తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయానని ప్రకటించారు . బీజేపీపై విరుచుకుపడుతున్నారు . జాతీయాంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఆయన జాతీయ రాజకీయ రహదారి ఏమిటన్నదాని మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. దీనికి కారణం కాంగ్రెస్ కూటమిలో ఆయన కలవలేరు.. కలుస్తామన్న కాంగ్రెస్ ఆలోచించుకునే పరిస్థితి. బీజేపీతో యుద్ధం కాబట్టి అటు వైపే పోలేరు. ప్రాంతీయ పార్టీల కూటమి సుదూర స్వప్నంలా ఉంది. అది సాధ్యం కాదని ఇప్పటి వరకూ అనుభవాలు నిరూపిస్తున్నాయి . అందుకే కేసీఆర్ ముందున్న ఒకే ఒక ఆప్షన్ జాతీయ పార్టీ .
సొంత జాతీయ పార్టీ అవసరమని ముందుగానే కేసీఆర్‌కు క్లారిటీ !
అవసరమైతే జాతీయ పార్టీ పెడతాననని కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పారు. కేసీఆర్ ఓ ప్రాంతీయ పార్టీ అధినేత. తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేశారు. అలాంటిది ఓ జాతీయ పార్టీ పెడతాను అంటే అందరూ విచిత్రంగా చూస్తారు. చూశారు కూడా . కానీ కేసీఆర్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఆయనకు జాతీయ రాజకీయాలపై సంపూర్ణమైన అవగాహన ఉంది. అన్ని సమీకరణాలు చూసిన తర్వాత ఆయన ఏదీ వర్కవుట్ కాదనే అంనచాకు వచ్చారు. అయితే ప్రయత్నాలు అయితే చేయాలి కాబట్టి చేయడానికి సిద్ధపడ్డారు. అందుకే.. అవసరమైతే జాతీయ పార్టీ అనే వాదన తీసుకు వచ్చారు. ఇప్పుడు ఇప్పుడా అవసరం వచ్చిందన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. కాంగ్రెస్ కూటమితో కలవలేకపోవడం… బీజేపీతో వైరం… తృతీయ ఫ్రంట్ కోసం ప్రాంతీయ పార్టీల్లో చిత్తశుద్ధి లేకపోవడం దీనికి కారణం.
జాతీయ పార్టీకి రైతు ఇమేజ్ కోసం వ్యూహాత్మకంగా ప్రయత్నం !
జాతీయ పార్టీ పెట్టాలంటే తెలంగాణ నేతగా అయితే సాధ్యం కాదు. జాతీయ గుర్తింపు ఉండాలంటే దానికి తగ్గ రంగంలో ఉద్యమం చేయాలి. అందుకే కేసీఆర్ రైతు ఎజెండాను ఎంచుకున్నారు. అదే వ్యూహంతోనే కేసీఆర్ జాతీయ స్థాయిలో రైతు నేతగా ప్రొజెక్ట్ అయ్యేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమవ్వాలన్న సలహాలున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ బలపడకపోతూడంటంతో ఆ స్థానం తమకు దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ బలం మీద నమ్మకం ఉన్న వారు ఆ పార్టీతోనే నడుస్తున్నారు. తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా మత వ్యతిరేక లేఖ రాసిన పార్టీల్లో కాంగ్రెస్ సహా పదమూడు మిత్రపక్షాలున్నాయి. అవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే ఉండటం ఖాయం. లేక మీద సంతకం చేయికపోయినా ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు కాంగ్రెస్‌తోనే ఉంటాయి. అంటే కేసీఆర్ చెప్పే మూడో కూటమి… ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదు. ఎస్పీ, తృణమూల్ పార్టీలతో కలిసి కూటమి సాధ్యం కాదు. ఎందుకంటే వారి తీరు భిన్నంగా ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి కేసీఆర్.. జాతీయ కొత్త పార్టీ పెట్టే దిశగా కసరత్తు చేసి.. దానికి రైతు ఇమేజ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
జాతీయ పార్టీ పేరు “నయా భారత్”గా ఇప్పటికే ప్రచారం !
నిజానికి కేసీఆర్ గతంలోనే జాతీయ పార్టీ ప్రకటనకు ఏర్పాట్లు చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. భారత్” అనే పేరు ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ఈసీ వద్ద రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో కేసీఆర్ ఈ వార్తల్ని ఖండించారు. పార్టీ స్వరూపం భిన్నంగా ఉండేలా కేసీఆర్ డిజైన్ చేశారని.. కొన్ని పార్టీల కూటమిగా… ఈ వేదికను రూపొందించే అవకాశం ఉందని అప్పట్లో టీఆర్ఎస్ వర్గాలు మీడియాకు ఆఫ్ ది రికార్డుగా చెప్పాయి. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడానికి ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే.. ప్రాంతీయ పార్టీలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్న అంచనా ఉంది. అందుకే.. కేసీఆర్… బీజేపీ వ్యూహానికి విరుగుడుగా… జాతీయ పార్టీ రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
మహారాష్ట్ర భేటీ తర్వాత కీలక నిర్ణయం !
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాకరే త్వరలో బీజేపీయేతర సీఎంల ససమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశానికి వచ్చే స్పందనను బట్టి కేసీఆర్ జాతీయ పార్టీనా లేకపోతే ప్రత్యామ్నాయ కూటమినా అన్న ఆలోచన చేసే అవకాశం ఉంది. మరో ఒకటి, రెండు నెలల్లోనే ఏదో ఒకటి తేల్చేసే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారు.