ్వి ఎలుకని కూడా పట్టలేకపోయారన్న బీజేపీకి షాక్ మీద షాక్ ఇస్తోంది.
నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి ముగ్గురొచ్చారు. వారిలో ఇద్దరు స్వామీజీలు. ఫాంహౌస్ ఎమ్మెల్యేదే అయినా ఆడియోల్లో గొంతులు మాత్రం ఎవరివి వాళ్లవే. మ్యాటర్ లేని ఎమ్మెల్యేలను వందేసి కోట్లు పెట్టి ఎందుకు కొంటామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది కూడా లేదు. వందమంది ఎమ్మెల్యేల మద్దతున్న ప్రభుత్వాన్ని పడగొట్టటం ఎలా సాధ్యమని లాజిక్ మాట్లాడుతున్నారు. కానీ ఆ ముగ్గురూ ఎందుకొచ్చినట్లు? ఎవరితో ఏం మాట్లాడినట్లు?
నెంబర్ వన్, నెంబర్ టూలు ఎవరు? ఏ సంబంధం లేకుండానే ఫరీదాబాద్ రామచంద్రభారతి బీఎల్ సంతోష్‌తో మాట్లాడతాడా? ఇదేమీ నకిలీనోట్ల బేరం కాదే స్పాట్లో సూట్‌కేసులు మార్చేసుకుని పరారైపోడానికి! మునుగోడులో కూడా గెలిస్తే టీఆర్ఎస్కి చెక్ పెట్టొచ్చు. ఆ ఎన్నికకాగానే ఎమ్మెల్యేల ఫిరాయింపులకు తెరలేపితే కేసీఆర్‌ని వీక్ చేయొచ్చనే మైండ్‌గేమ్‌కి అది అంకురార్పణ. కానీ కేసీఆర్ ముందే పసిగట్టడమో, ఎలాగూ ఆయనకు తెలిసిపోతుందని పైలెట్ రోహిత్‌రెడ్డి తానే ఓ చెప్పేయడమో జరిగిపోయింది. ఫోన్ల ట్యాపింగ్‌లు, కాల్ రికార్డింగ్‌లు పెద్ద పని కాదుగా. తాము ఎవరితో మాట్లాడామో, ఆపరేషన్ మూలాలేంటో ఆ ముగ్గురూ నోరిప్పాల్సి ఉంటుంది. బెంగాల్లో అదే చేశామంటున్నారు. ఢిల్లీలో కూడా అదే జరుగుతోందంటున్నారు. ఫాంహౌస్ డీల్‌మీద ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. మహారాష్ట్రలో కోట్ల రూపాయల బేరసారాలమీద పెద్ద రగడే జరుగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికలకల్లా విపక్ష రాష్ట్రాల్లో గేమ్ ఛేంజ్‌కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్న బీజేపీని ఈ ఎపిసోడ్ ఇరిటేట్ చేస్తోంది. నిందితుల్ని రిమాండ్‌కి పంపిన పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకుంటారు. తమకు కావాల్సిన విషయాల్ని కక్కిస్తారు. ఆలోపు కేసుని సీబీఐ టేకప్‌చేసి మసిపూసి మారేడుకాయ చేస్తే చెప్పలేంకానీ.. ఇప్పటికైతే ఆపరేషన్ ఫాంహౌస్ లోటస్పార్టీని ఇరుకున పడేసింది.