అగ్నిపథ్ అగ్గి రాజేసింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలు నిరసనలతో అట్టుడికాయి.. నిరుద్యోగుల ఆందోళనలకు రైళ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఆర్మీ నియామకాల్లో కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త విధానానికి వ్యతిరేకంగా జనం గళమెత్తారు. హింసకు కూడా దిగారు. విపక్షాలు విమర్శలు సంధిస్తున్నా… ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది..
సైనిక దళాల్లో షార్ట్ టర్మ్ ఉద్యోగమైన అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు పెల్లుబికాయి. సికింద్రాబాద్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బిహార్ ఛాప్రాలో కూడా కొందరు యువకులు బరౌనీ గోండా ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టారు. బిహార్‌లోని అనేక ప్రాంతాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. జమ్మూలో ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసు బయట నిరసన ప్రదర్శన జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఒక ఎమ్మెల్యే కారుపైనా దాడి చేశారు.
అగ్నిపథ్ నియామకాల కోసం టూర్ ఆఫ్ డ్యూటీ పేరుతో ప్రత్యేక ర్యాలీలు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. వచ్చే మూడు నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఈ ఏడాది తొలి బ్యాచ్ కింద 45వేల మంది యువతను నియమించుకోనున్నారు. అగ్నిపథ్ సర్వీసులో చేరేందుకు పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆరు నెలలు శిక్షణ ఇచ్చి.. నాలుగేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు. ఆర్మీ సర్వీసు పూర్తయ్యాక మెరుగైన ప్యాకేజీతో పాటు తుది దశ ఎంపికలో ప్రతిభ చూపిన 25 శాతం మందికి శాశ్వత కమిషన్‌లో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.
అగ్నిపథ్‌లో చేరిన యువతకు సైనికులతో సమానంగా ర్యాంకులు, వేతనాలు ఉంటాయి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ మంజూరుతో పాటు పదవీ విరమణ తర్వాత ఆర్మీకి ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనల్లో మార్పులు చేస్తారు. వైద్యపరీక్షల్లో ఉత్తీర్ణత, ఇతర అర్హతలు ఉన్నవారికే అగ్నిపథ్‌లో ప్రవేశం లభిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు కేంద్ర డేటాబేస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఎంపికలు ఆటోమేటెడ్ పద్ధతిలో జరుగుతాయి. అగ్నివీరులుగా ఎంపికైన వారికి ఏదైనా రెజిమెంట్, యూనిట్, సంస్థలో పోస్టింగ్‌తో పాటు సైనిక బలగాల తరహాలో ర్యాంకు ఇస్తారు. సర్వీసు కాలంలో 30వేల నుంచి 40వేల రూపాయల వరకు జీతం, ఇతర సదుపాయాలు అందిస్తారు. పనిచేసిన కాలానికి వేతనం నుంచి 30 శాతాన్ని సేవానిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా కేంద్రం తనవంతు జమచేస్తుంది. నాలుగేళ్ల సర్వీసు తర్వాత ఏకమొత్తంగా 11లక్షల 71 వేల రూపాయలు పన్ను మినహాయింపుతో అందుతాయి. బ్యాంకు నుంచి 16 లక్షల 50వేల రూపాయల రుణసదుపాయం కూడా ఉంటుంది. దీంతో పాటు సర్వీసులో 48లక్షల రూపాయల వరకు బీమా రక్షణ ఉంటుంది.
నాలుగేళ్లు పూర్తయిన తర్వాత వారికి కార్పొరేట్, పరిశ్రమలు, సీఏపీఎఫ్, డీపీఎస్‌యూ సెక్టార్ల సహా ఇతర రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు పొందే వీలుంటుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. అగ్నివీరులుగా ఎంపికైన వారి కోసం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మూడేళ్ల నైపుణ్యం ఆధారిత బ్యాచిలర్ డిగ్రీ కోర్సుని ప్రారంభించనుంది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ రూపొందించిన ఈ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో అగ్నివీర్లకు 50 శాతం క్రెడిట్స్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇగ్నో అందించే ఈ డిగ్రీ ప్రోగ్రామ్ భారత్‌లో, విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలు పొందే వీలుంటుంది. అగ్నిపథ్ కింద పదిహేడున్నర నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు వారిని ఎంపిక చేయడం వలన వారిలో రిస్క్ చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని, తద్వారా సాయుధ బలగాల సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తేలేదని వాదిస్తున్నారు.
ఉద్యోగ భద్రత ఉండదనే ప్రధాన కారణంతో యువకులు ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఆర్మీలో జాయిన్ అయ్యాక దాదాపు 17 ఏళ్లు సర్వీసు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కొంతమందికి రెండు మూడేళ్ల పొడిగింపు కూడా ఇస్తున్నారు. వారందరికీ జీవితకాల పెన్షన్ మంజూరవుతుంది.
ఇప్పుడు అగ్నిపథ్ స్కీమ్ అమలైతే.. నాలుగేళ్లలో రిటైరవుతారు. పైగా వారికి ఎలాంటి పెన్షన్ సౌకర్యమూ ఉండదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పైగా మిలటరీ హాస్పిటల్ సౌకర్యం, క్యాంటిన్ లాంటి సదుపాయాలు కూడా ఉండవంటూ వస్తున్న కామెంట్స్ కూడా యువకుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. సైన్యంలో జాబ్ అంటే మాటలు కాదు.. కొందరు యువకులు ఫిజికల్, రిటన్ టెస్టులో పాస్ అయ్యేందుకు ప్రైవేట్ సంస్థల్లో శిక్షణ కూడా తీసుకుంటారు. ఇందుకోసం డబ్బు బాగానే ఖర్చుపెడుతున్నారు. అంత కఠినతరమైన మెరిట్ లో నిలిచి ఉద్యోగానికి ఎంపికైనా నాలుగేళ్లకే ఇంటికి పంపిస్తామంటే ఎలా అని వాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయినా ప్రాణాలకు తెగించి దేశసేవ చేసే సైన్య విభాగంలో నాలుగేళ్ల ఉద్యోగం ఏంటి విచిత్రంగా అని ఆర్మీ అధికారులు కూడా విమర్శలు చేస్తున్నారు. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో చాలామంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. దేశభద్రతకు సంబంధించిన ఆర్మీలాంటి విభాగాలపై పెట్టే ఖర్చును ప్రభుత్వం లెక్కలు వేసుకోవడం మరీ విచిత్రంగా ఉందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. కాంట్రాక్ట్ సైనికులను మోదీ ప్రభుత్వం తయారు చేస్తోందని.. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం దొరక్కపోతే వాళ్లు మిలీషియా సభ్యులుగా మారే ప్రమాదమూ లేకపోలేదన్న అభిప్రాయలు వస్తున్నాయి.