రాజకీయాల్లో వారసత్వం ఆ నాయకుడి కొడుకు అయినంత మాత్రానే రాదు. ఆ నాయకుడి లక్షణాలు పుణికిపుచ్చుకోవాలి. నాయకత్వం చేయగలనని నిరూపించుకోవాలి. అంత కాలం తండ్రి చేసిన పనులను ముందుకు తీసుకెళ్లగలనని నిరూపించుకోవాలి. అప్పుడే నిలబడగలుగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు వైఎస్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న పీజేఆర్ వారసుల్లో ఇప్పుడు ఆ ఫైర్ కనిపించడం లేదు. వారసుడిగా తెరపైకి వచ్చిన కుమారుడు ఇంకా తప్పటడుగులు వేస్తున్నారు. దశ… దిశ లేకుండా ఉన్నారు. ఆయన కుమార్తెది కూడా జంపింగ్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారు. గతమెంతో ఘన చరిత్ర ఉన్న నాయకుడి వారసులు ఇలా బేలగా మారిపోవడం ఆయన అభిమానుల్ని నిరాశకు గురి చేస్తోంది.
మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి అంటే సాదాసీదాగా ఉంటుంది. పేరుకు ముందు వెనుకా ఎలాంటి విశేషణాలు లేకుండా సింపుల్‌గా పీజేఆర్ అంటే పేద ప్రజల్లో ఓ ఎమోషన్ వచ్చేది. దేశంలో అత్యధిక ఓటర్లు, జనాభా ఉన్న నియోజకవర్గంగా పేరుపొందిన అప్పటి ఖైరతాబాద్ సెగ్మెంట్‌లో పీజేఆర్ అంటే ప్రతీ ఒక్కరికీ ఆత్మీయుడు. అంతకు మించి కార్మిక నాయకుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నుంచి ఆయనకు ఉన్న పట్టు చిన్నది కాదు. పరిశ్రమల్లో కార్మికులందరూ తమ ఆత్మబంధువుగా భావించేవారు. అట్టడుగు స్థానం నుంచి ఎదిగి లక్షల మంది మనసుల్లో చోటు సంపాదించిన పీజేఆర్ .. ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనుకున్న దశలో హఠాత్తుగా చనిపోయారు. అయితే ఆ స్థాయి నేత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన విష్ణువర్దన్ రెడ్డి విఫల నేతగా మిగిలిపోయారు.
పీజేఆర్ చనిపోయినప్పుడు వచ్చిన ఉపఎన్నికల్లో సానుభూతితో గెల్చిన ఆయన ఆ తర్వాత అదే పట్టును కొనసాగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నాలుగు నియోజకవర్గాలుగా విడిపోయింది. ఆయన చివరికి తన తండ్రి నియోజకవర్గం అయిన ఖైరతాబాద్‌ను కూడా సాధించుకోలేకపోయారు. జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేస్తున్నారు. పీజేఆర్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దానం నాగేందర్ ఆ స్థానాన్ని తనదైన రాజకీయాలతో పొంది వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కానీ జూబ్లిహిల్స్ నుంచి ఒక్క సారి గెలిచి రెండు సార్లు ఓడిన పీజేఆర్ తనయుడికి రాజకీయాలు ఒంటబట్టలేదు. ఎప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది.
రెండో సారి ఓడిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఆయన అనుచరులకు కూడా అందుబాటులో ఉండటం కష్టమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. చివరికి రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చినా ఆయన మొహం చాటేశారు. ఈ కారణంగా కాంగ్రెస్‌లో ఆయనను పట్టించుకునేవారే కరవయ్యారు. కాంగ్రెస్‌లో ఉన్న గ్రూప్ రాజకీయాలను తన తండ్రి .. తాను ఎలా ఎదగడానికి ఉపయోగించుకున్నారో అందులో పదిశాతం కూడా విష్ణువర్ధన్ రెడ్డి అందుకోలేకపోతున్నారు. ఫలితంగా ఒంటరైపోయారు. ఇప్పుడాయన కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో చెప్పడం కష్టమే. అలాగని రాజకీయాల్లోనే యాక్టివ్‌గా లేరు. ఇలాంటి వ్యూహం పొలిటికల్‌గా ఆత్మహత్యా సదృశమే. ఈ రకంగా పీజేఆర్ తనయుడిగా విష్ణువర్ధన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయినట్లే అనుకోవాలి.
ఆయన కుమార్తె విజయారెడ్డి పీజేఆర్ మరణం తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఒకేకుటుంబానికి పలు రకాల టిక్కెట్లు దొరికే చాన్స్ లేదని టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే అక్కడా ఆమెకు కావాల్సినంత రాజకీయం నేర్చుకోలేకపోయారు. తన తండ్రి నియోజకవర్గం ఖైరతాబాద్‌ను కార్యక్షేత్రం చేసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కార్పొరేటర్ కంటే ముందుకు పోలేకపోయారు. రెండు సార్లు సీటు ఆశించారు కానీ.. ప్రయోజనం లేకపోయింది. టీఆర్ఎస్ ఆమెను పీజేఆర్ స్థాయి నాయకురాలిగా గుర్తించలేదు. దీంతో చూసి చూసి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లోకి జంప్ కొట్టారు. కానీ అక్కడ టిక్కెట్ దొరుకుతుందాలేదా అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. వాస్తవంగా అయితే ఆమె తిరిగిరావాలే కానీ ఏ టిక్కెట్టైనా ఆఫర్ చేయగలిగిన కెపాసిటీ.. ఆమె బ్యాక్ గ్రౌండ్‌కు ఉంది. కానీ అవకాశం కోసం పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం విష్ణువర్దన్ రెడ్డి రాజకీయ జీవితం ఆగమ్య గోచరంగా ఉంది. విజయారెడ్డి కారు దిగి అభయహస్తం కోసం రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం చూస్తున్నారు. జననేతగా పేరు తెచ్చుకుని.. హఠాత్తుగా మరణించిన నేత వారసత్వాన్ని ఈ ఇద్దరూ పంచుకుంటున్నారు. కానీ చెట్టు పేరు చెప్పి ఇప్పటికీ కాయలమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ.. ఆ నేత స్థాయిలో నాయకత్వ లక్షణాలు… నాయకత్వం అందించలేకపోతున్నారు. అయితే ఇప్పటికీ మించిపోయింది లేదు.. వారికి కావాల్సినంతగా అండ ఉంది. వీరు మద్దతుగా ఉంటారు… తమ బతుకుల్ని బాగు చేస్తారు అనుకుంటే పాత పీజేఆర్ అభిమానం అంతా పొంగి పొర్లుతుంది. వీరికి మద్దతు దొరుకుతుంది. అందుకే వీరు చూపించాల్సింది పోరాట పటిమ.. నాయకత్వ లక్షణాలే. అవి ఉన్నాయా లేదా అన్నది డౌట్ వచ్చేలా ఇప్పటి వరకూ వీరి నడకలు సాగాయి. ఇక ముందైనా తమ రాజకీయం చూపిస్తారా ? పీజేఆర్ వారసులు… పీజేఆర్ లో సగం కాదు.. పీజేఆర్‌కు డబుల్ అని నిరూపిస్తారా?