రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించడంపై దేశవ్యావ్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయ అంచనాలు, విశ్లేషణల సంగతి ఎలా ఉన్నా రూ. రెండు వేల నోట్లను ఉపసంహరించాలని నిర్ణయించడంపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఎందుకంటే సామాన్యులు రెండు వేల నోటు చూసి చాలా కాలం అయింది. వ్యూహాత్మకంగా వీటి సర్క్యూలేషను చాలా కాలంగా ఆర్బీఐ నియంత్రిస్తూ వస్తోంది. నాలుగేళ్ల కిందటే ముద్రణ కూడా ఆపేసింది. బ్యాంకుల్లో కూడా ఇవ్వడం తగ్గించారు. ఇక ముందు ఇవ్వరు. మరి ఇప్పటి వరకూ చెలామణిలో ఉన్న నోట్లన్నీ ఎక్కడకు పోయాయి. ఈ సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. నిజంగానే ఆ డబ్బులన్నీ నోట్లన్నీ ఎక్కడికి పోయాయో కొంత మందికి తెలుసు. ఎన్నికల సమయంలో బయటకు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు ముందే బయటకు రావాలి లేకపోతే ఎందుకూ పనికి రావు.
రూ.2వేల నోటు రద్ధు అనేది రాజకీయ రంగంపైనే ఎక్కువగా ఉంటుంది. రకరకాల మార్గాల్లో కూడబెట్టిన భారీ సొమ్మంతా రాజకీయ నాయకుల వద్దే ఉంటుంది. ఆయా రాజకీయ పార్టీల అధినేత లెవరూ ఈ అంశంపై ఘాటుగా స్పందించకపోవడానికి కూడా అదే కారణమని అనుకోవచ్చు. రాజకీయ రంగం తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై రూ.2వేల నోటు రద్దు కొంత ప్రభావం చూపుతోంది. ఆర్థిక లావాదేవీల లెక్కలు భారీగా తగ్గించి చూపడంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కీలకం. బహుళ అంతస్తుల భవనాలు, విల్లాల నిర్మాణానికి మెటీరియల్ కొనడం మొదలుకుని రకరకాల చెల్లింపులు, క్రయ విక్రయాల్లో లెక్కలన్నీ వేరే రకంగా ఉండే రంగం కావడంతో నల్లధనం కూడబెట్టేందుకు అవకాశాలు అక్కడే ఉంటాయి. ఈ ఏడాది ఆఖరులో 5 రాష్ట్రాలకు సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వరసబెట్టి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఏడాది ఏకంగా లోక్ సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. నోట్ల కట్టలతో రాజకీయ పార్టీలకు, బరిలో దిగే నేలతకూ చాలా పని ఉంది. వారు రియల్ ఎస్టేట్ బినామీల దగ్గర దాచి పెట్టినవన్నీ నోట్ల రూపంలో బయటకు వచ్చే సమయం కావడంతో వ్యూహాత్మకంగా ఆర్బీఐ ఉపసంహరణ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.
2016లో అప్పటి పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్భీఐ రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. అయితే ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత 2018-19లో రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేసినట్టు ఆర్బీఐ పేర్కొంది. 2018 మార్చి 31 చెలామణిలో ఉన్న రూ. రెండు వేల నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. ఇది కేవలం 10.8 శాతం మాత్రమే. మార్కెట్ దాదాపుగా మూడున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన రూ. రెండు వేల నోట్లు ఉన్నప్పటికీ చెలామణిలో మాత్రం లేవు. ఇవన్నీ ఎక్కడకు చేరుకున్నాయి అనేది సీక్రెట్ గానే ఉంది. నిజానికి చలామణీలో రెండు వేల నోట్లు లేకపోవచ్చు కానీ రాజకీయ నేతల వద్ద గుట్టలుగా ఉందని అంటున్నారు. దాని అవసరం పడినపుడు అది అలా బయటకు వస్తోందని అంటున్నారు. దేశంలో ఎన్నికలు అంటే ఫండ్స్ పెద్ద ఎత్తున వచ్చి వాలతాయి. అది కూడా లెక్కా జమా లేని నిధులే ఎక్కువగా వస్తాయి. వాటి మీదనే ఆధారపడి ఎన్నికల రాజకీయం మొత్తం సాగుతుంది. దాంతో అలా వచ్చే ఫండింగ్కి అడ్డు కట్ట పడిపోతుంది. ఎవరైనా అధికంగా బ్యాంకుల ద్వారా చెలామణికి ప్రయత్నిస్తే నల్లధనం అని తేలిన వారి బ్యాంక్ లావాదేవీలను జప్తు చేసి వారి మీద ఉక్కు పాదం మోపేందుకు చాన్స్ ఉండనే ఉంది.
అవినితీ రాజకీయ నేతలు ఓట్లను కొనేందుకు ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున నోట్లనే వినియోగిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో రెండు వేల కోట్ల పంపిణీ జరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనుకుంటున్న కొంత మందిరాజకీయ నేతలు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నగదు సేఫ్ జోన్లకు తరలించారని చెబుతున్నారు. అలాంటి వారికి ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం షాకే. ఆ నోట్లన్నీ మార్పించుకుంటే ఎక్కడివి అని ఐటీ, ఈడీ అడుగుతాయి. మార్పించుకోకపోతే మురిగిపోతాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు అండగా ఉండే కాంట్రాక్టర్లకు కొదవు లేదు. లక్షల కోట్లు అప్పు చేసి నిర్మించిన ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు మహారాజ పోషకుల్లాగే ఉన్నారు. వీటి మీద పోగేసిన నల్లధనం మొత్తం ఇప్పుడు బయటకు రావాల్సి ఉంది. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లోనే ఓ చోట మద్యం లావాదేవీలు మొత్తం నగదు రూపంలోనే జరుగుతాయి. ఎంత వసూలవుతోందిbఅనేది అనేది ఎవరికీ తెలియదు. మద్యం తయారీ నుంచి అమ్మకం వరకూ మొత్తం ఒకే మాఫియా చేతుల్లో ఉండటంతో ఎంత మేర బ్లాక్ మనీ తరలి పోతుందో చెప్పడం కష్టం. అలాగే ఇసుక ఇతర ఖనిజాల విషయంలోనూ. నగదు లోనే లావాదేవీలు జరుగుతూండటంతో చాలా వరకూ అలా వచ్చిన బ్లాక్ మనీని వచ్చే ఎన్నికల్లో పంచడానికి రెడీ చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్ననిర్ణయంతో షాక్ కు గురికాక తప్పదని అనుకోవచ్చు.
నిజానికి విపక్షాలను టార్గెట్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకుని ఉంటే అది బీజేపీని కూడా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే బీజేపీ కూడా రాజకీయమే చేయాలి. డబ్బులతోనే రాజకీయంచేయాలి. బీజేపీ ఒక్క పార్టీకే రెండు వేల నోట్ల చెల్లి ఇతర పార్టీలకు చెల్లకుండా పోవు. బీజేపీ దగ్గర ఒక వేళ రెండు వేల నోట్లు ఉంటే ఆ పార్టీ కూడా మార్పించుకోవాలి. ఇక్కడ పార్టీ అంటే బీజేపీ నేతలు అనుకోవచ్చు. అందుకే కేవలంరాజకీయం కోసమే రూ. రెండు వేల నోట్లను రద్దు చేశారని అనుకోలేం కానీ లోతుగా ఆలోచిస్తే మాత్రం పెద్ద నోటు రద్దు ఈ సారి మంచిదే అని ఎక్కువగా ప్లస్ పాయింట్లు కనిపిస్తూంటాయి. సామాన్యులెవరూ ఇబ్బందిపడరు. ఇబ్బందిపడే వర్గం వేరే ఉంటుంది. వారికెంత ఇబ్బంది ఆ ఎపెక్ట్ ఎవరిపైన పడుతుందన్నది ముందు ముందు తెలుస్తుంది.