తెగిడినా, పొగిడినా దానికో లెక్కంటుంది!
తమ్ముడికి రూట్‌మ్యాప్.. అన్న నెత్తినో క్యాప్!
బీజేపీ ఏం చేసినా పక్కా రాజకీయ ఎజెండా ఉంటుంది. అందులో నో డౌట్. ఓ నటుడిని లంచ్ మీటింగ్‌కి పిలిచినా, నువ్వు సూపర్ అని మరో ప్రముఖుడిని పొగిడినా కమలంపార్టీకి ఉండే లెక్క వేరే. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికప్పుడు పనికొస్తాడనుకుంటే ముందునుంచే గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. ఆ మధ్య నితిన్‌ని పిలిచి మాట్లాడారు. తర్వాత తెలిసింది నిఖిల్ బదులు అతన్ని పిలిచారని. కార్తికేయ-2 పాన్ఇండియా మూవీగా పేరుతెచ్చుకోవటంతో నిఖిల్ బీజేపీ కళ్లలో పడ్డాడన్నమాట!
తెలుగురాష్ట్రాల్లో బలంపుంజుకోవాలనుకుంటున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టేసింది. చరిష్మా ఉన్న వ్యక్తుల వేటలో పడింది. ప్రజారాజ్యంపెట్టి తర్వాత దాన్ని కాంగ్రెస్‌లో కలిపేసి ప్రస్తుతం రాజకీయంగా సోలోగా ఉంటున్న మెగాస్టార్‌ని దువ్వుతోంది. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ అవార్డు దక్కింది. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డ్ ప్రకటించగానే ప్రధాని క్షణం ఆలస్యం చేయలేదు. మొదట కేంద్రమంత్రి ట్విట్టర్ వేదికగా చిరుని పొగడ్తలతో ముంచెత్తారు. తర్వాత బీజేపీ నేతలు స్టార్ స్టార్ మెగాస్టార్ అంటూ పొగడ్తల మోత మోగించారు. ఏపీ, తెలంగాణ గవర్నర్లతో పాటు ప్రధాని మోడీ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో చిరంజీవికి విషెస్ చెప్పారు.
తమ్ముడు చంచలంగానీ అన్న స్థితప్రజ్ఞుడనే అభిప్రాయం బీజేపీ నాయకత్వంలో బలంగా ఉంది. బీజేపీలోకి ఎప్పుడో చిరంజీవికి ఆహ్వానం ఉన్నా రాజకీయవైరాగ్యంలో ఉన్న మెగాస్టార్ ఆసక్తిచూపలేదు. మోడీ చేతులమీదుగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఆ ప్రోగ్రాంలో చిరుని ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. పవన్‌కల్యాణ్‌ని విశాఖకు ఆహ్వానించి అరగంటపైనే మోడీ భేటీ అయ్యారు. అన్ని విషయాలు మాట్లాడి ‘భరోసా’ ఇచ్చారు. ఈ మీటింగ్ తర్వాత జనసేనాని స్వరం మారింది. మోడీని ఓ రేంజ్లో పొగిడేశారు. తమ్ముడు మెత్తపడ్డాక అప్పుడు అన్నకు అభినందనలతో బీజేపీ మెగాబ్రదర్స్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.