తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం కేంద్రం, బీజేపీపై నిర్వహించిన వరి యుద్ధాన్ని చివరికి ముగించారు. ఈ యుద్ధంలో ప్రత్యర్థి అయిన బీజేపీని, కేంద్రాన్ని ఆయన కేసీఆర్ ఎంత మేర దెబ్బకొట్టారో స్పష్టత లేదు. రైతుల దృష్టిలో బీజేపీని దోషిగా నిలబెట్టారా లేదా అన్నది ఇప్పుడల్లా తేలే అవకాశం లేదు. కానీ బీజేపీ ప్రమేయం లేకుండానే కేసీఆర్ యుద్ధాన్ని ముగించేశారు. ఏ డిమాండ్లు అయితే బీజేపీకి కేసీఆర్ పెట్టారో వాటిని కనీసం కూడా పరిగణనలోకి తీసుకోలేదు. పైగా తెలంగాణ ప్రభుత్వం సంతకం చేసిన అగ్రిమెంట్‌ను బయట పెట్టి చేయాల్సినంత ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో వరి యుద్ధంలో కేసీఆర్ కేసీఆర్ విజయం సాధించారా ? లొంగిపోయారా ?
బీజేపీ కొంత మేర కార్నర్ చేయగలిగిన కేసీఆర్ !
వడ్ల యుద్ధం పేరుతో బీజేపీని రాజకీయంగా కార్నర్ చేసేందుకుతీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్రం తెలంగాణ రైతులను గాలికి వదిలేసిందన్న అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నించారు. ఢిల్లీలో కూడా ధర్నా చేశారు. కేంద్రం పట్టించుకోవడం లేదు కాబట్టి… వడ్లు మొత్తం తామే కొంటామని ప్రకటించారు. చివరికి బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు చేయాల్సిన ప్రయత్నం అంతా చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజంలో చర్చకు కారణం అయ్యాయి. నూకలు తినడం అలవాటు చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరగడం బీజేపీకి ఇబ్బందికరమే. ఆత్మగౌరవ నినాదంతో సొంత రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణ ప్రజలకు ఇలాంటి వ్యాఖ్యలు నచ్చవు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీఆర్ఎస్కు కేసీఆర్‌కు అవకాశం చిక్కుతోంది.
పరిష్కారం కేసీఆర్ చేతుల్లో ఉన్నా రాజకీయం చేశారన్న విమర్శలు !
వడ్ల కొనుగోలు అంశంలో పరిష్కారం కేసీఆర్ చేతిలోనే ఉన్నా.. ఈ రాజకీయం చేశారన్న అభిప్రాయం రైతుల్లో ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. వడ్ల కొనుగోలు అనేది మొదటినుంచి ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. కేంద్రం ఎప్పుడూ నేరుగా కొనుగోలు చేయలేదు. ఆ విషయం రైతులకు స్పష్టత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వడ్లను సేకరించి ధాన్యం గా మార్చి ఎఫ్‌సీఐకి ఇస్తే.. ఎఫ్‌సీఐ బిల్లులు . ఇప్పుడూ అదే జరుగుతుంది. స్వయంగా తెలంగాణ సర్కార్ కూడా బియ్యాన్ని ఇస్తామని ఒప్పందం చేసుకుంది. అయినా వడ్లు కొనాలని కేసీఆర్ ఉద్యమం చేశారు. చివరికి తానే కొంటామన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసినా ధాన్యం మాత్రం కేంద్రానికి ఇవ్వాల్సిందే. నూక కారణంగా మిగిపోయిన బియ్యం భారాన్ని మాత్రం రాష్ట్రం మోయాల్సి ఉంటుంది.
కొత్త సమస్యలు సృష్టించుకున్న కేసీఆర్ !
రైతులను పూర్తిగా బీజేపీకి వ్యతిరేకం చేయడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నాల్లో కొన్ని ఆయనకూ ఇబ్బందికరంగా మారాయి. అలాంటి వాటిలో మొదటిది వరి పంట వేయవద్దని రైతులకు గతంలో ఇచ్చిన పిలుపు. ఈ పిలుపు వల్ల వరి పంట వేయకుండా పొలాన్ని బీడు పెట్టుకున్న రైతులు. యాసంగి వడ్లను ప్రతి గింజను కొంటామని తాజాగా కేసీఆర్ చేసిన ప్రకటన చాలా మంది రైతుల్ని ఆశ్చర్య పరిచింది. వరి వేయవద్దని ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఉండదని గత ఏడాది కేసీఆర్ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారు.. వచ్చే ఏడాది నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని… ఎట్టి పరిస్థితుల్లోనూ వరి పంట వేయవద్దన్నారు. చివరికి వారికి వరి విత్తనాలు దొరకుండా కలెక్టర్ల స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశారు. ఎంతైనా ప్రభుత్వం చెబుతోంది కదా అని .. వేల మంది రైతులు వరి పంటను పెట్టలేదు. చాలా మంది ప్రత్యామ్నాయ పంటలు కూడా వేయలేపోయారు. ఫలితంగా నీటి సౌకర్యం ఉన్నా వేల ఎకరాలు బీళ్లుగా ఉండిపోయాయి. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించలేకపోవడం కూడా దీనికి కారణం. వారంతా పంటలు వేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ప్రభుత్వం మాట వినకుండా వరి పంట వేసిన వారికి ప్రభుత్వం అండగా ఉంటోంది.. కానీ ప్రభుత్వం మాట విని ఏ పంటా వేయని వారి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. వారందరికీ కేసీఆర్ ఎలా సర్ది చెబుతారన్నది కీలకం.
మొత్తంగా కేసీఆర్ చేసిన వరి యుద్ధం రాజకీయంగా ఆయనకు ప్లస్సా.. మైనస్సా అన్నది అంచనా వేయడం కష్టం. రైతుల్లో ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి మేరకు చూస్తే ఆయన వ్యూహంలో లోపం మాత్రం స్పష్టంగా ఉందన్న అభిప్రాయం రాజకీయ నిపుణుల్లో ఉంది.