పవన్‌ కళ్యాణ్‌ ఇంటి వద్ద రెక్కీ ఆరోపణ ఉత్తదే

By KTV Telugu On 5 November, 2022
image

పవన్‌ హత్యకు రెక్కీ అంటూ గగ్గోలు

ఎలాంటి రెక్కీ జరగలేదన్న తెలంగాణ పోలీసులు

అదిగో పులి అంటే ఇదిగో తోక అనడంలో తెలుగుదేశం నాయకులతో పోటీ పడుతున్నారు జనసేన నేతలు. రాష్ట్రంలో చీమ చిటుక్కుమన్నా దానికి వైఎస్‌ జగనే కారణం అనడం వారికి నిత్యకృత్యంగా మారింది. వారి ఆరోపణలకు దరువెయ్యడానికి ఎలాగూ ఎల్లో మీడియా ఉండనే ఉంది. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని, హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని జనసేన నాయకులు ఆరోపించారు. దానికి కూడా జగన్‌ సర్కారే బాధ్యత వహించాలని గగ్గోలు పెట్టారు. ఈ ఆరోపణలపై విచారణ చేసిన తెలంగాణ పోలీసులు విచారణ జరిపారు.

చివరకు రెక్కీ లేదు…కుట్రా లేదు అని అసలు విషయం చెప్పారు. పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఎలాంటి రెక్కీ జరగలేదని, పవన్ పై దాడికి కూడా కుట్ర కూడా జరగలేదని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు ఒక నివేదికను తెలంగాణ పోలీసు శాఖ విడుదల చేసింది. గత నెల 31న రాత్రి సమయంలో ఆదిత్య, సాయికృష్ణ, వినోద్ అనే ముగ్గురు యువకులు హైదరాబాద్ లోని పవన్ ఇంటి వద్ద పవన్ బౌన్సర్లతో గొడవకు దిగారు. ఈ క్రమంలో పవన్ ఇంటిపై రెక్కీ నిర్వహించేందుకే ఆ యువకులు అక్కడికి వచ్చారని, అంతేకాకుండా పవన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన కొత్త మిత్రుడి తరపున వకాల్తా పుచ్చుకుని అందరినీ చంపేస్తారా అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు… గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే తాము పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కారు ఆపామని, కారును అక్కడి నుంచి తీసేయని చెప్పిన పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగామని ఆ యువకులు చెప్పినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. ఆ యువకులకు నోటీసులు జారీ చేసి, పంపించివేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో రెక్కీ గానీ, పవన్ పై దాడికి కుట్ర గానీ జరగలేదని వారు స్పష్టం చేశారు. మరి కోడిగుడ్డు మీద ఈకలు పీకే పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు ఇప్పుడేమంటారో…?