షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు..కేసీఆర్ క్లారిటీ!
ముందస్తేం లేదు.. ముందుజాగ్రత్తలు తీసుకోండి!
ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి ప్రకటించారు. టీఆర్ఎస్ పేరు కాస్తా బీఆర్ఎస్గా మారిపోయింది. కేసీఆర్ జాతీయరాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే వారసుడికి రాష్ట్ర పగ్గాలు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఫాంహౌస్ కేసుతో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలనుకుంటున్నారు కేసీఆర్. ఖమ్మం ఎంపీ నామా ఆస్తుల జప్తు, మరో ఎంపీ రవిచంద్ర, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ వ్యాపారసంస్థలపై ఐటీ-ఈడీ దాడులతో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పారాహుషార్ అంటూ నాయకుల్ని అలర్ట్ చేసింది. ఈ సమయంలోనే టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు కేసీఆర్.
మునుగోడులో బీజేపీ ఎత్తుగడలను టీఆర్ఎస్ తిప్పికొట్టింది. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు బీజేపీకి దక్కకుండా చేసి తన ఖాతాలో వేసుకుంది. సమరోత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ ఇదే ఊపులో ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చనుకున్నారు. కానీ తాజా మీటింగ్‌తో అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చేశారు కేసీఆర్. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పేశారు. సరిగ్గా ఏడాదే ఉంది. ముందస్తుకు వెళ్లాల్సిన పన్లేదని ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండి పట్టు పెంచుకోవాలని టీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశం చేశారు.
వరసగా రెండోసారి అధికారంలోకొచ్చిన టీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి కూడా గులాబీ జెండా ఎగరాలనుకుంటోంది. ఈసారి కేసీఆర్ టార్గెట్ 100 సీట్లు. బీజేపీది హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో బలంలేదని టీఆర్ఎస్ విశ్లేషిస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్‌లో నాయకులు బలంగా ఉండబట్టే బీజేపీ గెలిచిందని భావిస్తోంది. రాష్ట్రంలో దాదాపు మూడొంతుల నియోజకవర్గాల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ నాయకులే లేరని టీఆర్ఎస్ చెబుతోంది. తాజా సమావేశంలో కూడా బీజేపీపై యుద్ధం ప్రకంటించారు గులాబీబాస్. బీజేపీ కుట్రలు, కుయుక్తులను తిప్పికొట్టాలంటూనే ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చేలా అనవసర వివాదాల జోలికి వెళ్లొద్దని ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. ఈ మీటింగ్‌తో కేసీఆర్ ఎన్నికల భేరీ మోగించినట్లే. ఇక ప్రతీ అడుగూ టార్గెట్-2023గానే ఉండబోతోంది.