నిజామాబాద్ నుంచి అర్వింద్ ప్యాకప్ ? వెంటాడుతున్న పసుపు బాండ్ !

By KTV Telugu On 14 June, 2022
image

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ గత ఎన్నికల్లో గెలవడనికి ఓ బాండ్‌ను ఫ్లెక్సీలుగా ప్రింట్ చేయించి.. నియోజకవర్గం మొత్తం అంటించారు. ఆ బాండ్‌లో ఏముందంటే గెలవడానికి పసుపుబోర్డు తెస్తానని లేకపోతే రాజీనామా చేస్తానని. కానీ ఇప్పటి వరకూ పసుపు బోర్డు రాలేదు.. కానీ అరవింద్ రాజీనామా చేయలేదు. అందుకే పసుపు రైతులు రగిలిపోతున్నారు. మోసం చేశారని ఓటర్లూ మండిపడుతున్నారు. దీంతో అర్వింద్ ఈ సారి నిజామాబాద్ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూసుకున్నారు.

నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవితపై గెలుపొందిన బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌కు గెలిచిన కొద్ది రోజులకే సెగ ప్రారంభమయింది. ఎంపీ అరవింద్ గెలవడానికి ప్రధాన కారణం పసుపు బోర్డు. నిజామాబాద్‌లోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల్లో పసుపు రైతులు ఆ సమయంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అంతకు ముందు ఎంపీగా ఉన్న కవిత పసుపుబోర్డు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. అయితే స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని ఆమె మంజూరు చేయగలిగారు. ప్రైవేటు బిల్లులు పెట్టి కవిత 0చేయగలిగిందంతా చేశారు. కానీ బీజేపీ సర్కార్ ఇవ్వలేదు.

అదే హామీని అరవింద్ ఇచ్చారు. ఆయన ఉత్తుత్తి హామీలు ఇవ్వలేదు. బాండ్ పేపర్లు రాసిచ్చారు. దాంతో రైతులు ఆయనకు ఏకపక్షంగా మద్దతు పలికారు. ఆ విషయం పోలింగ్ సరళిలో తేలింది. ఆ సమయంలో  ఎన్నికల బరిలో కూడా… కొన్ని వందల మంది పసుపు రైతులు నామినేషన్లు వేసి పోటీకి నిలిచారు. అరవింద్ పన్నాగంలో రైతులు చిక్కుకున్నారు. అర్వింద్ గెలిచారు. గెలిచినప్పటి నుండి పసుపు బోర్డు కోసం రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ పసుపు బోర్డు కాకుండా.. స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని అరవింద్ తీసుకు వచ్చారు. అయితే ఇది రైతుల్ని సంతృప్తి పరచలేదు. పసుపుబోర్డుపై ఆయన ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.

ఎలాగోలా రైతుల్ని ఒప్పించాలనుకుంటున్న అరవింద్ రైతులతో సమావేశమై.. వారిని కన్విన్స్ చేసేందుకు అర్వింద్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. కానీ రైతులు అంగీకరించడం లేదు.  ఓ సమావేశంలో రైతులు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, 15 వేలు మద్దతు ధర ఇప్పిస్తానని..నేను ఎక్కడా చెప్పలేదని ధర్మపురి అర్వింద్ ఎదురుదాడికి దిగుతున్నారు. పసుపు బోర్డు తెస్తానని మాత్రమే చెప్పానంటున్నారు. పసుపు ధరకు మద్దతు ధర కోసం మాట్లాడుతున్నానని చెబుతున్నారు. అంటే ఆయన పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడిపోయారని అర్థమవుతుంది.

మోసపోయిన రైతులకు అండగా కవిత ఉంటున్నారు. పసుపు బోర్డు తీసుకు వస్తానని బాండ్ రాసి ఇచ్చి ఓట్లు వేయించుకుని.. మూడేళ్లయినా ఎలాంటి బోర్డు తీసుకు రాని నిజామాబాద్ ఎంపీని ఎక్కడిక్కకడ అడ్డుకుంటామని  కవిత ప్రకటించారు. 2015 లోనే   స్పైసెస్ బోర్డు రీజనల్  ఆఫీస్ ను పెట్టామని… 2017 లోనే డివిజనల్ ఆఫీస్ పెట్టామనే విషయాన్ని ఇప్పటికే ప్రజల దృష్టికి తీసుెళ్లారు. బోర్డు తెచ్చే వరకు ఎక్కడి కక్కడ అడ్డుకుంటామని ..జిల్లా ప్రజలకు ఎంపి సమాధానం చెప్పాలని కవిత  పట్టుబడుతున్నారు.

నిజామాబాద్‌లో గడ్డు పరిస్థితి కనిపిస్తూండటంతో అరవింద్ ఆర్మూరు నుంచి బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తానికి ఆయన సమయం కేటాయించడం లేదు. ఆర్మూర్‌లోనే ఇల్లు తీసుకుని అక్కడ రాజకీయం చేస్తున్నారు. అంటే పసుపుబోర్డు హామీ నెరవేర్చకుండా పోటీ చేస్తే కష్టమని డిసైడయ్యే.. పరావుతున్నారని అనుకోవచ్చు.