ఆ రాష్ట్రంలోనూ ఓ సిద్ధూ… ఏం చేస్తారో మరి….

By KTV Telugu On 9 April, 2022
image

నవజ్యోత్ సింగ్ సిద్ధూ… రాజస్థాన్ కు షిఫ్టయ్యాడా.. సిద్ధూ తహరాలోనే మరో నేత రాజస్థాన్ లో పార్టీని ఇబ్బంది పెడుతున్నాడా…పంజాబ్ అనుభవంతో కాంగ్రెస్ అధిష్టానం కాస్త ముందే మేల్కోందా.. రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగి ఆ నేతను బుజ్జగిస్తున్నారా… అర్థం చేసుకోండి బ్రదర్ అనే పరిస్థితి వచ్చిందా…

బీజేపీ రోజువారీ కొట్టే దెబ్బలకు కాంగ్రెస్ బెంబేలెత్తిపోతోంది. కేంద్రంలో అధికారం ఎలాగూ పోయింది. రాష్ట్రాలు కూడా ఒకటొకటిగా జారిపోతుండగా… హస్తం పార్టీ ఖాతాలో ఇప్పుడు రెండు రాష్ట్రాలే మిగిలాయి. రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో అధికారం చేజారిపోకుండా చూసుకునేందుకు సోనియా టీమ్ నానా తంటాలు పడుతోంది. ఛత్తీస్ గఢ్ నుంచి ఇప్పటికిప్పుడు ఎలాంటి సమస్యలు లేకపోయినా రాజస్థాన్ వ్యవహారం మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 17నెలల వ్యవథిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శక్తిమంతుడైన రెబెల్ నేతను బుజ్జగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది…

పంజాబ్ పరిణామాలతో గుణపాఠం

బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ క్రికెటర్ సిద్ధూ… పంజాబ్ లో కాంగ్రెస్ ను చిన్నాభిన్నం చేశారు. నిత్య అసంతృప్తిపరుడిగా, నిత్య రెబెల్ గా మారి పార్టీకి ఇరకాటంలో పెట్టారు. అప్పటి సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ను గద్దె దించే దాకా పట్టు వీడలేదు. సిద్ధూకు సీఎం పదవి ఇవ్వలేని పరిస్థితుల్లో చరణజిత్ సింగ్ చన్నీకి అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. దళిత సీఎం అంటూ ప్రచారం చేసుకున్నా… పార్టీకి కలిగిన ప్రయోజనం శూన్యం. చివరకు చేజేతులా ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారాన్ని అప్పగించాల్సి వచ్చింది. రాజస్థాన్లో అలాంటి దుస్థితి రాకుండా చూసుకునేందుకు కాంగ్రెస్ ముందుగానే జాగ్రత్త పడుతోంది…

2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రాజకీయ భీష్మాచార్యుడైన అశోక్ గెహ్లాట్ కే పార్టీ అధిష్టానం సీఎం పదవిని అప్పగించింది. అయితే 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రం నుంచి ఆ పార్టీకి ఒక ఎంపీ సీటు కూడా దక్కలేదు. గెహ్లాట్ పాపులారిటీ తగ్గిందని అర్థం చేసుకున్న సచిన్ పైలట్ 2020లో ఒక సారి తిరుగుబాటు చేశారు. తన అనుచర ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీ కార్యాలయ సింహద్వారం దాకా వెళ్లారు. కాంగ్రెస్ అధిష్టానం భంగపడి, బతిమలాడి ఆయన్ను వెనక్కి రప్పించుకుంది. మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింథియా తరహా పరిణామాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడింది.. తిరుగుబాటు ప్రయత్నాన్ని విరమించుకున్న తర్వాత సచిన్ పైలట్ ఎలాంటి సాహసాలు చేయలేదు.ఆయనలోని అసంతృప్తి మాత్రం నివురు గప్పిన నిప్పులా కొనసాగుతోంది….

పైలట్ కు బీజేపీ గాలం

అసెంబ్లీ ఎన్నికలు రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయమే ఉన్న తరుణంలో సచిన్ పైలట్ కు బీజేపీ గాలం వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన వర్గం ఎమ్మెల్యేలను లాగేస్తే.. గెహ్లాట్ ను దించేసి.. బీజేపీ సర్కారు ఏర్పాటు చేసుకోవచ్చని కమలం పార్టీ వ్యూహం పన్నింది. అలా జరిగిన పక్షంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కూడా సులభమవుతుందని బీజేపీ ఆశించింది. కమలనాథుల గేమ్ ప్లాన్ అర్థం చేసుకున్న రాహుల్ గాంధీ.. హుటాహుటిన సచిన్ పైలట్ ను ఢిల్లీ పిలిపించుకున్నారు. ఉదయం సందేశం పంపి..సాయంత్రం మీటింగ్ పెట్టారు. సమావేశానికి సచిన్ అనుకూల వర్గానికి చెందిన మరో ఇద్దరు ముగ్గురిని మాత్రమే పిలిచారు. సచిన్ తో పాటు వారి అభిప్రాయాలను కూాడా తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తామని నేరుగా చెప్పకుండా.. సరైన సమయంలో వారి ఆకాంక్షలు నెరవేరుతాయని రాహుల్ స్వయంగా హామీ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పైలటే సారథి అన్న సందేశం రాహుల్ మాటాల్లో ధ్వనించినట్లు ఆంతరంగికుల సమాచారం…

పైలట్ వ్యూహమేంటి ?

పైలట్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, శాంతి భద్రతలు క్షిణించాయని రాహుల్ సమక్షంలో ఆరోపించారు. ఆధారాలతో కూడిన కొన్ని పైల్స్ కూడా అధిష్టానానికి సమర్పించారు. తను కోరుకున్నది జరగకపోతే బీజేపీ వైపుకి వెళ్లే ఆప్షన్ ఉంటుందని, ఇప్పుడు తన దగ్గరున్న ఫైల్స్ కాపీలు వాళ్లకి చేరతాయని పరోక్షంగా హెచ్చరించారు. మరి ఆయన ఆలోచనను కాంగ్రెస్ అధిష్టానం అర్థం చేసుకుంటుందో లేదో చూడాలి. గతంలో సచిన్ పైలట్ మద్దతుదారులు కొందరికి రాజస్థాన్ కేబినెట్లో చోటు దొరికింది. అదే ఫార్ములాను మరోసారి అమలు చేస్తూ మరికొందరికి అవకాశం ఇస్తే పైలట్ చల్లబడే అవకాశాలుంటాయి. పెద్ద హామీ ఎలాగూ పెండింగ్ లో ఉందనుకోండి….