క్రికెటర్ భార్యగా కాదు బ్యాక్‌గ్రౌండ్ స్ట్రాంగ్
గుజరాత్‌లో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న కమలం పార్టీ ఎన్నికల స్ట్రాటజీ మార్చింది. కష్టమనుకున్నవాళ్లని నిర్మొహమాటంగా పక్కనపెడుతోంది. కొత్త మొహాలను తెరపైకి తెస్తోంది. గుజరాత్ బీజేపీలో కొత్త రక్తాన్ని నింపాలనుకుంటోంది. టీమిండియా క్రికెట్ రవీంద్రజడేజా భార్య రివాబా బీజేపీ అభ్యర్థిగా తెరపైకి రావడం అందులోభాగమే. జడేజా భార్య రివాబాకి బీజేపీ జామ్‌నగర్ నార్త్ టికెట్ కేటాయించింది. తన భార్యకు టికెట్ ఇవ్వడంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు జడేజా థాంక్స్ చెప్పాడు. తన అర్ధాంగిపై నమ్మకంతో ప్రజాసేవా చేసే అవకాశమిచ్చారని జడేజా స్పందించాడు.
క్రికెటర్ భార్యగా కాదు రివాబా జడేజాకి గట్టి బ్యాక్‌గ్రౌండే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన రివాబా కాంగ్రెస్ సీనియర్ నేత హరిసింగ్ సోలంకికి సమీప బంధువు. రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన రివాబాకు జామ్‌నగర్-సౌరాష్ట్ర ఏరియాల్లో పట్టుంది. శ్రీ మాతృశక్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆమె ఇప్పటికే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలికల సంక్షేమం, విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ రివాబా అందరికీ సుపరిచితమే. 2019లో బీజేపీ కండువా కప్పుకుని రివాబా రాజకీయ అరంగేట్రం చేశారు. ముందుచూపుతో రెండేళ్లుగా ఆమె జామ్‌నగర్ జిల్లాలో దాదాపు 135 గ్రామాలను సందర్శించారు. బీజేపీ కూడా ఆమెకు గట్టి పట్టున్న నియోజకవర్గంనుంచే బరిలో దింపింది.
బీజేపీలో చేరడానికి ముందు రివాబా 2018లో కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్‌గా నియమితులయ్యారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రివాబాకు ఫేస్‌బుక్‌లో 6.77లక్షల మంది, ఇన్‌స్టాలో 8,385 మంది ఫాలోవర్లు ఉన్నారు.
బీజేపీ క్రికెటర్ భార్యకు టికెట్ ప్రకటించంతో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి రవీంద్రజడేజా సోదరి నైనాని కాంగ్రెస్ పోటీకి దించాలనుకుంటోంది. 2019 ఏప్రిల్‌లో కాంగ్రెస్‌లో చేరిన నైనా ప్రస్తుతం జామ్‌నగర్ కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. రివాబాతో ఆమకు మొదట్నించీ పరిచయం ఉంది. నైనా పోటీకి దిగితే సోదరి- అర్ధాంగి పోరులో రవీంద్రజడేజా ఇరకాటంలో పడక తప్పదేమో!