ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను ఫిక్స్ చేసినట్లేనా ? ఒక్క రిమాండ్ రిపోర్టుతో స్టోరీ మారిపోయనట్లేనా ? ఎంత కాదన్నా ఆన్ రికార్డ్ బుక్కయినట్లేనా ? జైలుకెళ్లేందుకు సిద్ధమని కవిత ఎందుకంటున్నారు ? బయటకు వచ్చిందీ గోరంతే.. రావాల్సింది కొండంత ఉందనుకోవాలా?
అంత సీన్ లేదని అనుకుంటుండగానే ఈడీ పెద్ద సీనే క్రియేట్ చేసింది. గుట్టు చప్పుడు కాకుండా అమిత్ అరోరాను అరెస్టు చేసిన ఈడీ ఆ రిమాండ్ రిపోర్టులో పెద్ద తలకాయల పేర్లు చేర్చింది. ఇంతవరకు తనపై ఎలాంటి అభియోగాలు లేవని తనకు క్లీన్ చిట్ వచ్చినట్లేనని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించిన రెండు రోజులకే అరోరాకు సంబంధించిన 32 పేజీల రిమాండ్ రిపోర్టులో ఆయన పేరు కనిపించింది. సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రక్రియలో కొన్ని సెల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఆయనపై ఈడీ ఆరోపణలు చేసింది. అంతకంటే మించిన ట్విస్ట్ కల్వకుంట్ల కవితకు ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉన్నట్లు ఈడీ స్పష్టం చేసింది. కవితది ఎలా కీలక పాత్ర అవుతుందో కూడా వివరించింది. ఇప్పటిదాకా కవిత, సిసోడియా పేర్లు రాకపోవడంతో స్కామ్ మొత్తం మద్యం వ్యాపారులకే పరిమితమైందని అనుమానిస్తూ వచ్చారు. అరోరా రిమాండ్ రిపోర్టుతో అది అంతర్ రాష్ట్ర స్కామ్ గా మారిపోయింది.
చాలా కాలంగా వంద కోట్ల రూపాయల ముడుపుల ప్రస్తావన ఉన్నప్పటికీ ఆ డబ్బు ఎలా వచ్చిందీ ఎవరిచ్చారనే ప్రశ్నలు మిగిలాయి. ఇప్పుడా ప్రశ్నలకు సమాధానం లభించింది. కవితతో పాటు శరద్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు కలిసి మద్యం కుంభకోణానికి కుట్ర పన్నినట్లు తేల్చారు. వందకోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూపులో ఆ ముగ్గురు కీలక పాత్రధారులుగా ఉన్నారు. దొడ్డిదారిన కార్టెల్‌లను ఏర్పాటు చేయడం 12 శాతం మేర అసాధారణ స్థాయిలో హోల్‌సేల్, 180 శాతం మేర రిటైల్ వ్యాపారులకు లాభాలు చేకూర్చడమే ఢిల్లీ మద్యం పాలసీ లక్ష్యంగా ఈడీ గుర్తించింది. దీనివల్ల ఢిల్లీ ప్రభుత్వ ఆదాయానికి 581 కోట్ల రూపాయల మేర గండి పడింది. ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చేందుకు తమ జేబులు నింపుకునేందుకు సౌత్ గ్రూప్ ఈ కుంభకోణానికి ఒడి గట్టినట్లు ఈడీ నిర్ధారణకు వచ్చింది. పైగా స్కామ్ పై చర్చ ప్రారంభమైన వెంటనే అనుమానితులంతా కలిసి సాక్ష్యాధారాలను మటుమాయం చేసేందుకు ప్రయత్నించారు. డిజిటల్ సాక్ష్యాలు లేకుండా చూసుకునేందుకు సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు.
మొత్తం 38 మంది సుమారు 170 ఫోన్లను మార్చారని ఆతర్వాత ఆ ఫోన్లను ధ్వంసం చేశారని అలా ధ్వంసం చేసిన డివైజ్‌ల విలువ కోటి 30 లక్షల రూపాయలుంటుందని ఈడీ అంచనా వేసింది. అందులో కవిత సిసోడియాకు చెందిన ఫోన్లే ఎక్కువగా ఉన్నాయి. ఒక్క రిమాండ్ రిపోర్టుతో టీఆర్ఎస్ వర్గాలు ఖంగుతిన్న మాట నిజం. మోదీ సర్కారు ఈడీ రూపంలో గుక్కతిప్పుకోలేని దె్బ్బకొట్టిందన్నదీ అంతే నిజం. చేసేదేమీ లేక కవిత ఎదురుదాడికి దిగుతున్నారు. విపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని అన్నారు. మోదీని ఎదుర్కొనేందుకు జైలుకెళ్లడానికైనా సిద్ధమని కవిత ప్రకటించారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. కవిత పేరు మొదటి సారి అధికారికంగా ప్రస్తావనకు వచ్చింది. అందులో చాలా లింకులను ఈడీ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈడీ ప్రయోగించింది ఒక పాచిక మాత్రమే. దక్షిణాది నేతలు, వ్యాపారులకు ఢిల్లీ పార్టీలకు ఉన్న వ్యాపార సంబంధాలను ఇంకా తోడి బయటకు తీయాలి. అందుకే సిసోడియా కాదు కేజ్రీవాలే స్కామ్ స్టర్ అన్న సంగతి నిరూపించే ప్రయత్నం జరుగుతోంది. కేజ్రీవాల్ దగ్గర కీలక వ్యక్తిగా ఉన్న విజయ్ నాయర్ వ్యవహారం ఇప్పటికే బయటకు వచ్చింది.
ఇక ఢిల్లీ సీఎం పీఏగా ఉన్న బైభవ్ కుమార్ సెల్ ఫోన్ ను కూడా ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. అంటే రేపోమాపో బైభవ్ కుమార్ ను అరెస్టు చేసినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. కేజ్రీవాల్, సిసోడియా, కవిత మధ్య సంప్రదింపులు, ఆర్థిక లావాదేవీలు, నగదు చేతులు మారిన వ్యవహారాలను వీలైనంత త్వరగా దర్యాప్తు చేయాలి. వంద కోట్ల రూపాయల ముడుపులు అందాయని మాత్రమే ఈడీ ప్రకటించింది. స్కామ్ తో ఢిల్లీకి గండి పడిన ఆదాయాన్ని లెక్కగట్టింది. మరి అందులో కవిత ఇతరులకు ఇచ్చింది ఎంత, ఆమె చేతికి అందింది ఎంత అనేది పెద్దప్రశ్న. ఆ చిదంబర రహస్యాన్ని ఛేదిస్తేనే కేసీఆర్ తనయపై కేసులో ప్రొసీడయ్యే అవకాశం ఉంటుంది. కవితకు నగదు ఎక్కడ నుంచి ఏ రూపంలో వచ్చిందో తెలుసుకోవాలి. ఇచ్చిన వారిని పట్టుకొచ్చి జమ చేసిన వారి వివరాలను సేకరించి కోర్టు ముందుంచాలి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేస్తారా అన్నది పెద్దప్రశ్న. అరెస్టు చేయావచ్చు..అలా చేయకుండానే దర్యాప్తు కొనసాగించి ఒకటి రెండుసార్లు ప్రశ్నించి చార్జ్ షీటు దాఖలు చేయవచ్చు. కోర్టు తీర్పును బట్టి జైలుకు పంపాలా వద్దా అన్నది నిర్ణయమవుతుంది. కవితకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినప్పుడు అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతవరకు మాత్రం ప్రజలకు అర్థం కాని ఒక ప్రశ్న తరచూ వినిపిస్తుంది. కవిత స్కామ్ చేశారా లేదా అన్న ప్రశ్నలకు సరైన సమాధానం ఎప్పటికీ దొరకదు. కవిత తాను నిర్దోషినని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమని బీజేపీ ఆరోపిస్తూనే ఉంటుంది.