ఎనిమిదేండ్ల తెలంగాణ అరుదైన పయనం – అభివృద్ధి అనితర సాధ్యం !

By KTV Telugu On 2 June, 2022
image

ఓ చిన్న పిల్లవాడ్ని ఆరేడేళ్ల తర్వాత సడన్‌గా చూస్తే ఏమనిపిస్తుంది ?అప్పుడే అంత ఎత్తు ఎదిగిపోయాడా ? అనిపిస్తుంది. అదే రోజూ ఆరేళ్ల నుంచి రోజూ చూసేవారికి ఏమనిపిస్తుంది. పెరిగినట్లే అనిపించదు. ఆరేళ్ల కిందట గురించి ఆలోచిస్తే మాత్రమే బాగా ఎదిగాడని అనిపిస్తుంది. అది ఒక్క మనిషి భౌతిక అభివృద్ధికే కాదు..  అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. తెలంగాణ రాక ముందు తెలంగాణకు వచ్చి వెళ్లిన వాళ్లు ఇప్పుడు వచ్చి చూస్తే..  ఎనిమిదేండ్లలోనే ఇంత అభివృద్ధా అని ఆశ్చర్యపోతారు. కానీ తెలంగాణలోనే ఉండి.. అభివృద్ధిని నిరంతరం చూస్తున్న వారికి పెద్దగా తేడా అనిపించదు. కానీ ఒక్క సారిగా ఎనిమిదేళ్ల వెనక్కి చూసుకుంటే తెలంగాణ సాధించిన అద్భుత విజయం కళ్ల ముందు కనిపిస్తుంది.

సాగునీటి – మంచినీటి సమస్య తీరింది !

ధాన్యం ఉత్పత్తి ఏడేళ్లలో అయిదు రెట్లు పెరగింది. అంటే సాగునీటి లభ్యత పెరిగిందని అర్థం. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ వంటి కార్యాచరణతో వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ధి జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీడీపీలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్‌, నీటి పారుదల రంగాల్లో తెలంగాణ దేశ సగటుతో పోలిస్తే మెరుగైన అభివృద్దిని చూపిస్తోంది. తెలంగాణ అభివృద్ధిని కరోనా కూడా ఆపలేకపోయింది. కోవిడ్ కారణంగా దేశ జీడీపీ 3 శాతం తగ్గగా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2.4 శాతం పెరిగింది. ఇవన్నీ నీతి ఆయోగ్ విడుదల చేసిన లెక్కలే.  గతంలో హైదరాబాద్ శివార్లలో కానీ గ్రామాల్లో కానీ మంచినీటి ఎద్దడి కారణంగా కొత్త కనెక్షన్లు ఇవ్వబడవు అనే బోర్డులు కనిపించేవాలి. కానీ ఇప్పుడు అలాంటి బోర్డులు అవసరం లేదు. మంచినీటికీ ఇబ్బంది లేదు. ప్రజల సామాన్యఅవసరాలు తీర్చడంలో మొదట తెలంగాణ సక్సెస్ అయింది. ఇతర రాష్ట్రాలు… దేశంలోని అనేక రాష్ట్రాలు ఇంకా ఇందులో వెనుకబడే ఉన్నాయి.

ప్రజల ఆదాయం మూడింతలు పెరిగింది !

తలసరి ఆదాయంలో దేశంలోనే అత్యధికంగా 19 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. తెలంగాణలో ప్రతి మనిషి సగటున రూ. 2 లక్షల 78 వేల వరకూ సంపాదిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత తెలంగాణ జీఎస్‌డీపీ ఎనిమిదేళ్లలోనే  రెట్టింపు అయింది. తెలంగాణ అభివృద్దిని కరోనా కూడా ఆపలేకపోయింది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ 18.5 శాతం అద్భుత ప్రగతి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో ఇది 6.6శాతం మాత్రమే ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి జీఎస్‌డీపీ 93.8 శాతం పెరిగింది. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానం.  రాష్ట్ర ఆవిర్భావం సమయంలో దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతం ఉండగా ఏడేళ్లలో ఇది 5 శాతానికి పెరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణలో దేశంలోనే ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు పదకొండో స్థానంలో ఉండేది. రాజకీయంగా ఎలా ఉన్నా తెలంగాణ సామాజికంగా.. ఆర్థిక పరంగా మెరుగ్గా అభివృద్ది చెందుతోందన్న అభిప్రాయం  బలంగా ఉంది.

అనుమానాలు పటాపంచలు చేసిన తెలంగాణ !

జీఎస్‌డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ భారీగా జీఎస్డీపీని అందిస్తున్నాయి. అదే సమయంలో టెక్స్‌టైల్స్, లెదర్, ఫుడ్‌ ప్రాసెసింగ్, మినరల్స్‌ వంటి సంప్రదాయ రంగాలు కూడా మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇక ఫార్మా రంగంలో తెలంగాణను లీడర్‌గా నీతి ఆయోగ్ తెలిపింది. దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్‌ వాటా 20 శాతంగా ఉంది. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయని .. సాధారణ టూరిజంతో పాటు మెడికల్ టూరిజం కూడా హైదారబాద్‌లో భారీగా వృద్ధి చెందుతోంది. దీర్ఘకాలంలో తెలంగాణకు మేలు చేసే కార్యక్రమాలు తొలి దశలోనే చేపట్టడం వల్ల అనూహ్యమైన ప్రగతి తెలంగాణలో కనిపిస్తున్నాయని నీతి ఆయోగ్ లాంటి సంస్థలు చెబుతున్నాయి.

కళ్ల ముందు కనిపించేదే నిజం !

దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ అని కేసీఆర్ పదే పదే చెబుతూంటారు. అయితే కేసీఆర్ చెప్పేది మాట వరుసకేమో అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. కానీ కేంద్రం కూడా చెబుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి , తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచింది. దేశంలో ఏ ఇతర రాష్ట్రాలు సాధించనంత వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని అప్పట్లో నిపుణులు విశ్లేషించారు.. కానీ ఊహించని రీతిలో ఎదిగిందని వాస్తవ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికి కంటే విడిపోయిన తర్వాత తెలంగాణ అద్భుత ప్రగతి సాదిస్తోందని బంగారు తెలంగాణ దిశగా వెళ్తున్నామని.. దానికి అభివృద్ధే సూచిక అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం ఎన్ని విమర్శలు అయినా చేయవచ్చు.  తెలంగాణ ఏర్పాటు ఓ అద్భుతం అయితే.. పయనం అజరామరం. అయితే సమస్యలేమీ లేవా అంటే.. సమస్యలు లేకుండా ఏ మనిషి ఉండరు.. ఏ రాష్ట్రం ఉండదు. వాటిని సమర్థవంతంగా పరిష్కరించుకుంటూ వెళ్లడమే అసలైన కర్తవ్యం. ఈ విషయంలో తెలంగాణ పురోగమిస్తోంది.