మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హల్‌చల్‌లో నారా లోకేశ్ పేరు కనుమరుగై పోయింది. లోకేశ్ తన అడ్డా అని చెప్పుకునే మంగళగిరిలో రాత్రికి రాత్రి పవన్ ఇమేజ్ రెండింతలైంది. దాంతో లోకేశ్ కంగుతిన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోగా పవన్ ఇప్పటం రావడం జరిగింది పోవడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు నారా లోకేశ్. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల‌్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓడిపోయిన చోటే గెలిచి సత్తా చాటాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు లోకేశ్. అప్పుడప్పుడు మంగళగిరిలో పర్యటిస్తూ సొంత డబ్బుతో కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. క్రమంగా ప్రజల్లో లోకేశ్ ఇమేజ్ పెరుగుతోంది అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామానికి వచ్చి నానా హడావుడి చేసి వెళ్లిపోయారు.
ఈ మొత్తం ఎపిసోడ్లో నారా లోకేశ్ ఊసే లేదు. ఇప్పటికే జనసేన, టీడీపీ అనధికారికంగా చేతులు కలిపాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. మరి అలాంటప్పుడు తన ఇప్పటం పర్యటనలో లోకేశ్‌ను కూడా కలుపుకుని ఉంటే తమకు కూడా మైలేజీ వచ్చేది కదా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మధన పడుతున్నాయి. ఇన్నాళ్లూ కష్టపడి తనవైపుకు తిప్పుకున్న జనం దృష్టి ఇప్పుడు పవన్ వైపు మళ్లితే తన పరిస్థితి ఏంటని లోకేశ్ ఆందోళన. ఇప్పటంలో పవన్ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ. ఆ ఉద్దేశంతో రేపు ఎన్నికల పొత్తులో భాగంగా మంగళగిరి సీటును జనసేన డిమాండ్ చేస్తే లోకేశ్ కు ఇబ్బందులు తప్పవు. అప్పుడు తాను మరో నియోజకవర్గం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆయన మంగళగిరిలో సంపాదించుకున్న ఇమేజ్ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లు పవన్‌తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వద్దామనుకుంటే ఉన్న సీటు కాస్త ఊడిపోయేలా ఉందే అనుకుంటున్నారట లోకేశ్.